ఇళ్లకు వెళ్లే ప్రసక్తే లేదు

Legalize MSP, sack Minister: Farmers demands to PM Modi - Sakshi

కేంద్ర ప్రభుత్వం రైతులతో చర్చలకు రావాల్సిందే

ఎంఎస్పీకి చట్టబద్ధతపై ప్రధాని మోదీ స్పష్టతనివ్వాలి

భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ తికాయత్‌ డిమాండ్‌

లక్నోలో ఎస్‌కేఎం ఆధ్వర్యంలో ‘కిసాన్‌ మహా పంచాయత్‌’

లక్నో: దేశంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని, రైతులతో చర్చలు జరిపేందుకు ముందుకు రావాలని భారతీయ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ) నేత రాకేశ్‌ తికాయత్‌ కోరారు. నూతన వ్యవసాయ చట్టాల రద్దు ఒక్కటే కాదు, ఇంకెన్నో అంశాలు ఉన్నాయని, వాటిపై కేంద్రం చర్చలకు వచ్చేదాకా అన్నదాతల పోరాటం కొనసాగుతుందని తేల్చిచెప్పారు.

సాగు చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించి ప్రభుత్వం చేతులు దులిపేసుకుంటోందని, తమతో మాట్లాడేందుకు ఇష్టపడడం లేదని  విమర్శించారు. రైతుల మధ్య చీలిక తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పంటలకు కనీస మద్దతు ధరకు (ఎంఎస్పీ) చట్టబద్ధత, విత్తనాలు, పాడి పరిశ్రమ, కాలుష్యం వంటి సమస్యలను పరిష్కరించాల్సి ఉందన్నారు.

ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్‌కు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోదీ మద్దతు పలికారని తికాయత్‌ గుర్తుచేశారు. ఇదే డిమాండ్‌ను తాము లేవనెత్తుతున్నామని, ఇప్పుడు ప్రధానిగా ఉన్న మోదీ దీనిపై స్పష్టమైన సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. రాకేశ్‌ తికాయత్‌ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రాను ఉగ్రవాదితో సరిపోల్చారు. లఖీమ్‌పూర్‌ ఖేరిలో రైతుల ఆందోళన, హింసాత్మక ఘటనలో ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.

40 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కేఎం) ఆధ్వర్యంలో సోమవారం ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో ‘కిసాన్‌ మహా పంచాయత్‌’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తికాయత్‌ రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు హాని చేస్తాయన్న నిజాన్ని గుర్తించిన ప్రభుత్వం వాటిని రద్దు చేస్తామని ప్రకటించిందని, సరైన నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. అయితే, ఈ చట్టాల గురించి కొందరికి అర్థమయ్యేలా వివరించడంలో విఫలమయ్యామంటూ రైతుల నడుమ చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఆ కొందరు తామేనని అన్నారు.

ప్రజలను మభ్యపెడుతూ దేశాన్ని అమ్మేస్తుంటారు
సంఘర్‌‡్ష విశ్రామ్‌(కాల్పుల విరమణ)ను కేంద్ర ప్రభుత్వం మాత్రమే ప్రకటించిందని, రైతులు కాదని రాకేశ్‌ తికాయత్‌ ఉద్ఘాటించారు. పరిష్కరించాల్సిన సమస్యలు ఇంకా ఎన్నో ఉన్నాయని, అప్పటిదాకా పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు. దేశమంతటా సభలు, సమావేశాలు నిర్వహిస్తామని, ప్రభుత్వ వ్యవహార ధోరణిని ప్రజలకు వివరిస్తామని అన్నారు. రైతుల పోరాటంలో భాగస్వాములు కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘‘వారు (ప్రభుత్వం) ఒకవైపు మిమ్మల్ని హిందూ–ముస్లిం, హిందూ–సిక్కు, జిన్నా అంటూ మభ్య పెడుతుంటారు.

మరోవైపు దేశాన్ని అమ్మేస్తుంటారు’’ అని తికాయత్‌ ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి క్షమాపణ చెప్పినంత మాత్రాన పంటలకు కనీస మద్దతు ధర దక్కదని అన్నారు. చట్టబద్ధత కల్పిస్తేనే దక్కుతుందని చెప్పారు. ఈ అంశంపై ఒప్పటికే కమిటీని ఏర్పాటు చేశారని, నివేదిక ప్రధానమంత్రి కార్యాలయానికి(పీఎంఓ) చేరిందని, నిర్ణయం తీసుకోవడానికి కొత్త కమిటీ అవసరం లేదని సూచించారు. నివేదిక ఇచ్చిన కమిటీలో నరేంద్ర మోదీ కూడా సభ్యుడేనని గుర్తుచేశారు. కమిటీ సిఫార్సులను ఆయన ఆమోదిస్తున్నారో లేదో స్పష్టం చేయాలని అన్నారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నించరేం?
ప్రసార మాధ్యమాల తీరుపై రాకేశ్‌ తికాయత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత మూడు రోజులుగా మీడియా కేవలం రైతులను మాత్ర మే ప్రశ్నిస్తోందని ఆక్షేపించారు. ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదని అన్నారు. రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని మీడియాకు సూచించారు. సాగు చట్టాల వ్యతిరేక పోరాటంలో 750 మందికిపైగా రైతులు మరణించారని తెలిపారు. కిసాన్‌ మహా పంచాయత్‌లో పలువరు రైతు సంఘాల నాయకులు, భారీ సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top