Aditya-L1: లగ్రాంజ్‌ పాయింట్‌లోకి ఆదిత్య | Sakshi
Sakshi News home page

Aditya-L1: లగ్రాంజ్‌ పాయింట్‌లోకి ఆదిత్య

Published Sun, Jan 7 2024 4:36 AM

India Aditya-L1 Solar Observatory Achieves Final Orbit for Five-Year Sun Study - Sakshi

సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): సూర్యునిపై సౌర జ్వాలలు, కరోనల్‌ మాస్‌ ఎజెక్షన్‌ తదితర విషయాలను అధ్యయనం చేసేందుకు ఇస్రో గత ఏడాది ప్రయోగించిన సోలార్‌ అబ్జర్వేటరీ వ్యోమనౌక ఆదిత్య ఎల్‌1 ఎట్టకేలకు తన తుది కక్ష్యలోకి చేరుకుంది. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు వ్యోమనౌక తన గమ్యస్థానాన్ని చేరుకోవడంతో ఇస్రో తన అంతరిక్ష ప్రయోగాల్లో మరో మైలురాయిని దాటింది.

భూమి నుంచి సూర్యునివైపుగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని కక్ష్య(ఎల్‌1 పాయింట్‌)లోకి శనివారం ఆదిత్య వ్యోమనౌక చేరుకుందని ప్రధాని మోదీ ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. గ్రహణాల వంటి సందర్భాల్లోనూ ఎలాంటి అడ్డూలేకుండా నిరంతరంగా సూర్యుడిని చూసేలా అనువైన ఎల్‌1 పాయింట్‌లో ఉంటూ ఆదిత్య ఎల్‌1 అధ్యయనం చేయనుంది.

చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్‌–3 సాఫ్ట్‌ల్యాండింగ్‌ విజయవంతమైన కొద్దినెలలకే సూర్యుడి సంబంధ ప్రయోగంలోనూ భారత్‌ ఘన విజయం సాధించడం విశేషం. భూమికి సూర్యునికి మధ్య దూరం 15 కోట్ల కిలోమీటర్లుకాగా అందులో ఒక శాతం అంటే 15 లక్షల కిలోమీటర్ల దూరాన్ని లగ్రాంజ్‌ పాయింట్‌(ఎల్‌1)గా గణిస్తున్నారు. ఈ పాయింట్‌ ఉన్న హాలో కక్ష్యలో వ్యోమనౌక ఉంటే సూర్యగ్రహణం వంటి సందర్భాల్లోనూ నిరంతరంగా శూన్యంలో అంతరిక్ష వాతావరణంలో సూర్య సంబంధ శోధన చేసే సువర్ణావకాశం చిక్కుతుంది.

మూన్‌వాక్‌ నుంచి సన్‌డ్యాన్స్‌ దాకా..
‘‘ భారత్‌ మరో మైలురాయిని చేరుకుంది. భారత తొలి సోలార్‌ అబ్జర్వేటరీ తన కక్ష్యను చేరుకుంది. సంక్లిష్టమైన అంతరిక్ష ప్రయోగాలను సఫలం చేస్తూ మన శాస్త్రవేత్తలు అంకితభావానికి ఈ సంఘటనే చక్కని తార్కాణం. వీరి అసాధారణ ప్రతిభకు దేశం గరి్వస్తోంది. మానవాళి సంక్షేమం కోసం నూతన శాస్త్రీయ పరిశోధనలు ఇకమీదటా ఇలాగే కొనసాగాలి’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ట్వీట్‌ చేశారు. ‘‘ఇస్రో మరో ఘనత సాధించింది. ఈ మిషన్‌తో యావత్‌ మానవాళికి ఎంతో మేలు చేకూరుతుంది.

ఈ మిషన్‌తో సూర్యుడు–భూమి మధ్య మనకున్న జ్ఞానాన్ని మరింత పెంచుతుంది. గొప్ప విజయం సాధించిన భారత శాస్త్రవేత్తలకు నా అభినందనలు’’ అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇస్రో శాస్త్రవేత్తలను ప్రశంసించారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌ సైతం ఆనందం వ్యక్తంచేశారు. ‘‘మూన్‌ వాక్‌ నుంచి సన్‌ డ్యాన్స్‌ వరకు..!. భారత్‌కు ఎంతటి ఉజ్వల సంవత్సరమిది’’ అని ట్వీట్‌చేశారు. ‘‘ అంతరిక్షంలోనూ భారత జైత్రయాత్ర కొనసాగుతోంది’ అని హోం మంత్రి అమిత్‌ షా ట్వీట్‌చేశారు.

► గత ఏడాది సెపె్టంబర్‌ రెండో తేదీన ఆదిత్యను మోస్తూ పీఎస్‌ఎల్‌వీ–సీ57 రాకెట్‌ శ్రీహరికోట ప్రయోగ కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లింది.
► దాదాపు 63 నిమిషాల తర్వాత 235 ్ఠ19,500 కిలోమీటర్ల కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. తర్వాత దాని కక్ష్యలను ఇస్రో పలుమార్లు మార్చుతూ చివరకు శనివారం తుదికక్ష్యలోకి చేర్చింది.
► దీని బరువు దాదాపు 1500 కేజీలు. విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కొరోనాగ్రాఫ్, సోలార్‌ అల్ట్రావాయిలెట్‌ ఇమేజింగ్‌ టెలిస్కోప్, ఆదిత్య సోలార్‌ విండ్‌ పారి్టకల్‌ ఎక్స్‌పరిమెంట్, ప్లాస్మా అనలైజర్‌ ప్యాకేజ్‌ ఫర్‌ ఆదిత్య, సోలార్‌ లో ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, హైఎనర్జీ ఎల్‌–1 ఆర్బిటింగ్‌ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, మ్యాగ్నెటోమీటర్‌ అనే పేలోడ్‌లను ఈ ఉపగ్రహంలో అమర్చారు.  

Advertisement
 
Advertisement