బెంగళూరు: ప్రేమించి పెళ్లి చేసుకున్న వివాహిత యువతిని ముగ్గురు వ్యక్తులు అపహరించి రామనగరలోని ఓ ఇంటిలో అక్రమంగా నిర్బంధించారు. ఫిర్యాదు మేరకు రామనగర పోలీసులు కార్యాచరణ జరిపి బాధితురాలిని కాపాడి, ముగ్గురు కిడ్నాపర్లను అరెస్టు చేశారు.
వివరాలు... మైసూరుకు చెందిన ఆలనహళ్లి శివకుమార్ భార్య భవ్య (19). ఎలక్ట్రిషియన్‌గా పని చేసే శివకుమార్ ఏడాది క్రితం హాసన్ జిల్లా సకలేశపురకు చెందిన భవ్యను ప్రేమించి పెళ్లి చేసుకుని ఆలనహళ్లిలో నివాసం ఉంటున్నారు. జూన్ 25న శివకుమార్ పని మీద బోగాదికి వెళ్లారు. భార్యకు ఫోన్ చేయగా, స్విచాఫ్ వచ్చింది.
రాత్రయినా భార్య ఇంటికి రాకపోవడంతో ఆందోళనలో ఉన్న శివకుమార్‌కు మరునాడు ఫోన్ వచ్చింది. అతని భార్య మాట్లాడుతూ తనను ముగ్గురు వ్యక్తులు అపహరించి రామనగరకు పిలుచుకొచ్చి ఇక్కడ ఒక ఇంటిలో నిర్బంధించారు, కాపాడమని కోరి లొకేషన్ షేర్ చేసింది. వెంటనే అప్రమత్తమైన శివకుమార్ 112కు ఫోన్ చేసి రామనగర పోలీసులకు పూర్తి వివరాలు అందించారు. పోలీసులు కార్యాచరణ జరిపి భవ్యను కాపాడారు. కిడ్నాప్‌కు పాల్పడిన రామనగరవాసులు సుమ, కిరణ్, మరొక మహిళను బంధించి కటకటాల వెనక్కు నెట్టారు.


