
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విస్తృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 97,894 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 51,18,253 కు చేరుకుంది. సెప్టెంబర్ 16న కరోనా కేసుల సంఖ్య 50 లక్షల మార్కు దాటింది. గత 24 గంటల్లో 1,132 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 83,198కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 40,25,079కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 10,09,976 గా ఉంది. యాక్టివ్ కేసులతో పోలిస్తే రికవరీ కేసులు 30 లక్షలకు పైగా ఎక్కువగా ఉన్నాయి. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 19.73 శాతం ఉన్నాయి. గ రెండు రోజుల్లోనే 82 వేలకు పైగా కోవిడ్ రోగులు కోలుకున్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని, ప్రస్తుతం ఇది 78.64 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.63 శాతానికి పడిపోయింది.
ముంబైలో నెలాఖరుదాకా సెక్షన్–144
సాక్షి, ముంబై: ముంబైలో సెక్షన్ –144 అమలును ఈ నెలాఖరుదాకా పొడిగించారు. ముంబైలో కొన్ని రోజులుగా కోవిడ్–19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరంలేదని, కొత్తగా ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదని మంత్రి ఆదిత్య ఠాక్రే స్పష్టం చేశారు.