బ్రిటన్‌కు ‘తగిన’ జవాబిస్తాం!

India asks UK to Revise COVID Quarantine Rules, Warns Retaliation - Sakshi

నూతన టీకా పాలసీపై భారత్‌ మండిపాటు 

తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌

న్యూఢిల్లీ: యూకే జారీ చేసిన నూతన రవాణా నిబంధనలపై భారత్‌ తీవ్రంగా ప్రతిస్పందించింది. కరోనా టీకా తీసుకున్నట్లు సర్టిఫికెట్‌ ఉన్నా సరే బ్రిటన్‌కు వచ్చే భారతీయులు క్వారంటైన్‌లో ఉండాలంటూ బ్రిటన్‌ కొత్త ప్రయాణ నిబంధనలు తెచ్చిన సంగతి తెలిసిందే! ఈ నిబంధనలు వివక్షపూరితమైనవంటూ కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి హర్ష వర్ధన్‌ శ్రింగ్లా మండిపడ్డారు. మరోవైపు విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఈ విషయాన్ని న్యూయార్క్‌ సందర్శనలో యూకే విదేశాంగ కార్యదర్శి ఎలిజబెత్‌ ట్రస్‌ దృష్టికి తెచ్చారు. కోవిషీల్డ్‌ టీకాను యూకే కంపెనీనే రూపొందించిందని, అదే టీకాను భారత్‌లో ఉత్పత్తి చేసి బ్రిటన్‌ ప్రభుత్వ అభ్యర్థన మేరకు 50లక్షల డోసులు పంపించామని శ్రింగ్లా గుర్తు చేశారు. అలాంటి టీకానే గుర్తించమనే నిబంధనలు నిజంగానే వివక్షాపూరితమని, యూకేకు ప్రయాణించే లక్షలాది ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తాయని ఆయన దుయ్యబట్టారు. అక్టోబర్‌ 4(యూకేలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చే తేదీ)లోపు ఈ సమస్యను పరిష్కరించకుంటే భారత్‌ నుంచి ప్రతిచర్య తప్పదని సంబంధిత వర్గాలు అభిప్రాయపడ్డాయి. సమస్యను గుర్తించామని, తగు చర్యలు తీసుకుంటామని యూకే అధికార వర్గాల నుంచి ప్రస్తుతానికి హామీ లభించినట్లు షి్రంగ్లా చెప్పారు. అయితే హామీలు నిజం కాకుంటే భారత్‌ తనకున్న హక్కుల పరిధిలో తగిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.   

ఏమిటీ నిబంధనలు? 
బ్రిటన్‌కు వచ్చే విదేశీ ప్రయాణికుల కోసం నూతన ప్రయాణ నిబంధనలను యూకే ప్రభుత్వం రెండు రోజుల క్రితం ప్రకటించింది. వీటి ప్రకారం అక్టోబర్‌4 నుంచి భారత్‌తో పాటు మరికొన్ని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు కోవిషీల్డ్‌ రెండు డోసుల టీకా తీసుకున్నా సరే, వారిని టీకా తీసుకోనివారిగానే పరిగణిస్తామని పేర్కొంది. సదరు జాబితాలోని దేశాల ప్రయాణికులు, యూకేకు చేరుకున్న తర్వాత పీసీఆర్‌ పరీక్షలు చేయించుకోవాలని, పది రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని తెలిపింది. నిజానికి యూకేకు చెందిన ఆస్ట్రాజెనెకా కోవిషీల్డ్‌ను రూపొందించింది. దీన్ని భారత్‌లోని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఉత్పత్తి చేస్తోంది. అలాంటి టీకానే గుర్తించమనే కొత్తనిబంధనలపై భారత్‌లోని అన్ని పక్షాలు మండిపడ్డాయి. బ్రిటన్‌ తీరుపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు జైరామ్‌ రమేశ్, శశిథరూర్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బ్రిటన్‌ నిబంధనలు జాతి వివక్ష చూపేలా ఉన్నాయన్నారు. వెంటనే భారత ప్రభుత్వం తగిన స్పందన చూపాలని కోరారు.

ట్రస్‌తో జైశంకర్‌ భేటీ 
పరిణామాలపై భారత్‌ తన స్పందనను బ్రిటన్‌కు తెలిపింది. మరోవైపు విదేశాంగ మంత్రి జైశంకర్‌ తన న్యూయార్క్‌ పర్యటనలో బ్రిటన్‌ కార్యదర్శి ట్రస్‌ను కలిశారు.  రెండు దేశాల పరస్పర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ సమస్యకు సత్వర పరిష్కారం చూపాలని కోరినట్లు జైశంకర్‌ తెలిపారు. కొత్త నిబంధనల ప్రకారం భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులను రెడ్‌లిస్టులో పెడతారు. అంటే భారత్‌లో వేస్తున్న టీకాలను బ్రిటన్‌ గుర్తించదని పేర్కొన్నట్లయింది. భారత్‌తో తలెత్తిన ఇబ్బందిని సత్వరం పరిష్కరించే యత్నాల్లో ఉన్నామని ఇండియాలో బ్రిటిష్‌ హైకమిషన్‌ కార్యాలయం ప్రకటించింది. ట్రస్‌తో పాటు పర్యటనలో భాగంగా నార్వే, ఇరాక్‌ విదేశాంగ మంత్రులతో జైశంకర్‌ భేటీ అయ్యారు. ఆయా దేశాలతో వాణిజ్యపరమైన అంశాలను చర్చించారు. ఇండో పసిఫిక్, అఫ్గాన్‌ అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top