వాట్సాప్‌కు కేంద్రం గట్టి హెచ్చరిక

Indian Government Asks WhatsApp To Withdraw New Privacy Policy - Sakshi

ఏకపక్ష నిర్ణయాలు ఆమోదయోగ్యం కాదు 

భారత యూజర్లను గౌరవించాల్సిందే 

వాట్సాప్‌నకు స్పష్టం చేసిన కేంద్రం

న్యూఢిల్లీ: ప్రైవసీ పాలసీలో మార్పులను ప్రతిపాదించిన మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ తీరుపై కేంద్రం ఘాటుగా స్పందించింది. డేటా గోప్యత విధానంలో ఏకపక్షంగా మార్పులు చేయడం ఎంత మాత్రం సముచితం, ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ప్రతిపాదిత మార్పులను ఉపసంహరించుకోవాలని సూచించింది. వాట్సా ప్‌ సీఈవో విల్‌ క్యాథ్‌కార్ట్‌కు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ ఈ మేరకు ఘాటుగా లేఖ పంపింది. ఏకంగా 40 కోట్లు పైగా యూజర్లున్న భారత మార్కెట్‌ వాట్సాప్‌నకు కీలకంగా ఉంటోందన్న సంగతి ఇందులో గుర్తు చేసింది. డేటా పంచుకునే విషయంలో యూజర్ల అభిమతంతో పని లేకుండా ఏకపక్షంగా ప్రైవసీ పాలసీని మార్చేయడమన్నది. భారతీయ పౌరుల స్వయంప్రతిపత్తిపై పడే పరిణామాలపై తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తోందని కేంద్రం వ్యాఖ్యానించింది.

భారత యూజర్లను గౌరవించి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. సమాచార గోప్యత, ఐచ్ఛికాలు ఎంచుకునే స్వేచ్ఛ, డేటా భద్రత తదితర అంశాల్లో వాట్సాప్‌ తన ధోరణిని పునఃసమీక్షించుకోవాలని, ప్రతిపాదిత మార్పులను తక్షణం వెనక్కి తీసుకోవాలని సూచించింది. మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో పాటు ఇతర గ్రూప్‌ సంస్థలతో కూడా యూజర్ల డేటాను పంచుకునే విధంగా ప్రైవసీ పాలసీని మారుస్తున్నామని, దీనికి అంగీకరించే యూజర్లు మాత్రమే తమ సర్వీసులు పొందగలరని వాట్సాప్‌ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై దుమారం రేగడం, యూజర్లు ప్రత్యామ్నాయ మెసేజింగ్‌ యాప్స్‌వైపు మళ్లుతుండటంతో వాట్సాప్‌ కాస్త వెనక్కి తగ్గి.. మార్పుల ను కొంత కాలం పాటు వాయిదా వేసింది.  

మీ వివరాలు కూడా ఇవ్వండి .. 
అసలు భారత్‌లో ఏయే సర్వీసులు అందిస్తున్నారు, ఏయే డేటా సేకరిస్తున్నారు, వేటి గురించి అంగీకారం, అనుమతులు తీసుకుంటున్నారు వంటి వివరాలన్నీ ఇవ్వాలంటూ వాట్సాప్‌నకు కేంద్రం సూచించింది. అలాగే భారత్‌లో అమలు చేస్తున్న ప్రైవసీ పాలసీ, మిగతా దేశాల్లో పాటిస్తున్న పాలసీకి మధ్య తేడాలేమైనా ఉన్నాయా అన్నది తెలియజేయాలని పేర్కొంది. యూజర్ల వివరాలను భద్రంగా ఉంచేందుకు చట్టపరంగా నిర్దేశించిన జాగ్రత్తలన్నీ వాట్సాప్‌ పాటించాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top