ముంబై, కర్ణాటకల్లో రాత్రి కర్ఫ్యూ

Karnataka and Maharashtra imposing night curfew - Sakshi

డెహ్రాడూన్‌ జిల్లాలో క్రిస్మస్, న్యూ ఇయర్‌ వేడుకలపై నిషేధం

న్యూఢిల్లీ/సాక్షి, బెంగళూరు/ముంబై: కొత్త తరహా కరోనా వైరస్‌ ముప్పు నేపథ్యంలో పలు రాష్ట్రాలు ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించాయి. ముంబైలో మంగళవారం నుంచి రాత్రి కర్ఫ్యూ అమల్లోకి రాగా, నేటి(డిసెంబర్‌ 24) నుంచి జనవరి 1 వరకు రాష్ట్రవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు కర్నాటక ప్రకటించింది. అయితే, డిసెంబర్‌ 24 అర్ధరాత్రి నిర్వహించే ‘మిడ్‌నైట్‌ మాస్‌’ ప్రార్థనలకు మినహాయింపునిస్తున్నట్లు పేర్కొంది.  రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూను కఠినంగా అమలు చేస్తున్నామని, ఇళ్లల్లో నుంచి బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని ముంబై నగర పోలీసులు తెలిపారు. బార్లు, పబ్‌లపై కూడా రాత్రి 11 గంటల తరువాత తెరిచి ఉంచకుండా ఆంక్షలు విధించామన్నారు. ముంబైతో పాటు అన్ని మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

11 మందికి పాజిటివ్‌
లండన్‌ నుంచి ఢిల్లీకి నాలుగు విమానాల్లో వచ్చిన ప్రయాణికుల్లో 11 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మొత్తంగా 50 మంది ప్రయాణీకులను ఇన్‌స్టిట్యూషనల్‌ క్వారంటైన్‌కు పంపించారు. బ్రిటన్‌ నుంచి వచ్చిన ప్రయాణికుల విషయంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని అధికారులను గుజరాత్‌ ప్రభుత్వం ఆదేశించింది.   క్రిస్మమస్, నూతన సంవత్సర వేడుకలను బృందాలుగా జరుపుకోవడంపై ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌ జిల్లా అధికారులు నిషేధం విధించారు. బార్లు, రెస్టారెంట్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఈ ఉత్సవాలను నిషేధించినట్లు ప్రకటించారు. డెహ్రాడూన్, ముస్సోరి, రిషికేష్‌ల్లో ఈ నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top