
దేశంలో ఏటా 7,800 కిలో టన్నుల వ్యర్థాలు
భారతీయుల తలసరి వస్త్ర వ్యర్థాలు 5 కిలోలు
రీసైక్లింగ్, పునర్వినియోగం వాటా చాలా తక్కువ
వృథా అరికడితేనే కాలుష్య నియంత్రణ సాధ్యం
మనదేశంలో దుస్తుల వినియోగంతోపాటు.. వ్యర్థాలూ పెరిగిపోయాయి. సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ (సీఎస్‌టీఈపీ) నివేదిక ప్రకారం.. ప్రపంచ వాణిజ్యంలో కీలకపాత్ర పోషిస్తున్న వస్త్ర పరిశ్రమ కాలుష్యకారక పరిశ్రమల్లోనూ ఒకటిగానూ ఎదిగింది! ఏటా ప్రపంచ వ్యాప్తంగా 9.2 కోట్ల టన్నుల టెక్స్‌టైల్ వ్యర్థాలు పోగుపడుతున్నాయి. వీటిలో కేవలం 12–15 శాతం మాత్రమే రీసైక్లింగ్‌కు వెళ్తున్నాయి. వాటిలో కూడా ఒక శాతమే కొత్త దుస్తులుగా రీసైకిల్ అవుతున్నాయి. మనదేశంలోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు.
ఓ 15–20 ఏళ్ల కిందటి మాట...
ఒక కుటుంబం సంక్రాంతి లేదా దసరాకి కొత్త బట్టలు కొనేవారు లేదా కుట్టించుకునేవారు. మళ్లీ కొత్త బట్టలు అంటే పుట్టినరోజుకే. వాటిని కూడా ఎంతో అపురూపంగా వాడేవారు.
కానీ ఇప్పుడు...
ప్రతి పండుగకూ షాపింగ్. వారాంతాల్లో షాపింగ్. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటివి బిగ్ సేల్ పెడితే షాపింగ్. బోరు కొడితే షాపింగ్. ఫాస్ట్ ఫ్యాషన్, అల్ట్రా ఫాస్ట్ ఫ్యాషన్ వంటి ధోరణుల వల్ల.. తక్కువ ధరలో లేటెస్ట్ ఫ్యాషన్లు, వాటి నకళ్లు ఉన్న దుస్తులు మార్కెట్లోకి వెల్లువెత్తుతున్నాయి. సహజంగానే ఇవి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. సమస్య కొనడంతోకాదు.. ఎక్కువగా కొనడం, ఎక్కువ కాలం వాటిని వాడకపోవడం వల్ల వస్తోంది!
వస్త్ర వ్యర్థాలు
సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ (సీఎస్‌టీఈపీ) అధ్యయనం ప్రకారం.. దేశంలో పొడి మునిసిపల్ ఘన వ్యర్థాల్లో ప్లాస్టిక్, నిర్మాణ వ్యర్థాల తరవాత మూడో స్థానాన్ని ఆక్రమించింది టెక్స్‌టైల్ రంగమే. ఏటా దీని ద్వారా ఉత్పత్తవుతున్న వ్యర్థాలు సుమారు 7,800 కిలో టన్నులు.
⇒ ప్రపంచ కర్బన ఉద్గారాల్లో ఫ్యాషన్ ఉత్పత్తుల వాటా దాదాపు 10 శాతం. యూరోపియన్ యూనియన్ మొత్తం ఉద్గారాల కంటే ఇది ఎక్కువ.
⇒ మనదేశంలో సగటున ఒక వ్యక్తి వల్ల ఏటా 5 కిలోల వస్త్ర వ్యర్థాలు ఉత్పన్నమవుతున్నాయి.
కాటన్ టీషర్టు.. జీన్స్ ప్యాంటు
ఒక కాటన్ టీ షర్ట్ మన ఒంటిమీదకు రావాలంటే.. సుమారు 2,700 లీటర్ల నీరు ఖర్చవుతుంది. అంటే సగటు మనిషి సుమారు 90 సార్లు స్నానం చేయొచ్చన్నమాట. ఒక జీన్స్ ప్యాంట్ తయారీకి 7,600 లీటర్ల నీళ్లు కావాలి.
4.5 కోట్ల మంది
దేశంలో టెక్స్‌టైల్ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నవారు సుమారు 4.5 కోట్లమంది. పరోక్షంగా మరో 10 కోట్లకు పైగా ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. జీడీపీలో ఈ రంగ వాటా 2.3 శాతం.
వినిమయం తర్వాతే ఎక్కువ
ఫ్యాషన్ రంగంలో వినూత్న ఆవిష్కరణలు ప్రోత్సహించేందుకు పనిచేసే ‘ఫ్యాషన్ ఫర్ గుడ్’ 2022 నివేదిక ప్రకారం.. టెక్స్‌టైల్ వ్యర్థాలు 3 రకాలు.
⇒ తయారీ సమయంలో వచ్చేది 42%
⇒ వినిమయం తరవాత వచ్చేది 51%
⇒ దిగుమతులు7%
రీసైక్లింగ్ తక్కువే
ప్రస్తుతం మనదేశంలోని టెక్స్‌టైల్ వ్యర్థాల్లో 59 శాతం పునర్వినియోగం, రీసైక్లింగ్ వంటి ప్రక్రియల ద్వారా మళ్లీ పరిశ్రమకు చేరుతున్నాయి. ఇందులో 34 శాతాన్ని మరమ్మతులు చేసి, కొత్త ఉత్పత్తులుగా మారుస్తున్నారు. కేవలం 25 శాతమే దారాలుగా రీసైకిల్ అవుతోంది. మిగతా 41 శాతంలో.. 5 శాతాన్ని ఇటుక బట్టీలు, బాయిలర్లలో కాల్చేందుకు వినియోగిస్తున్నారు. 17 శాతం వ్యర్థాల్లో చేరుతోంది. 19 శాతం.. తక్కువ విలువ, నాణ్యత గల వస్తువులుగా రూపాంతరం చెందుతోంది.
‘మ్యాన్ మేడ్’ ప్రమాదకరం
టెక్స్‌టైల్ ఫైబర్లు రెండు రకాలు. ఒకటి.. సిల్కు, కాటన్ వంటి సహజ ఫైబర్లు, రెండోది పాలిస్టర్, నైలాన్ వంటి మ్యాన్ మేడ్ ఫైబర్లు (ఎమ్‌ఎమ్‌ఎఫ్). ఇంటర్నేషనల్ కాటన్ అడ్వైజరీ కమిటీ (ఐసీఏసీ) నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 100లో 72 పాళ్లు ఎమ్‌ఎమ్‌ఎఫ్‌లే. వీటి ఉత్పత్తిలో చైనా, భారత్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. మన్నిక; మరకలు, ముడతలు పడకుండా ఉండటం, తయారీ వేగంగా, తక్కువ ధరతో చేయడం వంటి కారణాల వల్ల సింథటిక్ ఫైబర్ల వాడకం పెరుగుతోంది. కానీ ఇవి పర్యావరణానికి మంచివి కావు. మైక్రోప్లాస్టిక్స్‌ను విడుదల చేస్తాయి. దుస్తుల తయారీలో డైయింగ్ ప్రక్రియ, రంగురంగుల దుస్తుల నుంచి వచ్చే రసాయనాలు.. కాలుష్యానికి కారణమవుతాయి.
ఏం చేయొచ్చు
⇒ దుస్తులు కొనేటప్పుడు.. ముఖ్యంగా పండుగ సీజన్లో ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. ఎక్కువ కొనేసి తక్కువసార్లు వాడేసి పారేయకండి.
⇒ పాతవీ, చిరిగిపోయిన దుస్తులతో పాత సామాన్లు కొనొచ్చు. లేదంటే ఇంట్లోని పనివాళ్లకు లేదా చుట్టుపక్కల పేదలకు లేదా వాటిని సేకరించే ఎన్జీఓలకు ఇవ్వొచ్చు.
⇒ వాడేసిన, చిరిగిపోయిన జీన్స్ ప్యాంట్లు, టీషర్టులతో ఇంట్లోకి బొమ్మల్లాంటి రకరకాల అలంకరణ వస్తువులు తయారుచేయవచ్చు.
⇒ యూట్యూబ్, సోషల్ మీడియాలో ఇలాంటి విభిన్న డిజైన్లకు సంబంధించి బోలెడన్ని వీడియోలు ఉంటాయి. వాటిని చూసి సరికొత్త వస్తువులు రూపొందించవచ్చు.
⇒ చెప్పాలంటే.. ఇలా విభిన్నంగా వాడకాన్ని చెప్పేవి కూడా సరికొత్త వ్యాపార ఆలోచనలే. వీటితోనూ డబ్బు సంపాదించవచ్చు.