ప్రపంచ వింతల్లో మహాబలిపురం | Mahabalipuram India Tourism Statistics 2022 Tamil Nadu | Sakshi
Sakshi News home page

ప్రపంచ వింతల్లో మహాబలిపురం

Oct 8 2022 7:50 AM | Updated on Oct 8 2022 7:55 AM

Mahabalipuram India Tourism Statistics 2022 Tamil Nadu - Sakshi

సాక్షి, చెన్నై: ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న మహాబలిపురం ప్రపంచ వింతల్లో చేరటమే కాకుండా పర్యాటకుల సందర్శనలో తాజ్‌ మహల్‌నే అధిగమించి తమిళనాడుకే గర్వకారణంగా నిలిచింది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా భారత ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్కర్‌ విడుదల చేసిన ఇండియా టూరిజం స్టాటిస్టిక్స్‌ 2022 పేరుతో భారత పురావస్తు శాఖ నివేదిక ప్రకారం మన దేశంలో విదేశీయులు ఎక్కువగా సందర్శించే స్మారక చిహ్నాల జాబితాలో తమిళనాడులోని మహాబలిపురం అగ్రస్థానంలో ఉందని ప్రకటించారు. 

పల్లవ రాజులు నిర్మించిన 7వ, 8వ శతాబ్దపు సముద్రతీర దేవాలయాలు, శిల్పా సౌందర్యంతో కూడిన దేవాలయాలు ప్రపంచ ప్రసిద్ధి చెందినవి. వందల ఏళ్ల క్రితం మహేంద్రవర్మ నిర్మించిన రాతి రథాలు, ఆలయాలు కాలంతో పాటు సగర్వంగా నిలుస్తున్నాయి. యునెస్కో జాబితాలో సైతం చోటు సంపాదించింది. ఈ అద్భుతాన్ని చూసేందుకు ఏటా లక్షల మంది ప్రజలు, పర్యాటకులు, విదేశీయులు ఇక్కడికి వస్తుండటం విశేషం. 

ఇండియా టూరిజం స్టాటిస్టిక్స్‌ 2022 
పర్యాటక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఇండియా టూరిజం స్టాటిస్టిక్స్‌ 2022 ప్రకారం, యునెస్కో వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌గా వర్గీకరించిన మహాబలిపురానికి విదేశీ సందర్శకుల సంఖ్యలో తాజ్‌ మహల్‌ను అధిగమించింది. సెప్టెంబరు 27న న్యూఢిల్లీ లోని విజ్ఞాన్‌ భవన్‌లో ప్రపంచ పర్యాటక దినోత్స వం సందర్భంగా ఉపాధ్యక్షుడు జగదీప్‌ ధన్కర్‌ దీనిని విడుదల చేశారు.

పర్యాటక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం చెన్నైకి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న మామల్లపురం (మహాబలిపురం)ను 2021–22లో 1,44,984 మంది విదేశీ పర్యాటకులు సందర్శించారు. 45.50 శాతం మంది విదేశీయులు పర్యటించి మొదటి స్థానంలో నిలువుగా, ఆగ్రాలోని తాజ్‌ మహల్‌ను 38,922 మంది విదేశీ సందర్శకులతో రెండో స్థానంలో నిలిచి 12.21 శాతంగా నిలిచింది. 

మహాబలిపురం విశేషాలు 
ఈ ప్రదేశంలో 7వ , 8వ శతాబ్దపు హిందూ మతపరమైన స్మారక చిహ్నాల సేకరణ ఉంది.  40 పురాతన దేవాలయాలు, స్మారక కట్టడాల్లో గంగా అవరోహణ, పంచ రథాలు, ఏకశిలా పిరమిడ్‌ నిర్మాణాలు, 7వ శతాబ్దానికి చెందిన 10 రాక్‌–కట్‌ గుహ దేవాలయాలు, ఒక బీచ్‌ టెంపుల్‌తో సహా కళాత్మక రాతి నిర్మాణాలు పర్యటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. భారత పర్యాటక శాఖ ప్రచురించిన జాబితాలోని మొదటి 10 స్మారక చిహ్నాలలో ఆరు తమిళనాడులో ఉండటం విశేషం.

మహాబలిపురంలో అనేక అద్భుత క్షేత్రాలతో పాటు సీషెల్, మారిటైమ్‌ హెరిటేజ్‌ మ్యూజియం, 40,000 పైగా అరుదైన సీషెల్‌ నమూనాలు, ముత్యాలు, అక్వేరియంలు, డైనోసార్‌ శిలాజాలు పర్యటకులను సంమ్మోహన పరుస్తాయి. మామల్లపురం సముద్రపు గవ్వలతో చేసిన కళాఖండాలు మనకంటే విదేశీయులు ఎక్కువగా కొనుగోలు చేసి ఆనందిస్తారు. మొత్తానికి మహాబలిపురం ప్రాంతం అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా నిస్సందేహంగా రుజువు చేస్తుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement