
తిరువనంతపురం: శబరిమల స్వర్ణ తాపడం వివాదం కేరళ అసెంబ్లీని మరింత వేడెక్కించింది. శబరిమల ఆలయంలోని గర్భగుడిలో తాపడానికి ఉపయోగించిన బంగారు షీట్లు అదృశ్యమయ్యాయనే ఆరోపణలతో ప్రతిపక్షాలు సభలో గందరగోళం సృష్టించాయి. దీంతో సోమవారం శాసనసభలో హై డ్రామా నడిచింది. ఈ గందరగోళం నడుమ స్పీకర్ ఏఎన్ షంషీర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి, సభను తాత్కాలికంగా వాయిదా వేశారు.
సభలో తొలుత ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ శబరిమల స్వర్ణ తాపడం అంశాన్ని లేవనెత్తారు. గర్భగుడిలో తాపడానికి ఉపయోగించిన బంగారు షీట్లు అదృశ్యమయ్యాయని ఆరోపిస్తూ, ఇందుకు బాధ్యత వహిస్తూ దేవస్వం(దేవాదాయశాఖ) మంత్రి, ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడు వీఎన్ వాసవన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్ వెంటనే కలుగజేసుకుని ప్రశ్నోత్తరాల సమయంలో షెడ్యూల్ చేసిన ప్రశ్నలను అడగాలని అన్నారు. ఈ నేపధ్యంలో ప్రతిపక్ష సభ్యులు సభలో నిరసన వ్యక్తం చేశారు.
‘అయ్యప్పన్ బంగారం చోరీ, దోపిడీదారులు ఆలయాన్నే స్వాహా చేశారు’ లాంటి నినాదాలతో కూడిన ప్లకార్డులు, బ్యానర్‌లను ప్రతిపక్ష సభ్యులు తమ చేత పట్టుకుని, స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో, అక్కడున్న మంత్రులు, పాలకవర్గ సభ్యులు తమ సీట్ల నుండి లేచి నిలుచున్నారు. ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ ప్రతిపక్ష సభ్యుల చర్యలను ఖండించారు. సభలో ఈ విధంగా అంతరాయం కలిగించడం సరైనది కాదన్నారు. స్పీకర్ జోక్యం చేసుకుని, ఈ విధంగా కార్యకలాపాలను అడ్డుకోవడం సభను అగౌరవపరచడమేనన్నారు.
సభ్యులు తమ చేతుల్లోని ప్లకార్డులను దించాలని ఆయన ఆదేశించారు. అయినా ప్రతిపక్ష సభ్యులు తమ నిరసనలను కొనసాగించారు. ఈ గందరగోళం నడుమ స్పీకర్ షంషీర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి, సభను వాయిదా వేశారు. ఒక్క నోటీసు కూడా ఇవ్వకుండా సభలో ఎందుకు అంతరాయం కలిగిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. గత వారంలో ప్రతిపక్షం ఇదే అంశంపై వాయిదా తీర్మానం ప్రవేశపెట్టడానికి ప్రయత్నించింది. అయితే స్పీకర్ ఈ అంశం కేరళ హైకోర్టు పరిశీలనలో ఉందని పేర్కొంటూ, దానిని తోసిపుచ్చారు. కాగా రాబోయే రోజుల్లో శబరిమల స్వర్ణ తాపడం వివాదంపై తమ నిరసనలను తీవ్రతరం చేయనున్నట్లు ప్రతిపక్ష సభ్యులు ప్రకటించారు.