కులం పేరుతో దూషిస్తూ.. ఇండిగో సిబ్బందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు | Indigo Trainee Pilot Approach Police Case Full Details | Sakshi
Sakshi News home page

కులం పేరుతో దూషిస్తూ.. ఇండిగో సిబ్బందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

Jun 23 2025 2:24 PM | Updated on Jun 23 2025 3:03 PM

Indigo Trainee Pilot Approach Police Case Full Details

న్యూఢిల్లీ: ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ట్రైనీ పైలట్‌ ఒకరు.. సంచలన ఆరోపణలకు దిగారు. తనను కులం పేరుతో అతిదారుణంగా దూషించారంటూ సహచరులపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురుగ్రామ్‌లోని ఎయిర్‌లైన్స్‌ హెడ్‌క్వార్టర్స్‌ ఈ ఘటన జరగ్గా.. పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు ముమ్మరం చేశారు. 

బెంగళూరుకు చెందిన శరణ్‌ కుమార్‌(35) అనే ఇండిగో ట్రైనీ పైలట్.. ఎమ్మార్‌ క్యాపిటల్‌ టవర్‌ 2లో జరిగిన మీటింగ్‌కు హాజరయ్యారు. ఆ టైంలో మరో ముగ్గురు ఉద్యోగులు అతన్ని ఉద్దేశించి దారుణమైన వ్యాఖ్యలు చేశారు. శరణ్‌ తండ్రి అశోక్‌ కుమార్‌ చేసిన ఫిర్యాదులో.. ‘‘కాక్‌ పిట్‌లో కూర్చుని విమానం నడిపేందుకు నీకు(శరణ్‌ను ఉద్దేశించి..) అర్హత లేదు. ఇండిగోలో గుమాస్తాగా కాదు కదా.. కనీసం మా బూట్లు నాకడానికి కూడా నువ్వు పనికి రావు. పోయి.. మీ తాతముత్తాతల్లాగా చెప్పులు కుట్టుకుని పని చేసుకుంటూ బతుకు’’ అంటూ తనపై వ్యాఖ్యలు చేశారని తపస్‌ డే, మనిష్‌ సహానీ, రాహుల్‌ పాటిల్‌పై శరణ్‌ ఫిర్యాదు చేశారు. అంతేకాదు..

తన కుమారుడి విషయంలో ఎయిర్‌లైన్స్‌ వాళ్లు దారుణంగా వ్యవహరించారని.. ఈ విషయాన్ని ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ఎథిక్స్‌ కమిటీ, ఆఖరికి ఆ సంస్థ సీీఈవో దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు లేవని అశోక్‌ మీడియా ముందు వాపోయారు. అంతేకాదు.. తన కొడుకు విధినిర్వహణలో సక్రమంగా ఉన్నప్పటికీ సెలవులు ఇవ్వకుండా, పైగా జీతాల్లో కోతలు పెట్టారని ఆరోపించారాయన.  

ఘటనపై బీఎన్‌ఎస్‌లోని పలు సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు బెంగళూరు పోలీసులు. అయితే ఈ ఘటన జరిగింది గురుగ్రామ్‌(హర్యానా)లోని కార్పొరేట్‌ ఆఫీస్‌ పరిధిలో. దీంతో జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన బెంగళూరు పోలీసులు.. గురుగ్రామ్‌లోని డీఎల్‌ఎఫ్‌-1 పీఎస్‌కు కేసును బదిలీ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement