
అత్యవసర పరిస్థితులతో కేరళలో దిగిన యూకే యుద్ధ విమానం ఎఫ్ 35(F-35 fighter) ఎపిసోడ్ మరో మలుపు తిరిగింది. 20 రోజుల తర్వాత మరమ్మత్తుల విషయంలో యూకే నిపుణులు చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. దీంతో మిగిలిన ఒకే ఒక్క ఆప్షన్‌నే పరిశీలిస్తున్నట్లు సమాచారం.
బ్రిటన్‌కు చెందిన HMS Queen Elizabeth నౌకాదళ విమాన వాహక నౌక ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో మిషన్‌లో పాల్గొంది. జూన్ 14వ తేదీన ఈ నౌక నుంచి ఎగిరిన ఎఫ్ 35 ఫైటర్ జెట్ మిలిటరీ కార్గో ఎయిర్‌క్రాఫ్ట్.. తిరువంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. తొలుత సాంకేతిక సమస్యగా భావించిన నిపుణులు.. త్వరగతినే ఇది రిపేర్ అవుతుందని భావించారు. అయితే.. ఇంధనం తక్కువగా ఉండడం, ప్రతికూల వాతావరణం కారణంగానే ఇది ల్యాండ్ అయ్యిందని తర్వాతే తేలింది. ఈలోపు..
ల్యాండింగ్ అనంతరం హైడ్రాలిక్ స్నాగ్ అనే లోపం తలెత్తడంతో అది గాల్లోకి లేవలేదు. అప్పటి నుంచి CISF సిబ్బంది విమానానికి నిరంతర భద్రత కల్పించారు. అలాగే భారత వైమానిక దళం (IAF) లాజిస్టికల్ సహాయం అందిస్తూ వచ్చింది. ఈలోపు.. సుమారు 40 మంది బ్రిటిష్ ఇంజనీర్లు మరమ్మతుల కోసం కేరళకు వచ్చారు. కానీ సమస్య పరిష్కారం కాకపోవడంతో విమానాన్ని విడదీసి ఆ భాగాల్ని తరలించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇన్నిరోజులకుగానూ.. విమానం పార్కింగ్, హ్యాంగర్ ఛార్జీలను చెల్లించాలని UK ప్రభుత్వం నిర్ణయించింది. భారత వైమానిక దళం, నౌకాదళం, తిరువనంతపురం విమానాశ్రయ అధికారుల సహకారానికి UK హై కమిషన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.
మీమ్స్ వైరల్
తిరువనంతపురంలో నిలిచిపోయిన బ్రిటన్ ఎఫ్-35బీ యుద్ధ విమానం గురించి సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అయ్యాయి. OLXలో 4 కోట్లకే అమ్మకానికి! అని ఓ యూజర్ చమత్కరించారు. ఇది స్టెల్త్ కాదు... స్టక్! అంటూ మరో వ్యక్తి పోస్ట్ చేశారు. బ్రిటన్ టెక్నాలజీ.. చివరకు భారతీయ భూభాగంలో ఓడింది అంటూ ఓ మీమ్ దేశభక్తి టచ్‌తో వైరల్ అయ్యింది. ఇది ఫైటర్ జెట్ కాదు... పార్కింగ్ జెట్ అంటూ మరో యూజర్ ఎద్దేవా చేశారు.

ఇది టూమచ్ గురూ..
F-35B స్టెల్త్ యుద్ధ విమానం.. ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యుద్ధ విమానాల్లో ఒకటి. ఇది షార్ట్ టేకాఫ్ & వర్టికల్ ల్యాండింగ్ సామర్థ్యం కలిగి ఉంది. ఇలాంటి అత్యాధునికమైన విమానాలను ఇప్పటిదాకా అమెరికా, UK, ఇజ్రాయెల్ వంటి దేశాలే వినియోగిస్తున్నాయి. అమెరికాకు చెందిన సంస్థ Lockheed Martin Corporation F-35B స్టెల్త్ యుద్ధ విమానాలను తయారు చేస్తోంది.
F-35B (Short Takeoff and Vertical Landing version) ధర సుమారుగా $135.8 మిలియన్ డాలర్లు అంటే దాదాపు ₹1,170 కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ విమానంలో ఇంజిన్, ఆయుధ వ్యవస్థలు, స్టెల్త్ టెక్నాలజీ, అధునాతన సెన్సార్‌లు కూడా ఉంటాయి. ఇంజిన్ ఖర్చు మాత్రమే సుమారుగా $19.7 మిలియన్ (₹169 కోట్లు) వరకు ఉంటుంది. ఒక్క గంట ఎగరడానికి సుమారుగా $38,000 (₹32.88 లక్షలు) ఖర్చవుతుంది. F-35B యొక్క వార్షిక నిర్వహణ ఖర్చు సుమారుగా $6.8 మిలియన్ (₹58.8 కోట్లు) ఉంటుంది. అంతెందుకు.. ఈ జెట్‌లో వాడే హెల్మెట్ ధర $400,000 (₹3.4 కోట్లు). అంటే ఒక్క హెల్మెట్ ఒక లగ్జరీ కారు ధరతో సమానమన్నమాట. అంతేకాదు.. విమానాన్ని నడిపేందుకు ప్రత్యేక శిక్షణ అవసరం. ఇది కూడా ఖరీదైనదే.

పార్కింగ్ ఫీజు ఎంత చెల్లిస్తారంటే..
తిరువనంతపురం ఎయిర్‌పోర్టును వినియోగించుకున్నందుకు అధికారికంగా యూకే ప్రభుత్వం ఎంత పార్కింగ్ ఛార్జీలు చెల్లింస్తుంది అనే వివరాలు బయటకు రాలేదు. అయితే అది లక్షల్లోనే ఉండే అవకాశం ఉంది. తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో పార్కింగ్, భద్రత, హ్యాంగర్ ఛార్జీలు కలిపి రోజుకు ₹2–3 లక్షలు వరకు ఉండొచ్చని విమానాశ్రయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 20 రోజుల పాటు విమానం అక్కడే నిలిచిన నేపథ్యంలో, మొత్తం ఖర్చు ₹40–60 లక్షలు, అంతకంటే ఎక్కువ అయ్యే అవకాశం ఉంది.