డ్రాగన్‌కు కౌంటర్‌ ఇచ్చేందుకు సిద్ధం!

India Rolls Out Its Missiles To Counter Chinese Threat - Sakshi

న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో చైనా ఆర్మీ నుంచి ఎదురయ్యే ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవడానికైనా భారత్‌ సమాయత్తమవుతోంది. పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న డ్రాగన్‌కు దీటుగా సమాధానమిచ్చేందుకు వీలుగా గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా యుద్ధ ట్యాంకులు, ఇతర సామగ్రిని ఇప్పటికే తరలించింది. అదే విధంగా.. జిన్‌జియాంగ్‌, టిబెట్‌ ప్రాంతంలో చైనా భారీ స్థాయిలో క్షిపణులు మోహరిస్తోందన్న వార్తల నేపథ్యంలో బ్రహ్మోస్‌, నిర్భయ్‌, ఆకాశ్‌ వంటి మిసై​​​​​ళ్లతో చెక్‌ పెట్టేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. చైనా గనుక హద్దు దాటితే వీటితో పాటు ఈ సూపర్‌ సోనిక్‌ నిర్భయ్‌ను రంగంలోకి దించేందుకు సమాయత్తమవుతున్నట్లు సమాచారం. (చదవండి: ప్రతికూల వాతావ‘రణ’మైనా రెడీ!)

ఇక ఎల్‌ఏసీ వెంబడి వివాదాస్పద ఆక్సాయ్‌ చిన్‌తో పాటు కష్‌గర్‌, హొటాన్‌, లాసా, నియాంగిచిల్‌ ప్రాంతాల్లో చైనా దుందుడుకుగా వ్యవహరిస్తున్న తరుణంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గాల్లో నుంచి గాల్లోకి, గాల్లో నుంచి ఉపరితలం మీదకు ప్రయోగించగలిగే బ్రహ్మోస్‌ 500 కిలోమీటర్లు, 800 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల నిర్భయ్‌ క్రూయిజ్‌ మిసైల్‌ ద్వారా ప్రత్యర్థి దేశ ఆర్మీ పన్నాగాలను తిప్పికొట్టేందుకు సన్నద్ధమవుతోంది. తూర్పు లదాఖ్‌లో ఘర్షణ వాతావరణం, హిందూ మహాసముద్రంలో పీఎల్‌ఏ యుద్ధనౌకలు మోహరించిన వేళ, కార్‌ నికోబార్‌లోని ఐఏఎఫ్‌ ఎయిర్‌బేస్‌లో సు- 30 ఎమ్‌కేఐ యుద్ధ విమానాలను మోహరించి ఎయిర్‌- టూ- ఎయిర్‌ రిఫ్యూల్లర్స్‌(గాల్లోనే ఇంధనం నింపుకునేలా) ఉపయోగించి చురుగ్గా కదులుతూ ప్రత్యర్థులకు దీటుగా బదులిచ్చేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం.

అదే విధంగా.. నిర్భయ్‌ వంటి సూపర్‌సోనిక్‌ మిస్సైళ్లలోని అంతర క్షిపణుల ద్వారా సుమారు 1000 కిలోమీటర్ల పరిధిలో గల లక్ష్యాలను చేరుకునేలా(100 మీటర్ల నుంచి 4 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగరటం సహా టార్గెట్‌ను ఫిక్స్‌ చేసి సమర్థవంతంగా ఛేదించేలా) ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఒకేసారి 64 టార్గెట్లను ట్రాక్‌ చేసి, ఒకేసారి పన్నెండింటిపై విరుచకుపడగలిగే 3-డీ రాజేంద్ర రాడార్‌ కలిగి ఉన్న ఆకాశ్‌ క్షిపణిని ప్రయోగించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కాగా యుద్ధ విమానాలు, క్రూయిజ్‌ మిసైళ్లు, బాలిస్టిక్‌ మిసైళ్లను కూడా పేల్చేయగల సామర్థ్యం దీనిసొంతం. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top