విస్తృత బంధాల్లో సరిహద్దు ఒక భాగం

India and China going through unprecedented situation - Sakshi

చైనాతో వివాదంపై భారత్‌ వ్యాఖ్య

న్యూఢిల్లీ:  భారత్, చైనాలు పరస్పరం మునుపెన్నడూ ఎరగని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని సరిహద్దు వివాదాన్ని ప్రస్తావిస్తూ విదేశాంగ మంత్రి జైశంకర్‌ వ్యాఖ్యానించారు. అయితే, ఇరుదేశాల మధ్య ఉన్న విస్తృత ద్వైపాక్షిక సంబంధాల్లో సరిహద్దు సమస్య ఒక భాగం మాత్రమేనని స్పష్టం చేశారు. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సదస్సులో గురువారం వర్చువల్‌గా ఆయన పాల్గొన్నారు.

అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో రెండు దేశాలు సర్దుబాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే వివాద పరిష్కారం సాధ్యమవుతుందన్నారు. ‘మునుపెన్నడూ లేని పరిస్థితిని రెండు దేశాలు ఎదుర్కొంటున్నాయన్నది వాస్తవం. అయితే, దీర్ఘకాలిక దృష్టితో చూస్తే.. ఇరు దేశాల మధ్య నెలకొన్న విస్తృత ద్వైపాక్షిక సంబంధాల్లో సరిహద్దు సమస్య ఒక భాగం మాత్రమేనని అర్థమవుతుంది’ అని జైశంకర్‌ వ్యాఖ్యానించారు. మరోవైపు, చైనాతో సరిహద్దు వివాదం ముగిసేందుకు ముందుగా, క్షేత్రస్థాయిలో శాంతి, సుస్థిరత నెలకొనాల్సిన అవసరం ఉందని భారత్‌ స్పష్టం చేసింది.

తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దుల్లో ఉన్న అన్ని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ ప్రక్రియ కొంత సంక్లిష్టమైందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ గురువారం పేర్కొన్నారు. ఇందుకు పరస్పర ఆమోదనీయ నిర్ణయాలు తీసుకోవడంతో పాటు, యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చే ప్రయత్నాలను విరమించుకోవాల్సి ఉందన్నారు. ఇరు దేశాల మధ్య ‘వర్కింగ్‌ మెకానిజం ఫర్‌ కన్సల్టేషన్‌ అండ్‌ కోఆర్డినేషన్‌’ కింద మరో విడత చర్చలు త్వరలో జరుగుతాయని తెలిపారు. తదుపరి రౌండ్‌ కమాండర్‌ స్థాయి చర్చల కన్నా ముందే అవి ఉంటాయన్నారు. ఇరుదేశాల కమాండర్‌ స్థాయి 6వ విడత చర్చలు సోమవారం జరిగిన విషయం తెలిసిందే. సరిహద్దుల్లోని పరస్పర సమీప ప్రాంతాల వద్దకు మరిన్ని బలగాలను పంపకూడదని, ఉద్రిక్తతలు పెరిగే చర్యలు చేపట్టవద్దని ఆ చర్చల్లో నిర్ణయించారు.

చైనా ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతోంది: తైవాన్‌
తైపీ: తమ దేశ ఎయిర్‌ డిఫెన్సు జోన్‌లోకి చైనా నిఘా విమానాలు అక్రమంగా ప్రవేశించడంతో తైవాన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా తమను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతోందని తైవాన్‌ డిప్యూటీ మినిస్టర్‌ చియ్‌ చుయ్‌ షెంగ్‌ వ్యాఖ్యానించారు. తమకు వ్యతిరేకంగా సైనిక శక్తిని ప్రయోగించాలని చూస్తే సహించబోమని హెచ్చరించారు. భావసారుప్యత ఉన్నదేశాలతో కలిసి పని చేస్తామని అన్నారు. ద్వీప దేశమైన తైవాన్‌కు స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. కానీ, తైవాన్‌ తమ దేశంలో అంతర్భాగమేనని చైనా వాదిస్తోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top