ఖుష్బూకు ‘ప్రత్యేక’ పదవి

Kushboo Appointed as BJP Special Invitee - Sakshi

సాక్షి, చెన్నై: ఎట్టకేలకు బీజేపీలో నటి ఖుష్బూకు ఓ పదవి దక్కింది. ఆ పార్టీ ప్రత్యేక ఆహ్వానితురాలిగా గురువారం ఆమెను నియమించారు. కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి చేరిన ఖుష్బూకు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కింది. అయితే ఏళ్ల తరబడి తాను సేవ చేసిన ట్రిప్లికేన్‌లో కాకుండా థౌజండ్‌ లైట్స్‌ నియోజకవర్గంలో పోటీ చేయడంతో ఓటమి తప్పలేదు. అదే సమయంలో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన ఎల్‌. మురుగన్‌కు కేంద్ర సహాయ మంత్రి పదవి, అన్నామలైకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కాయి. దీంతో ఖుష్బూకు కూడా కీలక  పదవిని అప్పగిస్తారని మద్దతుదారులు, అభిమానులు ఎదురు చూశారు. అయితే, ఆమెకు పార్టీ ప్రత్యేక ఆహ్వానితురాలు పదవిని అప్పగించారు. అలాగే సీనియర్‌ నేతలు హెచ్‌ రాజకు ప్రత్యేక ఆహ్వానితుడిగా, మరో నేత పొన్‌ రాధాకృష్ణన్‌ను జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించారు.  

కమలం నిరసనల హోరు.. 
కరోనా దృష్ట్యా, శుక్ర, శని, ఆదివారాల్లో ఆలయాల్లోకి భక్తులకు అనుమతిని ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ బీజేపీ నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల వద్ద గురువారం నిరసనలు జరిగాయి. ముఖ్య నేతల నేతృత్వంలో 12 ప్రసిద్ధి చెందిన ఆలయాల వద్ద పార్టీ వర్గాలు నిప్పుల కుండను చేత బట్టి నిరసన చేపట్టారు. చెన్నై కాళికాంబాల్‌ ఆలయం వద్ద జరిగిన నిరసనకు హాజరైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై మాట్లాడుతూ,  సినిమా థియేటర్లు, టాస్మాక్‌ మద్యం దుకాణాల్ని తెరిచిన ఈ పాలకులు, ఆలయాల విషయంలో ఏకపక్ష ధోరణి అనుసరిస్తున్నారని మండిపడ్డారు. ఆలయాల్లోకి భక్తుల్ని పూర్తిస్థాయిలో అనుమతించాల్సిందే అని డిమాండ్‌ చేశారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top