భీకర కాల్పులు: సరందా అడవుల్లో టెన్షన్‌.. టెన్షన్‌ | Naxalites Encounter At Jharkhand's Saranda Forest: News Updates | Sakshi
Sakshi News home page

భీకర కాల్పులు: సరందా అడవుల్లో టెన్షన్‌.. టెన్షన్‌

Apr 17 2026 7:25 AM | Updated on Apr 17 2026 8:30 AM

Naxalites Encounter At Jharkhand's Saranda Forest: News Updates

సాక్షి, రాంచీ: నక్సలిజం నుంచి దేశానికి విముక్తి కల్పించామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పార్లమెంట్‌లో ప్రకటించిన తర్వాత కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో కూంబింగ్‌లు, దళాల లొంగుబాట్లు కొనసాగుతున్నాయి. తాజాగా జార్ఖండ్‌ సరందా అడవుల్లో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. 

వెస్ట్ సింగ్‌భూమ్-చైబాసా జిల్లాల మధ్య సరందా అడవుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మిసిర్ బెస్రా దాగి ఉన్నాడనే సమాచారం రావడంతో భద్రతా బలగాలు గురువారం గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో ఇరువర్గాలు ఎదురెదురు పడడంతో కాల్పులు చోటు చేసుకున్నాయి. నిన్నంతా కాల్పులు కొనసాగగా.. పోద్దుపోవడంతో ఆ ప్రాంతాన్ని హై అలర్ట్ లో ఉంచామని స్థానిక పోలీస్‌ అధికారి ఒకరు తెలిపారు. 

మావోయిస్టుల అగ్రనేత మిసిర్ బెస్రా తన దళాన్ని తరలించేందుకు ప్రయత్నిస్తున్నాడని ఇంటెలిజెన్స్‌ నివేదికల ద్వారా భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. ఈ గ్రూపులో టాప్‌ లీడర్లు మోచు, సాగెన్ అంగారియా, అశ్విన్ కూడా ఉన్నట్లు సమాచారం. దీంతో కోబ్రా, జార్ఖండ్‌ జాగ్వార్‌, స్థానిక పోలీస్‌లతో కూడిన జాయింట్‌ టీం మారాంగ్ పొంగా–బలిబా గ్రామాల మధ్య అడవిలోకి ప్రవేశించింది. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని భారీ స్థాయిలో భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అదనపు భద్రతా బలగాలను రంగంలోకి దించారు. 

మిసిర్‌ బెస్రా నేపథ్యం.. 

మిసిర్ బెస్రా(71).. జార్ఖండ్–ఒడిశా రీజియన్‌లో మావోయిస్టు అగ్రనేత. గిరిడిహ్ జిల్లాకు చెందిన మదన్‌దిహ్ గ్రామం ఈయన స్వస్థలం. సుదీర్ఘంగా మావోయిస్టు పార్టీలో కొనసాగిన ఈయన.. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఎదిగారు. సీపీఎం (Maoist) పొలిట్‌బ్యూరోలో చివరగా మిగిలింది ఈయనేనని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. 

ఏంఏ మధ్యలో వదిలేసిన మిసిర్ బెస్రా.. శిబు సోరెన్‌ పోరాటాల ప్రభావంతో వామపక్ష భావజాలంవైపు ఆకర్షితుడయ్యాడు. 1986లో మావోయిస్టు కమ్యూనిస్ట్‌ సెంటర్‌ ఆఫ్‌ ఇండియాలో చేరాడు. 1989 నుంచి అజ్ఞాతంలో ఉంటూ వస్తున్నారు. 2000లో జార్ఖండ్ రీజినల్ కమిటీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించాడు. 2004లో MCCI–PWG విలీనంతో CPI (Maoist)లో సెంట్రల్ మిలిటరీ కమిషన్ సభ్యుడయ్యాడు. ఈయన నేతృత్వంలో.. 

2000లో రాంచీ ప్రాంతంలో పోలీసుల నుండి నాలుగు రైఫిళ్లు దోచుకున్నారు. 2001లో హజారీబాగ్, ధన్‌బాద్‌లోని సీఆర్పీఎఫ్‌, జేఏపీ క్యాంపులపై దాడులు చేసి 25 మంది భద్రతా సిబ్బందిని హతమార్చారు. 2005లో బీహార్‌లోని జెహనాబాద్ జైలుపై దాడి చేసి 389 మంది ఖైదీలను తప్పించారు. 2007లో అరెస్టు అయ్యి.. ఆ తర్వాత పోలీసుల కళ్లు గప్పి జైలు నుండి తప్పించుకున్నారు. జార్ఖండ్, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని మిసిర్‌పై 154 కేసులు నమోదయ్యాయి. మూడు ఎన్‌ఐఏ కేసులు కూడా ఉన్నాయి.పలు దాడులకు సంబంధించిన వ్యూహకర్త అయిన మిసిర్‌ బెస్రా మీద రూ.కోటి బహుమతి ప్రకటించింది జార్ఖండ్‌ ప్రభుత్వం. 

ఇతర సీనియర్ నేతలు లొంగిపోతున్నా.. ఎన్‌కౌంటర్‌లలో మరణించినా.. బెస్రా మాత్రం సరందా అడువుల్లో దాక్కుని భద్రతా బలగాలకు చిక్కడం లేదు. ఆపరేషన్‌ కగార్‌ నేపథ్యంలో.. మిసిర్‌ను లొంగిపోవాలని ఈ మధ్యే కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. తాజాగా.. ఏప్రిల్‌ 3న పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టుల సీనియర్‌ నేత ప్రశాంత్ బోస్‌ (కిషన్‌ దా) రాంచీ ప్రభుత్వాసుపత్రిలో కన్నుమూశారు. మరణించే ముందు మిసిర్‌ బెస్రా అలియాస్‌ సాగర్‌ను ఉద్దేశించి కిషన్‌ దా ఓ లేఖ రాశారు. ‘‘ఆయుధ పోరాటం ద్వారా లక్ష్యాలను సాధించడం ఇక సాధ్యం కాదని.. పార్టీకి కొత్త వ్యూహం అవసరమని’’ ఆ లేఖలో మిసిర్‌కు సూచించారాయన. 

వెలువడని అధికారిక ప్రకటన.. 
ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు.. మరికొందరు గాయపడినట్లు స్థానిక మీడియా కథనాలు ఇస్తోంది. అలాగే.. కోబ్రా బెటాలియన్‌కు చెందిన ఐదుగురు జవాన్లు గాయపడ్డారని.. ఇందులో ఒకరి పరిస్థితి విషమించడంతో రాంచీకి ఎయిర్‌లిఫ్ట్‌ చేసినట్లు సమాచారం అందుతోంది. అయితే ఎదురు కాల్పులు, ఆ ప్రాంతంలో ఇంకా కూంబింగ్‌ కొనసాగుతుండడంతో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 

కేంద్రం కీలక ప్రకటన
దశాబ్దాలుగా వేళ్లూనుకున్న నక్సలిజం నుంచి దేశానికి విముక్తి కల్పించామని ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా లోక్‌సభ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. దేశంలో మావోయిస్టు ప్రభావిత జిల్లాలు లేవని కేంద్ర ప్రభుత్వం గురువారం.. రాష్ట్రాలకు అధికారికంగా సమాచారం అందించింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని నిర్మూలిస్తామని కేంద్రం ప్రకటిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గత రెండేళ్లుగా మావోయిస్టుల ఏరివేత కోసం భారీ ఆపరేషన్లు చేపట్టింది. 

Advertisement
 
Advertisement
Advertisement