
చెన్నై వాండలూర్ జూలో ఓ సింహం కనిపించకుండా పోవడంతో అధికారులు హడలిపోయారు. రాత్రికి రాత్రే దాని ఆచూకీ కనిపెట్టేందుకు ఉరుకులు పరుగులు పెట్టారు. చివరాఖరికి దాని ఆచూకీ లభించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అక్టోబర్ 3వ తేదీన జరిగిన ఈ ఘటన.. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అరిగ్నార్ అన్నా జూలాజికల్ పార్క్.. దక్షిణ భారత దేశంలో ఉన్న అతిపెద్ద జూ పార్కుల్లో ఒకటి. అయితే శుక్రవారం అర్ధరాత్రి ఆ జూలో హైడ్రామా నడిచింది. ఎప్పటిలాగే సింహాలన్నీ సాయంత్రం కాగానే ఎన్‌క్లోజర్‌లోకి చేరుకోగా.. శేర్యార్ అనే సింహం మాత్రం తిరిగి రాలేదు(Lion Missing Zoo). దీంతో సిబ్బంది కంగారపడిపోయారు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు.
అంతా కలిసి ఐదు బృందాలుగా విడిపోయి సింహం కోసం జూ అంతా గాలించారు. రాత్రి పూట పని చేయగలిగే థర్మల్ డ్రోన్ల, ట్రాప్ కెమెరాల సహకారం తీసుకున్నారు. అయితే కొన్నిగంటల తర్వాత అది సఫారీలో ఓ చోట ప్రశాంతంగా కూర్చు ఉండిపోవడం గమనించారు. బౌండరీ వాల్, చెయిన్-లింక్ మెష్ ఫెన్సింగ్ ఉన్న సఫారీని నుంచి అది తప్పించుకునే అవకాశం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఐదేళ్ల వయసున్న శేర్యార్‌ను 2023లో బెంగళూరులోని బన్నెరఘట్ట జూలాజికల్(Bannerghatta national park) పార్క్ నుంచి తీసుకొచ్చారు. లయన్ సఫారీ అలవాటు చేయడానికి మిగతా వాటితో పాటే దానిని రెగ్యులర్‌గా బయటకు వదులుతున్నారట. అయితే ఈ వయసులో సింహాలకు ఇలాంట ప్రవర్తన సహజమేనని అధికారులు తెలిపారు. ఈ లయన్ మిస్సింగ్ ఘటనతోనే.. అక్టోబర్ 5న జరగాల్సిన వైల్డ్ ట్రెయిల్ రన్ కార్యక్రమాన్ని నిర్వాహకులు వాయిదా వేసినట్లు సమాచారం.
ఇదీ చదవండి: కేరళ అసెంబ్లీని కుదిపేసిన ‘శబరిమలై’ వివాదం