కోవిడ్‌ వార్డే పెళ్లి మండపం.. పీపీఈ కిట్లే పట్టు వస్త్రాలు..!

Kerala Hospital Ward Turns Into Marriage Hall - Sakshi

తిరువనంతపురం: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. ప్రతిరోజు లక్షలాదిగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కాగా కేరళలో ఆదివారం రోజున ఆసక్తికర సంఘటన జరిగింది. కోవిడ్‌ వార్డే పెళ్లి మండపం.. పీపీఈ కిట్లే పట్టు వస్త్రాలైన వేళ కేరళలోని అలప్పుజ జిల్లాలో ఒక జంట ఏకమైంది. వివరాల్లోకి వెళ్తే... అలప్పుజ జిల్లాలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రిలోని కోవిడ్‌ వార్డు ఈ జంటకు పెళ్లి వేదికగా మారింది. గత కొన్ని రోజులుగా జిల్లాలోని కైనకారి ప్రాంతానికి చెందిన శరత్ మోన్, అభిరామి ఇరువురు ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

కాగా, ఇరువురు వారి కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి ముహుర్తాలు ఫిక్స్‌ చేసుకోగా అంతలోనే కరోనా వైరస్‌ వచ్చి వారి పెళ్లికి విలన్‌గా మారింది. కొన్ని రోజుల క్రితం పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నప్పుడు శరత్ కరోనా వైరస్‌ బారిన పడ్డాడు. అంతేకాకుండా అతని తల్లికి కూడా కరోనా సోకింది. దీంతో తల్లీ కొడుకులిద్దరినీ అలప్పుజ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలోని కోవిడ్ వార్డులో చేర్చారు. ఏదీఏమైనా తమ పెళ్లి మాత్రం ఆగడానికి వీల్లేదని వధువు అభిరామి పట్టుబట్టడంతో, ఇరు కుటుంబాల వారు వీరి వివాహాన్ని ఏప్రిల్ 25 (ఆదివారం) న జరపాలని నిర్ణయించారు.

జిల్లా కలెక్టర్, ఇతర అధికారుల అనుమతి వీరికి లభించడంతో కోవిడ్‌ వార్డులోనే వీరి జంట ఏకమైంది. వధువు, వరుడు పీపీఈ కీట్లను ధరించి వివాహం చేసుకున్నారు. కోవిడ్ వార్డులో ఈ పెళ్లి తంతు జరగడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

చదవండి: సంగీతంతో ఒత్తిడికి చెక్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top