ప్రపంచ ఔషధశాల భారత్‌.. 100 దేశాలకు కరోనా టీకా

India is now being called pharmacy of the world says PM Narendra Modi - Sakshi

ఫార్మా ఆవిష్కరణల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ: ఈ ఏడాది దాదాపు 100 దేశాలకు 6.5 కోట్లకుపైగా కరోనా టీకా డోసులను ఎగుమతి చేశామని ప్రధాని మోదీ చెప్పారు. భారత ఆరోగ్యసంరక్షణ రంగం ప్రపంచ దేశాల నమ్మకాన్ని చూరగొన్నదని తెలిపారు. భారత్‌ను ప్రపంచ ఔషధశాలగా (ఫార్మసీ) పరిగణిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని టీకా డోసులను విదేశాలకు ఎగుమతి చేయబోతున్నామని వెల్లడించారు.

ఫార్మాస్యూటికల్‌ రంగానికి సంబంధించి తొలి ‘ప్రపంచ ఆవిష్కరణల శిఖరాగ్ర సదస్సు’ను గురువారం ప్రారంభించారు. మనదేశంలో వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలకు సానుకూల వాతావరణం కల్పిస్తున్నామని, ప్రోత్సాహం అందిస్తున్నామని మోదీ గుర్తుచేశారు. దీనివల్ల కొత్త ఔషధాల అభివృద్ధి, వినూత్న వైద్య పరికరాల తయారీలో భారత్‌ అగ్రగామిగా ఎదగడం ఖాయమని చెప్పారు. వైద్య రంగాన్ని గొప్ప స్థాయికి చేర్చగల సామర్థ్యం ఉన్న సైంటిస్టులు, సాంకేతిక నిపుణులు మన దేశంలో ఎంతోమంది ఉన్నారని తెలియజేశారు. 

ఇండియాను స్వయం సమృద్ధ దేశంగా(ఆత్మనిర్భర్‌) మార్చడానికి దేశంలోని 130 కోట్ల మంది కంకణం కట్టుకున్నారని ప్రధాని పేర్కొన్నారు. టీకాలు, ఔషధాల అభివృద్ధి, ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్థాలను దేశీయంగానే తయారు చేసుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు.  కోవిడ్‌–19 మహమ్మారి వ్యాప్తి ఉధృతంగా ఉన్నప్పుడు ఇదే స్ఫూర్తిని చాటిచెప్పామని ఉద్ఘాటించారు. 150కిపైగా దేశాలకు ప్రాణరక్షక ఔషధాలు, వైద్య పరికరాలు అందజేశామని వివరించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ పురోగతికి ఫార్మా రంగం ఎంతగానో దోహదపడుతోందని ప్రశంసించారు.

డిజిటల్‌ విప్లవంతో కొత్త సవాళ్లు
ఆస్ట్రేలియా డైలాగ్‌లో ప్రధాని మోదీ
క్రిప్టోకరెన్సీ వాడకం ప్రపంచవ్యాప్తంగా నానాటికీ పెరుగుతోందని, ఇది దుష్ట శక్తుల చేతుల్లో పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని∙మోదీ చెప్పారు. డిజిటిట్‌ విప్లవంతో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు భావ సారుప్యం కలిగిన దేశాలన్నీ చేతులు కలపాలని పిలుపునిచ్చారు. ‘ఆస్ట్రేలియన్‌ స్ట్రాటజిక్‌ పాలసీ ఇనిస్టిట్యూషన్‌’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, ప్రభుత్వ అధికారులతో గురువారం నిర్వహించిన సదస్సులో(సిడ్నీ డైలాగ్‌) మోదీ ఆన్‌లైన్‌ ద్వారా ప్రసంగించారు. ఆధిపత్యం చెలాయించడానికి టెక్నాలజీ ఉపయోగించుకొనే అవకాశం ఉందని గుర్తుచేశారు. ఫ్యూచర్‌ టెక్నాలజీలో పరిశోధనలు, అభివృద్ధి కోసం ప్రజాస్వామ్య దేశాలు ఉమ్మడిగా పెట్టుబడులు పెట్టాలని పేర్కొన్నారు.

ప్రజాభిప్రాయాన్ని తారుమారు చేసే యత్నాలను అడ్డుకొనేందుకు కృషి చేయాలని చెప్పారు. రాజకీయాలు, ఆర్థిక, సామాజిక రంగాలను డిజిటల్‌ యుగం పునర్నిర్వచిస్తోందని తెలిపారు. డిజిటల్‌ విప్లవంతో దేశాల సార్వభౌమత్వం, పరిపాలన, విలువలు, హక్కులు, భద్రత విషయంలో కొత్త ప్రశ్నలు ఉదయిస్తున్నాయని వెల్లడించారు. క్రిప్టోకరెన్సీ విషయంలో అప్రమత్తత అవసరమని ఉద్ఘాటించారు. ఇది మన యువతను నాశనం చేసే ప్రమాదం ఉందన్నారు. భారత్‌లో డేటాను ప్రజల సాధికారత కోసం ఒక వనరుగా ఉపయోగిస్తున్నామని గుర్తుచేశారు. డిజిటల్‌ విప్లవంతో అభివృద్ధికి నూతన అవకాశాలే కాదు, కొత్త సవాళ్లు సైతం ఎదురవుతున్నాయని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బ్రాడ్‌బ్యాండ్‌తో భారత్‌లో 6 లక్షల గ్రామాలను అనుసంధానించామని తెలిపారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top