మన ఆస్ట్రోశాట్‌ గ్రేట్‌!

India Astrosat captures 600th mega explosion that rocked the universe - Sakshi

అంతర్జాతీయ ప్రశంసలు

అంతరిక్షంలో పేలుడును 600వ సారి గుర్తించింది!

అంతరిక్షంలో జరిగిన అతి శక్తిమంతమైన గామా కిరణ పేలుడు (గామా రే బరస్ట్‌–జీఆర్బీ)ను ఇస్రో ఆస్ట్రోశాట్‌ టెలిస్కోప్‌ తాజాగా మరోసారి గుర్తించింది. జీఆర్బీ 231122బి గా పిలుస్తున్న ఇది ఆస్ట్రోశాట్‌ గుర్తించిన 600వ పేలుడు కావడం విశేషం. ఇస్రో టెలిస్కోప్‌ సాధించిన ఈ ఘనతపై అంతర్జాతీయ అంతరిక్ష సమాజంలో సంభ్రమాశ్చర్యాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ జీఆర్బీలను అంతరిక్షంలో సంభవించే అత్యంత శక్తిమంతమైన పేలుళ్లుగా చెబుతారు. ఇవి తరచూ కృష్ణబిలాల ఆవిర్భావానికి దారి తీస్తుంటాయి. అతి తక్కువ వ్యవధిలోనే, అంటే కొన్ని మిల్లీ సెకన్ల నుంచి నిమిషాల్లోపే అపరిమితమైన శక్తిని వెదజల్లడం ఈ జీఆర్బీల ప్రత్యేకత. ఈ సందర్భంగా అంతరిక్షంలో పరుచుకునే వెలుతురు మిరుమిట్లు గొలిపే స్థాయిలో ఉంటుంది. ఈ పేలుళ్లను లోతుగా అధ్యయనం చేయగలిగితే విశ్వచాలనాన్ని నియంత్రించే మౌలిక భౌతిక నియమాలను మరింతగా అర్థం చేసుకునే ఆస్కారముంటుంది.

దుమ్ము రేపుతున్న ఆస్ట్రోశాట్‌
2015 సెపె్టంబర్లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన తొలి మల్టీ వేవ్‌ లెంగ్త్‌ అంతరిక్ష టెలిస్కోపే ఆస్ట్రోశాట్‌. నాటినుంచి భారత అంతరిక్ష పరిశోధనలకు మూలస్తంభంగా నిలిచింది. ఇది గరిష్టంగా ఐదేళ్ల పాటు పని చేస్తుందని అంచనా వేశారు. కానీ ఎనిమిదేళ్లు దాటినా ఇప్పటికీ అద్భుతంగా పని చేస్తూ ఇస్రో సామర్థ్యానికి తిరుగులేని ప్రతీకగా నిలిచింది.

అంతరిక్షంలో సంభవించే అరుదైన దృగ్విషయాలైన గామా పేలుళ్లను ఆస్ట్రోశాట్‌ ఇట్టే ఒడిసిపడుతూ పలు అంతర్జాతీయ పరిశోధనలకు ఆలంబనగా నిలిచింది. అదిప్పటిదాకా ఏకంగా 600 జీఆర్బీలను గుర్తించడం నిజంగా గొప్ప విషయమేనని నాసా సైంటిస్టులు అంటున్నారు. ఆస్ట్రోశాట్‌లోని కాడ్మియం జింక్‌ టెల్యురైడ్‌ ఇమేజర్‌ (సీజెడ్‌టీఐ)దే ఈ ఘనతలో ప్రధాన పాత్ర అని ఐఐటీ బాంబే పరిశోధకులు వివరించారు. హై ఎనర్జీ, వైడ్‌ ఫీల్డ్‌ ఇమేజింగ్‌ సీజెడ్‌టీఐ ప్రత్యేకత.

త్వరలో తెరపైకి  ‘దక్ష’...
ఆస్ట్రోశాట్‌ సాధిస్తున్న ఘనతలు నిజంగా సాటిలేనివని ఐఐటీ బాంబే ప్రొఫెసర్‌ వరుణ్‌ భలేరావ్‌ అన్నారు. ఈ స్ఫూర్తితో అంతరక్ష రంగంలో ఇస్రో కృషిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అత్యాధునిక జీఆర్బీ టెలిస్కోప్‌ దక్షను తయారు చేయనున్నట్టు వెల్లడించారు. పలు ప్రతిష్టాత్మక సంస్థలు సంయుక్తంగా ఈ మిషన్‌లో పాల్గొంటాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అన్ని జీఆర్బీ టెలిస్కోప్‌ల్లోకెల్లా దక్ష అత్యంత అధునాతనంగా ఉండనుందని వివరించారు. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top