
తొలుత 7 రోజులపాటు క్వారంటైన్‌లో
ఆ తర్వాతే బాహ్య ప్రపంచంలోకి
న్యూఢిల్లీ: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)లో సహచరులతో కలిసి పరిశోధనల్లో నిమగ్నమైన భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా పునరాగమనానికి సమయం ఆసన్నమైంది. ఆయన ఈ నెల 14న ఐఎస్‌ఎస్ నుంచి బయలుదేరి, 15వ తేదీన భూమిపైకి చేరుకోబోతున్నారు.
శుభాంశు శుక్లాతోపాటు మరో ముగ్గురు వ్యోమగాములు పెగ్గీ విట్సన్, స్లావోజ్ ఉజ్‌నాన్‌స్కీ–విస్నివ్‌స్కీ, టిబోర్ కపు భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 4.35 గంటలకు ఐఎస్‌ఎస్ నుంచి వేరుపడతారని(అన్‌డాకింగ్), అనంతరం క్రూ డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌లో భూమి దిశగా ప్రయాణం సాగిస్తారని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ఒక ప్రకటనలో వెల్లడించింది.
మంగళవారం సాయంత్రం 3 గంటలకు అమెరికాలోని కాలిఫోర్నియా తీరంలో భూమిపై అడుగు పెడతారని తెలియజేసింది. శుభాంశు శుక్లాతోపాటు ఇతర వ్యోమగాములు భూమికిపైకి తిరిగివచి్చన తర్వాత వారం రోజులపాటు క్వారంటైన్‌లో ఉంటారు. సైంటిస్టులు వారికి భిన్నరకాల పరీక్షలు నిర్వహిస్తారు. భూవాతావరణానికి పూర్తిస్థాయిలో అలవాటు పడిన తర్వాత వ్యోమగాములు బాహ్య ప్రపంచంలోకి వస్తారు. స్పేస్‌ఎక్స్ యాగ్జియం–4 మిషన్‌లో భాగంగా నలుగురు వ్యోమగాములు గత నెలలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న సంగతి తెలిసిందే.