అతి ప్రమాదకర చర్య
ఇతర దేశాలూ పాటిస్తే కల్లోలమే
మదురో పదవీచ్యుతిపై నిపుణులు
న్యూఢిల్లీ: వెనెజువెలాపై అమెరికా మెరుపు దాడికి దిగి అధ్యక్షుడు నికొలస్ మదురోను నిర్బంధించి విచారణ పేరిట తమ దేశానికి తరలించిన తీరును అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల నిపుణులు పూర్తిగా తప్పుబడుతున్నారు. ‘‘ఇది అస్సలు సరికాదు. అత్యంత దారుణమైన, అంతకుమించిన ప్రమాదకరమైన చర్య. ప్రపంచానికే తప్పుడు సంకేతాలు పంపే ఉదంతం.
ఒక దేశం మరో సార్వభౌమ దేశ రాజధానిపై ఉరుముల్లేని పిడుగులా విరుచుకుపడి దేశాధినేతను భార్యాసమేతంగా ఎత్తుకెళ్లిపోవడమా? దీన్నసలు ఎలాంటి నీతిగా అర్థం చేసుకోవాలి? అమెరికాను చూసి స్ఫూర్తి పొంది ఇతర శక్తిమంతమైన దేశాలు తమ ఇరుగు పొరుగు ప్రత్యర్థి దేశాల్లో కంట్లో నలుసుగా మారిన అధినేతలను అడ్డు తప్పించుకునేందుకు ఈ మార్గాన్నే అందిపుచ్చుకునే ప్రమాదముంది. అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా కల్లోల పరిస్థితులు చెలరేగుతాయి’’అంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జరిగింది ఇప్పటికీ నమ్మశక్యంగా లేదంటూ భారత మాజీ దౌత్యవేత్త, వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు రాజీవ్ డోగ్రా విస్మయం వ్యక్తం చేశారు. ‘‘అంతర్జాతీయ చట్టాలు, సంప్రదాయాలు, పద్ధతులను పూర్తిగా తుంగలో తొక్కుతూ పొరుగు దేశాధినేతను ఎత్తుకెళ్లిపోవడమా? అమెరికా చర్య ఎవరికీ ఇంకా పూర్తిగా జీర్ణం కావడం లేదు. ఇటువంటివి బహుశా ఓ వందేళ్ల క్రితం దాకా రాజుల జమానాలో జరిగి ఉంటాయేమో! ఇటీవలి కాలంలో మాత్రం కచ్చితంగా కనీవినీ ఎరుగని సంఘటనే ఇది’’అని అన్నారాయన. మదురోను బందీకృతుణ్ణి చేసే క్రమంలో ట్రంప్ అన్ని సంప్రదాయాలను, చట్టాలనూ అడ్డంగా కాలదన్నారంటూ డోగ్రా దుయ్యబట్టారు.
‘‘మదురో పట్ల వెనెజువెలావాసులకు ఎలాంటి అభిప్రాయముందన్నది పూర్తిగా వారి అంతర్గత వ్యవహారం. ఆ విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సింది అక్కడి ప్రజలే. కానీ తనకు ఇలాంటివేవీ అస్సలు పట్టవని ట్రంప్ ఇప్పటికే చాలాసార్లు, చాలా విషయాల్లో రుజువు చేసుకున్నారు. ముఖ్యంగా రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ తన ఏకపక్ష పోకడలతో ప్రపంచాన్నే అతలాకుతలం చేస్తున్నారు’’అని ఆయన విమర్శించారు. ఇంత దారుణంగా వ్యవహరించేందుకు మదురో కనీసం సైనిక నియంత కూడా కాదని మరో వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు బ్రిగేడియర్ రాహుల్ కె.¿ోంస్లే గుర్తు చేశారు. ట్రంప్ తన మతిలేని దూకుడును సమర్థించుకోవడం కూడా కష్టమేనని అభిప్రాయపడ్డారు.


