మీ వారసున్ని సిఫార్సు చేయండి.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు కేంద్రం లేఖ

ఆగస్టు 26న రిటైరవుతున్న సీజేఐ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పదవీకాలం పూర్తవనున్న నేపథ్యంలో తదుపరి సీజేఐని సిఫార్సు చేయాల్సిందిగా కేంద్రం ఆయన్ను కోరింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ కేంద్ర న్యాయ శాఖ బుధవారం జస్టిస్ రమణకు లేఖ రాసింది. ఆయన పదవీకాలం ఆగస్టు 26తో ముగియనుంది.
పదవీ విరమణ చేసే సీజేఐ తన వారసునిగా సీనియర్ మోస్ట్ న్యాయమూర్తి పేరును సూచించడం సంప్రదాయంగా వస్తోంది. సుప్రీంకోర్టు సీనియారిటీ లిస్టులో జస్టిస్ రమణ తర్వాత న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ ఉన్నారు. అయితే ఆయన పదవీకాలం నవంబర్ 8 వరకే ఉంది. సీజేఐగా ఎంపికైతే రెండున్నర నెలలే పదవిలో కొనసాగుతారు.