తమిళనాడులోని కరూర్ ఘటన బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ నిర్ణయించారు. సుమారు 30 రోజుల తర్వాత విజయ్ బాహ్యప్రపంచంలోకి అడుగుపెట్టనున్నారు. సెప్టెంబర్ 27న చెన్నై కరూర్‌లో టీవీకే నేత విజయ్ ప్రచార సమయంలో చోటు చేసుకున్న పెను విషాదం గురించి తెలిసిందే. మరణించిన 41 మంది బాధిత కుటుంబాలు, గాయపడ్డ 160 మందిని పరామర్శించేందుకు విజయ్ నిర్ణయించారు. బాధిత ఒక్కో కుటుంబానికి ఇప్పటికే రూ. 20 లక్షలు విజయ్ ప్రకటించారు.
ఈ క్రమంలో బాధిత కుటుంబ సభ్యులందరినీ ఒకే వేదికపై తీసుకొచ్చి పరామర్శించడమే కాకుండా, నష్ట పరిహారంతో పాటు వారిని దత్తత తీసుకునే విధంగా విజయ్ కసరత్తులలో ఉన్నట్టుగా సమాచారం ఉంది. కరూర్‌లో విజయ్ పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, భద్రత చర్యలు తీసుకోవాలని ఇప్పటికే టీవీకే వర్గాలు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అయితే, టీవీకే వర్గాలు ఎంపిక చేసిన వేదిక చిన్నదిగా ఉండడంతో ఏదేని కళాశాల మైదానాలను ఎంపిక చేసుకోవాలని పోలీసులు సూచించారు. అలాగే ఏర్పాటుకు సంబంధించిన సమగ్ర వివరాలను సమర్పించాలని సూచించారు. దీంతో పరామర్శలను వాయిదా వేసుకుంటూ వచ్చారు.
చివరకు కరూర్‌లో అతి పెద్ద మైదానం, ఆడిటోరియంలేని దృష్ట్యా, బాధితులను చెన్నైకు తీసుకొచ్చి పరామర్శ ఏర్పాట్లు చేయడానికి టీవీకే వర్గాలు చర్యలు చేపట్టారు. ఇందుకోసం మహబలిపురం వద్ద అతి పెద్ద వేదికను ఎంపిక చేశారు. ఇక్కడకు బాధితులను తీసుకొచ్చి , వారికి అన్ని రకాల బస తదితర ఏర్పాట్లు చేయడానికి ఏర్పాట్లు చేపట్టారు. ఈమేరకు (27వ తేదీ)సోమవారం బాధితులను విజయ్ పరామర్శించి, నష్ట పరిహారం అందించనున్నట్టు టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి.


