కేరళలో ఆగని వర్ష బీభత్సం

Kerala Floods: 23 Dead PM Narendra Modi Speaks to CM Vijayan - Sakshi

22కి చేరిన మృతుల సంఖ్య

రాష్ట్రవ్యాప్తంగా 105 సహాయక శిబిరాలు

తిరువనంతపురం: కేరళలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఇడుక్కి, కొట్టాయం జిల్లాల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో మృతుల సంఖ్య 22కి చేరుకుంది. ఆదివారం ఉదయం నుంచి వర్షం కాస్త తగ్గుముఖం పట్టడంతో సైన్యం సహాయ చర్యల్ని ముమ్మరం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 105 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు.

నిర్వాసితుల్ని, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అక్కడిని తరలిస్తున్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఎప్పటికప్పుడు సహాయ చర్యల్ని సమీక్షిస్తున్నారు. కోవిడ్‌–19 నిబంధనలకు అనుగుణంగా ఆ శిబిరాల్లో ఏర్పాట్లు చేశారు. మాసు్కలు, శానిటైజర్లు పంపిణీ చేస్తున్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌తో పాటు జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రం 11 బృందాలను ఏర్పాటు చేసి సహాయ చర్యలను కొనసాగిస్తోంది.

అన్ని విధాలా అండగా ఉంటాం..
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేరళ ముఖ్యమంత్రి విజయన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. తాజా పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. కేరళకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కొండచరియలు విరిగిపడి ప్రజలు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ప్రధాని ట్వీట్‌ చేశారు. మరోవైపు కేరళ ఏ సాయం అడిగినా కేంద్రం చేస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. ‘‘మేము కేరళలో పరిస్థితులన్నింటినీ పర్యవేక్షిస్తున్నాం. ఎవరికి ఏ సాయం అవసరమైనా అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఇప్పటికే కేరళలో సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను’’ అని అమిత్‌ షా ట్వీట్‌ చేశారు. కేరళలో సోమవారం నుంచి ప్రారంభించాలి్సన పాఠశాలల్ని 20వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. శబరిమల ఆలయ సందర్శనకు రెండు రోజుల పాటు ఎవరూ రావొద్దని ఆలయ నిర్వహణ కమిటీ పేర్కొంది. కేరళలో మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా డ్యామ్‌లన్నీ పొంగి పొర్లుతూ ఉండడంతో పరివాహక ప్రాంతాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top