breaking news
India Tourism
-
దేశం చివరి అంచుల వరకు.. అద్భుత దృశ్యం!
భారత్ అంటే ఒక దేశం మాత్రమే కాదు విభిన్న ఆచారాలు, సంప్రదాయాలు, భౌగోళిక స్వరూపం ఉన్న ఒక ప్రపంచం. ఉత్తరాన హిమాలయాల నుంచి అరుణాచల్ ప్రదేశ్, దక్షిణాన సముద్ర తీరం వరకు కొన్ని ప్రదేశాలు దేశ వైభవాన్ని చాటి చెబుతాయి. మ్యాప్ మీద గీసిన గీతలు ఆగిపోయే చోట, పర్వతాలు, సముద్రం, నదులు కలిసి ఒక కొత్త భారతదేశాన్ని మనకు పరిచయం చేస్తాయి. మానా, కిబితూ, చిట్కుల్, ధార్చులా, కన్యాకుమారి.. వీటిలో ఎక్కడికి వెళ్లినా అది ప్రయాణం మాత్రమే కాదు ఒక అనుభవం.ఉత్తరాఖండ్‌లోని మానా అనేది బద్రినా«ద్‌కి దగ్గరగా సరస్వతీ నది జన్మించి.. భూ గర్భంలోకి ఇంకిపోయే ప్రదేశంలో ఉన్న చిన్నగ్రామం. ఇండో టిబెటెన్ బార్డర్ వైపు ఉన్న ఈ ప్రదేశంలో రాతి ఇల్లు, ఇరుకు వీధులు, చుట్టూ నిలబడి ఉన్న హిమాలయ కొండలు ఒక ప్రశాంతమైన దృశ్యాన్ని ఇస్తాయి.సరస్వతీ నదీ ప్రవాహం, భీముడి వంతెన, వసుధారా జలపాతం వైపు సాగే పర్వత మార్గం మానా ప్రయాణాన్ని గుర్తుండిపోయేలా చేస్తాయి.అరుణాచల్ ప్రదేశ్‌లోని కిబుతు దగ్గరికి చేరుకునే కొద్ది ప్రకృతి మరింత వైల్డ్‌గా మారిపోతుంది. లోహిత్ నది, ఎతై ్తన పైన్ వృక్షాలు, మేఘాలతో కప్పబడిన కొండలు కలిసి తూర్పు హిమాలయ ప్రపంచాన్ని చూపిస్తాయి. డాంగ్ నుంచి కిబుతు వైపు సాగే మార్గం భారత దేశ ఈశాన్య భూభాగం వైభవాన్ని చూపిస్తుంది.హిమాచల్ ప్రదేశ్‌లోని చిట్కుల్ అనేది బాస్పా లోయలో 3,450 మీటర్ల ఎత్తులో ఉన్న గ్రామం. చుట్టూ బాస్పా నది, చెక్కతో నిర్మించిన ఇల్లు, మతి దేవీ ఆలయం అన్నీ కలిసి ఒక నిశ్శబ్దమైన హిమాలయ పెయింటింగ్‌లా అనిపిస్తాయి. ఇండో టిబెటన్ బార్డర్ వద్ద ఉన్న చిట్కుల్ హిమాచల్‌లోని చివరి గ్రామ వైభవాన్ని చూపిస్తుంది.ఉత్తరాఖండ్‌లోని పితోర్ఘడ్ జిల్లాలో ఉన్న ధార్చులా అనేది కాస్త భిన్నమైన గ్రామం. ఇది ఒక చివరి గ్రామం మాత్రమే కాదు కాళీ నది ఒడ్డున నిలిచిన సరిహద్దు పట్టణం కూడా. ఒకవైపు భారత్, మరో వైపు నేపాల్ మధ్యలో ప్రవహించే కాళి నదీ రెండూ ప్రపంచాలను కలుపుతుంది. జాల్జిబి మార్కెట్, నారాయణ్ ఆశ్రమం, పంచచులి దృశ్యాలు ఈ ప్రదేశాలకు మరింత రంగులు జోడిస్తాయి.దక్షిణాన కన్యాకుమారి దగ్గరికి చేరుకుంటే హిమాలయాల నిశ్శబ్దం కాస్త ఇక్కడ సముద్ర గాలిగా మారిపోతుంది. భారత దేశ దక్షిణాదిలో చివరి భాగం అయిన కన్యాకుమారి వద్ద అరేబియన్ సముద్రం, బంగాళాఖాతం, హిందూ మహా సముద్రం కలిసే దశ్యం ఒక సినిమాలో హ్యాపీ ఎండింగ్‌లా ఉంటుంది.ఇక్కడ వివేకానందా రాక్ మెమోరియల్, తిరువళ్లూరు స్టాట్యూ, కుమారి అమ్మన్ ఆలయం ఈ తీర చరిత్ర, సంస్కృతిని రెండింటినీ అందిస్తాయి.ఏం చూడాలి?మానాలో సరస్వతి నది శబ్దాన్ని వినడం, భీమ్ పుల్ దగ్గర నిలబడి సరస్వతీ నదీ పర్వతాల మధ్యలోంచి జారిపడే సమయంలో ఏర్పడే ఇంద్రధనస్సును చూడటం, వసుధారా జలపాతం వెళ్లే దారిలో హిమాలయ వైభవాన్ని వీక్షించడం ఇవన్నీ జీవితకాలం గుర్తుంటాయి.అలాగే చిట్కుల్లో బాస్పా నది పక్కనే నడవటం, మతి దేవీ ఆలయం శిల్పకళ వైభవాన్ని గమనించడం, గ్రామాల్లో వుడెన్ హౌసెస్ మధ్య సమయం గడపటం మరొక అనుభవం.కిబుతులో లోహిత్ వ్యాలీ దృశ్యాలు, ధార్చులాలో కాళీ నది వైపు కనిపించే బార్డర్ ల్యాండ్‌స్కేప్, కన్యాకుమారిలో సముద్ర సంగమం, వివేకానంద రాక్ంఇలా ప్రతీ చోటు భారత దేశం చివరి భాగం వరకు ఎంత అందమైనదో, ఎంత విభిన్నమైనదో చూపిస్తుంది.ఎక్కడ ఉండాలి?మన ప్రయాణంలో బద్రినాథ్ లేదా జోషిమఠ్‌లో సింపుల్ హోటల్స్, గెస్ట్ హౌజ్‌ల మధ్య ఒక హిమాలయన్ స్టే అనుభవం లభిస్తుంది.చిట్కుల్, సాంగ్లా ప్రాంతాల్లో హోమ్‌స్టేస్, చిన్న హోటల్స్, గ్రామీణ జీవనాన్ని దగ్గరగా చూపిస్తాయి.ధార్చులాలో కాళీ నది వైపు ఉండే హాస్టల్స్, లాడ్జిలు బార్డర్ ప్రాంతంలో లైఫ్‌ను ఆస్వాదించేందుకు అవకాశాన్ని అందిస్తాయి.కన్యాకుమారిలో సముద్రం దగ్గర హోటల్స్‌లో సూర్యోదయం, సన్ సెట్ రెండూ ఆస్వాదించడం ప్రయాణంలో ప్రత్యేక జ్ఞాపకంగా మిగిలిపోతుంది.ఏం తినాలి?హిమాలయన్ గ్రామాల్లో లోకల్‌గా దొరికే సింపుల్ భోజనం ఆ ప్రదేశ జీవన విధానాన్ని చూపిస్తుంది.మానాలో రాజ్మా, పొటాటో లాంటివి స్థానికంగా పండిస్తారు.చిట్కుల్, కిన్నోర్ ప్రాంతాల్లో సిద్దు, చనా మాద్రా లాంటివి స్థానిక రుచులను ఆస్వాదించవచ్చు.కన్యాకుమారి చేరుకున్నప్పుడు ప్లేట్లో వడ్డించే ఫుడ్ కడుపునే కాదు మనసును కూడా నింపేస్తాయి.తీర ప్రాంతంలో సౌత్ ఇండియన్ మీల్, కొబ్బరితో చేసిన వంటకాలు, సీ ఫుడ్ ఎంజాయ్ చేయవచ్చు.ఆసక్తికరమైన విషయాలుమానా అనేది ఉత్తరాఖండ్ ఇండో టిబెటన్ బార్డర్ వైపు ఉన్న చివరి గ్రామంగా ఫేమస్ అయింది.కిబుతు అరుణాచల్ ప్రదేశ్‌లో తూర్పు వైపున ఉన్న రిమోట్ బార్డర్ డెస్టినేషన్.చిట్కుల్ అనేది బాస్పా లోయలో 3,450 మీటర్ల ఎత్తులో ఉంటుంది.ధార్చులా కాళీ నది ఒడ్డున భారత్ నేపాల్ బార్డర్ టౌన్.కన్యాకుమారి భారత ప్రధాన భూభాగానికి దక్షిణాది చివరి అంచు. ఇక్కడ అరేబియన్ సముద్రం, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం కలిసే దృశ్యాన్ని చూడొచ్చు.ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి ఈ ఐదు చివరి గ్రామాలను ఒకే ట్రిప్‌లో చూడటం కన్నా వేరు వేరు వేరుగా ప్లాన్ చేయడం బెటర్. మానా కోసం హైదరాబాద్ నుంచి డెహ్రాడూన్ వైపు ఫ్లైట్ జర్నీ అక్కడి నుంచి జోషిమఠ్, బద్రినాథ్ మార్గంలో సాగే రోడ్డు జర్నీ ఒక మంచి ట్రాన్సిషన్ లా ఉంటుంది. బద్రినాథ్ నుంచి మానా వైపు పర్వతాల మధ్య ప్రయాణం మొదలు అవుతుంది. మీరు నడుస్తూ కూడా వెళ్లవచ్చు.కిబుతు కోసం హైదరాబాద్ నుంచి అస్సాం లేదా అరుణాచల్ ప్రదేశ్‌కి ఎయిర్ జర్నీ తరువాత రోడ్డు జర్నీ చేయవచ్చు. చిట్కుల్ కోసం చండిగఢ్ లేదా షిమ్లావైపు వెళ్లాలి. అక్కడి నుంచి కిన్నౌర్ కొండల మధ్య సాగే రోడ్ జర్నీ సూపర్ మెమోరీగా మిగిలిపోతుంది. ధార్చులా కోసం ఉత్తరాఖండ్‌లోని తానక్‌పూర్ లేదా పితోర్‌గఢ్ వైపు సాగే ప్రయాణం హిమాలయాలలో మరో ముఖాన్ని చూపిస్తుంది.కన్యాకుమారి అనేది హైదరాబాద్ నుంచి రైలు, రోడ్డుమార్గంలో ఈజీగా రీచ్ అవ్వగల డెస్టినేషన్.తమిళనాడులోని ఈ ప్రాంతానికి వెళ్లే సమయంలో మీకు పర్వతాలకు బదులు సముద్రం కనిపించడం ఈ ప్రయాణంలో ఒక బ్యూటిఫుల్ ఛేంజ్‌లా కనిపిస్తుంది.ఏం చేయాలి?ఈ ప్రయాణంలో ఒకసారి అయినా మానాలో సరస్వతి నదిని చూడాలి.చిట్కుల్లో బాస్పా నది పక్కన నడవాలి.కిబుతూలో తూర్పు హిమాలయాల నిశ్శబ్దాన్ని ఆస్వాదించాలి.ధార్చులాలో కాళీ నది రెండు దేశాలను కలిపే సన్నివేశాన్ని చూడాలి.చివరగా కన్యాకుమారిలో సముద్రం ముందు నిలబడి భారత దేశ దక్షిణ అంచుని ఫీల్ అవ్వాలి.యాత్రా, బడ్జెట్ వివరాలుఈ ఐదు డెస్టినేషన్స్‌ను ఒకటే ట్రిప్‌లో లేదా 5 రోజుల్లో కవర్ చేయడం లేదా చేయాలి అనుకోవడం అంత మంచి ఐడియా కాదు. సో, 5 రోజుల ట్రిప్‌ను మానా, చిట్కుల్, కిబుత్ లాంటి దగ్గరగా ఉన్నహిమాలయన్ డెస్టినేషన్స్ కవర్ చేసేలా ప్లాన్ చేసుకోవచ్చు. ఇలా ప్లాన్ చేస్తే హైదరాబాద్ నుంచి విమానాలు, తరువాత లోకల్ ట్రాన్స్పోర్ట్, స్టే కలిపి బడ్జెట్ రేంజ్ సుమారు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు అవుతుంది.స్టాండర్డ్ బడ్జెట్ వచ్చేసరికి రూ.30 వేల నుంచి రూ 50 వేల వరకు, ప్రీమియం అయితే రూ.60 వేల నుంచి రూ. 80 వేల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది.కిబుత్ లాంటి దూర ప్రాంతాలకు వెళ్లేప్పుడు రోడ్డు ప్రయాణమే ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. కాబట్టి బడ్జెట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ధార్చులా ట్రిప్‌ను అయితే రూ.18 వేల నుంచి రూ.35 వేల మధ్యలో ప్లాన్ చేసుకోవచ్చు.కన్యాకుమారి 5 రోజుల ట్రిప్‌ను రూ.15 వేల నుంచి రూ.30 వేల రేంజిలో ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఇది మీ ట్రావెల్ క్లాస్, ఎంచుకునే హోటల్‌ను బట్టి మారుతుంది.స్టే కోసం హిమాలయన్ డెస్టినేషన్ లో రోజుకు సుమారు రూ.1,000 నుంచి రూ.4,000 వరకు ప్రీమియం ప్రాపర్టీలలో దానికంటే ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఫుడ్ కోసం ప్రతీ రోజు సుమారు రూ.500 నుంచి రూ.1,200 వరకు ఖర్చు అవుతుంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతాలకు వెళ్లేందుకు ముందస్తుగానే ఇన్నర్‌లైన్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎంట్రీకి ముందు కావాల్సిన ఇతర రిక్వైర్మెంట్స్ కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.– ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు -
ప్రపంచ వింతల్లో మహాబలిపురం
సాక్షి, చెన్నై: ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న మహాబలిపురం ప్రపంచ వింతల్లో చేరటమే కాకుండా పర్యాటకుల సందర్శనలో తాజ్ మహల్‌నే అధిగమించి తమిళనాడుకే గర్వకారణంగా నిలిచింది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ విడుదల చేసిన ఇండియా టూరిజం స్టాటిస్టిక్స్ 2022 పేరుతో భారత పురావస్తు శాఖ నివేదిక ప్రకారం మన దేశంలో విదేశీయులు ఎక్కువగా సందర్శించే స్మారక చిహ్నాల జాబితాలో తమిళనాడులోని మహాబలిపురం అగ్రస్థానంలో ఉందని ప్రకటించారు. పల్లవ రాజులు నిర్మించిన 7వ, 8వ శతాబ్దపు సముద్రతీర దేవాలయాలు, శిల్పా సౌందర్యంతో కూడిన దేవాలయాలు ప్రపంచ ప్రసిద్ధి చెందినవి. వందల ఏళ్ల క్రితం మహేంద్రవర్మ నిర్మించిన రాతి రథాలు, ఆలయాలు కాలంతో పాటు సగర్వంగా నిలుస్తున్నాయి. యునెస్కో జాబితాలో సైతం చోటు సంపాదించింది. ఈ అద్భుతాన్ని చూసేందుకు ఏటా లక్షల మంది ప్రజలు, పర్యాటకులు, విదేశీయులు ఇక్కడికి వస్తుండటం విశేషం. ఇండియా టూరిజం స్టాటిస్టిక్స్ 2022 పర్యాటక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఇండియా టూరిజం స్టాటిస్టిక్స్ 2022 ప్రకారం, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా వర్గీకరించిన మహాబలిపురానికి విదేశీ సందర్శకుల సంఖ్యలో తాజ్ మహల్‌ను అధిగమించింది. సెప్టెంబరు 27న న్యూఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్లో ప్రపంచ పర్యాటక దినోత్స వం సందర్భంగా ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్కర్ దీనిని విడుదల చేశారు. పర్యాటక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం చెన్నైకి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న మామల్లపురం (మహాబలిపురం)ను 2021–22లో 1,44,984 మంది విదేశీ పర్యాటకులు సందర్శించారు. 45.50 శాతం మంది విదేశీయులు పర్యటించి మొదటి స్థానంలో నిలువుగా, ఆగ్రాలోని తాజ్ మహల్‌ను 38,922 మంది విదేశీ సందర్శకులతో రెండో స్థానంలో నిలిచి 12.21 శాతంగా నిలిచింది. మహాబలిపురం విశేషాలు ఈ ప్రదేశంలో 7వ , 8వ శతాబ్దపు హిందూ మతపరమైన స్మారక చిహ్నాల సేకరణ ఉంది. 40 పురాతన దేవాలయాలు, స్మారక కట్టడాల్లో గంగా అవరోహణ, పంచ రథాలు, ఏకశిలా పిరమిడ్ నిర్మాణాలు, 7వ శతాబ్దానికి చెందిన 10 రాక్–కట్ గుహ దేవాలయాలు, ఒక బీచ్ టెంపుల్‌తో సహా కళాత్మక రాతి నిర్మాణాలు పర్యటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. భారత పర్యాటక శాఖ ప్రచురించిన జాబితాలోని మొదటి 10 స్మారక చిహ్నాలలో ఆరు తమిళనాడులో ఉండటం విశేషం. మహాబలిపురంలో అనేక అద్భుత క్షేత్రాలతో పాటు సీషెల్, మారిటైమ్ హెరిటేజ్ మ్యూజియం, 40,000 పైగా అరుదైన సీషెల్ నమూనాలు, ముత్యాలు, అక్వేరియంలు, డైనోసార్ శిలాజాలు పర్యటకులను సంమ్మోహన పరుస్తాయి. మామల్లపురం సముద్రపు గవ్వలతో చేసిన కళాఖండాలు మనకంటే విదేశీయులు ఎక్కువగా కొనుగోలు చేసి ఆనందిస్తారు. మొత్తానికి మహాబలిపురం ప్రాంతం అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా నిస్సందేహంగా రుజువు చేస్తుంది. -
'60 రోజుల్లో 4000 కిలోమీటర్ల పరుగు..'
► కన్యాకుమారీలో మొదలై కశ్మీర్లో ముగింపు న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా మారథాన్ కింగ్ పట్ ఫామర్ భారత దేశ దక్షిణ ధ్రువం నుంచి ఉత్తర ధ్రువం వరకు పరుగెత్తనున్నారు. దాదాపు 4000 కిలోమీటర్లకు పైగా ఉన్న వీటి మధ్య దూరాన్ని ఆయన అలవోకగా తన పరుగు ద్వారా 60 రోజుల్లో ముగించనున్నారు. కన్యా కుమారిలో ఆయన పరుగు ప్రారంభించి కశ్మీర్ వరకు వెళ్లనున్నారు. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన ఈ మారథాన్ ప్రారంభిస్తారు. అదే రోజు ఆస్ట్రేలియా ఆవిర్భావ దినోత్సవం కూడా. భారత్, ఆస్ట్రేలియాల మధ్య పర్యాటకాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో 'స్పిరిట్ ఆఫ్ ఇండియా' పేరిట భారత్ టూరిజం, విదేశాంగ వ్యవహారాల శాఖ ఆయా రాష్ట్రాల భాగస్వామ్యంతో ఈ మారథాన్ నిర్వహించనుంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, జమ్మూకాశ్మీర్, చండీగఢ్ రాష్ట్రాల గుండా ఈ మారథాన్ కొనసాగనుంది. పట్ ఫామర్ ఇప్పటికే పలు మారథాన్లలో పాల్గొని రికార్డులు నెలకొల్పారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వియత్నాం, మధ్యాసియా, ఉత్తర అమెరికావంటి దేశాల ఉత్తర, దక్షిణ ధ్రువాల వరకు ఆయన పరుగుతో చేరుకున్నారు. అంతేకాకుండా ఆస్ట్రేలియా పార్లమెంటు సభ్యుడిగా ఎనిమిదేళ్లపాటు సేవలందించడమేకాకుండా ఇతర బాధ్యతలు కూడా నిర్వహించారు. ఆయన 20 ఏళ్ల పరుగు ప్రయాణంలో తన మారథాన్ల ద్వారా ఎన్నో చారిటీలకు డాలర్ల మూటలు కట్టబెట్టారు. భారత్‌లో నిర్వహించనున్న మారథాన్ ప్రధాన ఉద్దేశం పర్యాటకాన్ని వృద్ధి చేయడమే కాకుండా బాలికల విద్య కోసం నిధుల సేకరణ కూడా ఉంది. పట్ ఫామర్ పరుగు మొత్తాన్ని ఓ ప్రత్యేక మీడియా బృందం ఆయన వెంట 60 రోజులపాటు ఉండి డాక్యుమెంటరీగా ఎప్పటికప్పుడూ ఆస్ట్రేలియాలో ప్రసారం చేయనుంది. జనవరి 26న కన్యాకుమారిలోని గాంధీ మండపం వద్ద ఉదయం 6.15గంటలకు ఆయన పరుగు ప్రారంభించి మార్చి 30నాటికి శ్రీనగర్ లో ముగిస్తారు. రోజుకు ఆయన 70 నుంచి 80 కిలోమీటర్లు పరుగెత్తనున్నారు. -
వేడుకలకు వేదిక.. మారిషస్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెళ్లి, వార్షికోత్సవం, పుట్టిన రోజు.. సందర్భం ఏదైనా జీవితంలో గుర్తుండిపోయే అనుభూతి కోసం సాధారణంగా ఏం చేస్తాం? ఒక బహుమతి ఇవ్వడమో లేదా వేడుకను అంగరంగ వైభవంగా జరపడమో చేస్తాం. ఇప్పుడు ట్రెండ్ మారింది. అతిథులకూ తీపి జ్ఞాపకం మిగిల్చేందుకు చలో మారిషస్ అంటున్నారు. భారతీయులకు సైతం మారిషస్ మేనియా పట్టుకుంది. విమానాన్ని మాత్రమే కాదు హోటల్‌ను సైతం పూర్తిగా బుక్ చేసుకుంటున్నారు. వంటవారు మొదలు వినోదం వరకు అంతా అతిథులకు నచ్చినట్టుగానే. అంతేకాదు అక్కడి ప్రకృతి అందాలూ ఆహ్వానితులను కనువిందు చేస్తున్నాయి. పెళ్లంటే పెద్ద వేడుకే.. యూరప్ నుంచి అత్యధికులు తమ పెళ్లి వేడుకలకు మారిషస్‌ను వేదికగా చేసుకుంటున్నారు. ఎంత కాదన్నా ఏటా 10 వేల వివాహాలు జరుగుతున్నాయి. భారత్ నుంచి ఏడాదికి కనీసం 10 జంటలైనా తమ దేశంలో ఒక్కటవుతున్నారని మారిషస్ టూరిజం ప్రమోషన్ అథారిటీ (ఎంటీపీఏ) అంటోంది. ‘భారతీయుల పెళ్లి అంటే అదో వేడుక. భారతీయత ఉట్టిపడుతుంది. కనీసం 50 మంది మొదలు 700 మంది వరకు హాజరవుతారు. అదే యూరప్ జంటల విషయంలో అతిథుల సంఖ్య 30కి మించదు’ అని ఎంటీపీఏ డిప్యూటీ డెరైక్టర్ విజయ్ హాల్దర్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. అన్ని గదులనూ పూర్తిగా బుక్ చేసుకునే సౌకర్యాన్ని హోటళ్లు కల్పిస్తాయి. వంటవారినీ తెచ్చుకోవచ్చని చెప్పారు. బీచ్ ఒడ్డున వేడుక అంటే ఆ అనుభూతిని ఆస్వాదించాల్సిందేనని అన్నారు. 30 శాతం దాకా డిస్కౌంట్.. వివిధ దేశాల నుంచి ఏటా 10 లక్షల మంది పర్యాటకులు మారిషస్‌కు వస్తున్నారు. ఈ సంఖ్యను 13.5 లక్షలకు చేర్చాలన్నది ఎంటీపీఏ లక్ష్యం. అలాగే భారత్ నుంచి 2013లో 59 వేల మంది వచ్చారని, ఈ ఏడాది 60 వేలు అంచనా వేస్తున్నట్టు ఎంటీపీఏ ఇండియా మేనేజర్ వివేక్ ఆనంద్ తెలిపారు. వీరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి 10 శాతం మంది ఉంటారని చెప్పారు. హనీమూన్ కోసం వచ్చే జంటలకు 30 శాతం దాకా డిస్కౌంట్లను కొన్ని హోటళ్లు అందిస్తున్నాయని వివరించారు. ఏటా భారత్ నుంచి 15 వేల జంటలు హనీమూన్ కోసం మారిషస్ వెళ్తున్నట్టు సమాచారం. కాగా, సింహం, పులి, చిరుతతో కలసి నడవాలంటే కసేలా నేచుర్ పార్క్ వెళ్లాల్సిందే. పోర్ట్ లూయిస్ మార్కెట్, ఎస్ఎస్ఆర్ బొటానికల్ గార్డెన్స్, గ్రాండ్ బేసిన్, చమారెల్ తదితర పర్యాటక ప్రదేశాలు చూడదగ్గవి. మారిషస్ విశేషాలను వెల్లడించేందుకు హైదరాబాద్‌తోసహా నాలుగు నగరాల్లో ఎంటీపీఏ రోడ్‌షో నిర్వహిస్తోంది.


