
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ(yashwant varma) ‘నోట్ల కట్టల’ వ్యవహారంలో ఇవాళ కీలక మలుపు చోటు చేసుకుంది. కోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ రూపొందించిన నివేదికను బహిర్గతం చేయడం కుదరదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
జస్టిస్ వర్మ ఢిల్లీ హైకోర్టు జడ్జిగా ఉన్న టైంలో ఆయన అధికారిక బంగ్లాలో అగ్నిప్రమాదం చోటు చేసుకోగా.. మంటలర్పిన ఫైర్, పోలీస్ పోలీస్ సిబ్బందికి కాలిన నోట్ల కట్టలు కనిపించడం, ఆ వ్యవహారం బయటకు పొక్కడం సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై కోర్టు నియమించిన కమిటీ విచారణ జరిపి నివేదికను అందజేసింది కూడా. అయితే..
అందులో విషయాలను బహిర్గతం చేయాలంటూ ఆర్టీఐ వ్యవస్థ ద్వారా న్యాయస్థాన సమాచార అధికారికి దరఖాస్తు అందింది. అయితే సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్(CPIO) ఈ దరఖాస్తును తిరస్కరిస్తూ.. ఆర్టీఐ యాక్ట్‌లోని సెక్షన్ 8(1)(e) కింద సమాచారం అందించలేమని స్పష్టం చేశారు. ఈ క్రమంలో 2019 సంచలన తీర్పును న్యాయస్థానం ప్రస్తావించింది. సుభాష్ చంద్ర అగర్వాల్ కేసులో.. రాజ్యాంగ పరిధిలో గోప్యత హక్కు, సమాచార హక్కు ఈ రెండింటి సమతుల్యత అవసరమని కోర్టు వ్యాఖ్యానించింది.
మార్చి 14వ తేదీన జడ్జి ఊళ్లో లేని టైంలో బంగ్లాలో ఫైర్ యాక్సిడెంట్ చోటు చేసుకుని కాలిన నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఈ వ్యవహారంలో ఆరోపణలు రావడంతో ఆయన్ని అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. అయితే అలహాబాద్ బార్ అసోషియేషన్ నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో.. బదిలీ చేసినప్పటికీ విధులేవీ ఆయనకు అప్పగించలేదు.
అంతేకాదు.. మునుపెన్నడూ లేని రీతిలో ఆ ఇంట్లో బయటపడ్డ నోట్ల కట్టల ఫొటోలు, వీడియోలను సుప్రీం కోర్టు తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి ఆసక్తికర చర్చకు దారి తీసింది. అటుపై మార్చి 22వ తేదీన జడ్జి వర్మ నోట్ల కట్టల వ్యవహారంపై అంతర్గత విచారణకు ముగ్గురు జడ్జిలతో కూడిన కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ మే 3వ తేదీన తుది నివేదిక రూపొందించగా.. ఆ మరుసటి రోజు ఆనాడు సీజేఐగా ఉన్న సంజీవ్ ఖన్నాకు నివేదిక అందజేసింది. దానిని సీజేఐ ఓ లేఖ ద్వారా రాష్ట్రపతి, ప్రధాన మంత్రికి తెలియజేశారు. మరోవైపు తనపై వస్తున్నవి కేవలం ఆరోపణలేనని జస్టిస్ వర్మ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు.