
దేశంలో ఇంటర్నెట్ వినియోగదారులు 96.9 కోట్లు
నెలకు తలసరి డేటా వాడకం 21.53 జీబీ
మూడేళ్లలో 44% పెరిగిన డేటా వినియోగం
ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా ఓ స్మార్ట్‌ఫోన్ . అవసరానికే కాదు వినోదానికీ ఈ ఉపకరణమే. మెసేజింగ్, కాలింగ్ యాప్స్, సామాజిక మాధ్యమాలు జీవితంలో భాగం అయిపోయాయి. ఇంకేముంది.. డేటా, అన్ లిమిటెడ్ ప్యాక్స్‌తో జనం సింపుల్‌గా మొబైల్‌తో ‘రీచార్జ్’ అవుతున్నారు. దేశంలో సగటున ఒక్కో నెల మొబైల్ కస్టమర్లు 21.53 జీబీ డేటాను ఆస్వాదిస్తున్నారు. మూడేళ్లలో సగటున నెలకు డేటా వినియోగం 44.59% పెరిగిందంటే నెట్‌లో ఏ స్థాయిలో విహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
దేశంలో వైర్‌లెస్ డేటా చందాదారుల సంఖ్య 2025 మార్చి నాటికి 93.9 కోట్లు. అంతకుముందు ఏడాదిలో ఇది 91.3 కోట్లు. మొత్తం బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల్లో వైర్‌లెస్ వాటా ఏకంగా 95 శాతానికిపైగా ఉంది. ఇక వైర్‌లెస్ డేటా వినియోగం 1,94,774 పెటాబైట్స్ నుంచి ఏడాదిలో 17.46 శాతం అధికమై 2,28,779 పెటాబైట్స్‌కు ఎగసింది. అంటే 2,28,77,90,00,000 జీబీ అన్నమాట. టెలికం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) ఇటీవల విడుదల చేసిన 2024–25 గణాంకాల్లో ఈ ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుల్లో ఎల్‌టీఈ (4జీ) వాటా 64.2 కోట్లు కాగా, 5జీ చందాదారుల సంఖ్య 24.4 కోట్లకు చేరింది. 100 మంది జనాభాలో ఇంటర్నెట్ వాడుతున్న వారు 68.63 శాతం ఉన్నారు. ఇంటర్నెట్ మార్కెట్లో ప్రైవేట్ కంపెనీల వాటా ఏకంగా 96 శాతం ఉంది. మిగిలినది ప్రభుత్వ టెలికం సంస్థలది. వైర్‌లెస్ డేటా వినియోగం ద్వారా ఒక్కో కస్టమర్ నుంచి టెలికం కంపెనీలకు ప్రతి నెలా సగటున 2023–24లో రూ.211.36 సమకూరితే.. 2024–25లో అది రూ.231.64కి పెరిగింది. 2021–22లో ఇది రూ.147.94 మాత్రమే.