భూతల స్వర్గం మళ్ళీ వెలవెల! | Kashmir tourism sector in crisis again | Sakshi
Sakshi News home page

భూతల స్వర్గం మళ్ళీ వెలవెల!

Apr 26 2025 4:35 AM | Updated on Apr 26 2025 4:35 AM

Kashmir tourism sector in crisis again

పర్యాటకుల విశ్వాసాన్ని దెబ్బతీసిన కశ్మీర్‌ ఉగ్ర దాడి

ఒక్క రోజులోనే 90% బుకింగ్స్‌ రద్దు చేసుకున్న వేలాది మంది పర్యాటకులు

ఇప్పటికే అక్కడ పర్యటిస్తున్న టూరిస్టులు సైతం హోటళ్లు ఖాళీ చేసిన వైనం

నాలుగేళ్లుగా పుంజుకుంటున్న పర్యాటక రంగంపై నీలినీడలు

ప్రశ్నార్థకంగా మారిన 2.5 లక్షల మంది కశ్మీరీల జీవనోపాధి

అగమ్యగోచరంగా రూ. 12 వేల కోట్ల టూరిజం పరిశ్రమ భవితవ్యం
 

భూతల స్వర్గంగా పేరుగాంచిన అందాల కశ్మీర్‌లో జరిగిన ఉగ్ర దాడి ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న అక్కడి పర్యాటక రంగాన్ని మళ్లీ సంక్షోభంలోకి నెట్టేసింది. పహల్గాంలో ముష్కరులు 26 మంది టూరిస్టులను అత్యంత పాశవికంగా హతమార్చడం పర్యాటకుల విశ్వాసాన్ని దారుణంగా దెబ్బతీయడమే కాకుండా దాదాపు 2.5 లక్షల మంది కశ్మీరీల జీవనోపాధి, కశ్మీర్‌ లోయ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని ప్రశ్నార్థకం చేసింది. మళ్లీ పర్యాటకుల్లో మునుపటి విశ్వాసం, ఉత్సాహం నెలకొనాలంటే ఎన్నేళ్లు పడుతుందోనని టూరిజం వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. - సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

హోటళ్లన్నీ ఖాళీ..
ఈ నెల 22న పహల్గాం సమీపంలో మినీ స్విట్జర్లాండ్‌గా పేరుగాంచిన బైసరన్‌ లోయలో పర్యాటకులపై ఉగ్రవాద దాడి ప్రభావంతో కశ్మీర్‌లో పర్యటించేందుకు సిద్ధమైన వేలాది మంది పర్యాటకుల్లో దాదాపు 90 శాతం మంది 24 గంటల వ్యవధిలోనే విమాన టికెట్లు రద్దు చేసుకున్నారు. మరోవైపు ఇప్పటికే కశ్మీర్‌ సందర్శనకు వచ్చిన పర్యాటకులు రాత్రికి రాత్రే హోటళ్లు, క్యాబ్‌ల బుకింగ్‌లు కూడా పెద్ద ఎత్తున రద్దు కావడం మొదలయ్యాయి.

ఇప్పట్లో పర్యాటక పరిశ్రమ కోలుకొనే అవకాశమే లేదని ఓ ట్రావెల్‌ ఏజెంట్‌ వ్యాఖ్యానించారు. ‘మొన్నటివరకు పర్యాటకులతో కళకళలాడిన మా హోటల్‌ ఇప్పుడు వెలవెలబోతోంది. అసలైతే గదులన్నీ వచ్చే నెలకు కూడా బుక్‌ అయ్యాయి. కానీ రాత్రికి రాత్రే పరిస్థితి ఒక్కసారిగా తల్లకిందులైంది. టూరిస్టులంతా భయంతో గదులు ఖాళీ చేసి వెళ్లిపోయారు’ అని ఓ హోటల్‌ యజమాని వాపోయారు.

కేంద్రం చర్యలన్నీ బూడిదపాలు..
కశ్మీరీలకు పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరు. జమ్మూకశ్మీర్‌ వార్షిక పర్యాటక పరిశ్రమ విలువ దాదాపు రూ. 12 వేల కోట్లు. దీని విలువ 2030 నాటికి రూ. 30 వేల కోట్లకు పెరుగుతుందని అంచనా. జమ్మూకశ్మీర్‌కు స్పెషల్‌ స్టేటస్‌ కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370ని కేంద్రం 2019లో రద్దు చేయడంతోపాటు రాష్ట్ర హోదా తొలగించి జమ్మూకశ్మీర్‌ను లద్దాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసింది. అలాగే ఏటా స్థానికంగా దాదాపు 50 వేల మందికి ఉపాధి కల్పించేలా, ఐదేళ్లలో రూ. 2 వేల కోట్ల వార్షిక పెట్టుబడులను ఆకర్షించేలా 2020లో ప్రత్యేక పర్యాటక పాలసీని తీసుకొచ్చింది. 

దీనికితోడు మౌలిక సదుపాయాల మెరుగుదల, విమాన కనెక్టివిటీ, విదేశీ పర్యాటకులకు ఆన్‌–అరైవల్‌ వీసా, 75 కొత్త పర్యాటక ప్రదేశాలు, 75 కొత్త వారసత్వ/సాంస్కృతిక ప్రదేశాలు, 75 కొత్త సూఫీ/మత ప్రదేశాల స్థాపన కోసం రూ. వెయ్యి కోట్ల బడ్జెట్‌ కేటాయించింది. కశ్మీర్‌ను దేశంలోని మిగిలిన ప్రాంతాలతో నేరుగా అనుసంధానించడానికి రైల్వే కూడా కసరత్తు ప్రారంభించింది.

ప్రీమియం రైలు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ కూడా ఇందులో ఉంది. కేంద్రం చర్యలతో 2020 నుంచి కశ్మీర్‌ లోయను సందర్శించే పర్యాటకుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. 2024 నాటికి పర్యాటకుల సంఖ్య సుమారు 2.36 కోట్లకు చేరుకుంది. కానీ ఇప్పుడు ఉగ్రవాద దాడితో అక్కడి పర్యాటక రంగం చుట్టూ సంక్షోభం ముసురుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement