దాడుల్లో దొరికింది 290 కోట్లు | Sakshi
Sakshi News home page

దాడుల్లో దొరికింది 290 కోట్లు

Published Sun, Dec 10 2023 5:33 AM

Income Tax department raid on Odisha distillery has turned up Rs 290 Cr - Sakshi

న్యూఢిల్లీ/భువనేశ్వర్‌: ఒడిశా కేంద్రంగా పనిచేస్తున్న డిస్టిలరీ గ్రూప్, అనుబంధ సంస్థల్లో ఆదాయ పన్ను(ఐటీ) అధికారు లు చేపట్టిన సోదాల్లో భారీ మొత్తంలో నల్లధనం వెలుగులోకి వస్తోంది. మొత్తంగా రూ. 290 కోట్ల వరకు ఇక్కడ ఉండొచ్చని చెబుతున్నారు. ఇప్పటి వరకు లెక్కించిన రూ. 250 కోట్లను అధికారులు వాహనాల ద్వారా తరలించి ఒడిశాలోని ఎస్‌బీఐ శాఖల్లో జమ చేశారు. ఒకే కేసులో ఒకే దర్యాప్తు సంస్థకు ఇంత భారీ మొత్తంలో లెక్కల్లో చూపని నగదు పట్టుబ డటం ఇదే మొదటిసారని అధికార వర్గాలు తెలిపాయి.

మొరాయిస్తున్న కౌంటింగ్‌ మెషిన్లు
‘ఈనెల 6వ తేదీ నుంచి మొదలైన సోదాల్లో బౌధ్‌ డిస్టిలరీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తదితర సంస్థల్లో దొరికిన డబ్బుల కట్టలను లెక్కించడం కష్టసాధ్యమైన విషయంగా మారింది. విరామం లేకుండా లెక్కింపు కొనసాగించడంతో కౌంటింగ్‌ మిషన్లు మొరాయిస్తున్నాయి. దీంతో, ఇతర బ్యాంకుల నుంచి 40 వరకు చిన్నా పెద్దా కౌంటింగ్‌ యంత్రాలను తీసుకువచ్చాం. నగదంతా దాదాపుగా రూ. 500 నోట్ల రూపంలోనే ఉంది.

ఇప్పటి వరకు రూ. 250 కోట్లను లెక్కించి బ్యాంకుల తరలించాం. శనివారం సాయంత్రానికి లెక్క పెట్టడం పూర్తవుతుంది. మొత్తం రూ. 290 కోట్ల వరకు ఉండొచ్చని అనుకుంటున్నాం. అదేవిధంగా, ఈ డబ్బును సంభాల్‌పూర్, బొలంగీర్‌ ఎస్‌బీఐ ప్రధాన శాఖలకు తరలించేందుకు మరిన్ని వాహనాలను కూడా తీసుకువచ్చాం. నగదును సర్దేందుకు 200 బ్యాగులను వినియోగించాం’ అని అధికారులు వివరించారు.

స్పందించని కాంగ్రెస్‌ ఎంపీ
ఇప్పటి వరకు సోదాలు జరిపిన ప్రాంతాల్లో జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్‌ రాజ్యసభ ఎంపీ ధీరజ్‌ ప్రసాద్‌ సాహుకు చెందింది కూడా ఉందని ఐటీ వర్గాలు తెలిపాయి. ‘మద్యం పంపిణీదారులు, విక్రేతలు, వ్యాపారుల ద్వారా భారీ మొత్తంలో నమోదు కాని విక్రయాలు, నగదు బట్వాడా జరుగుతున్నాయన్న ఐటీ నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ సోదాలు చేపట్టాం’అని ఐటీ వర్గాలు వివరించాయి.

సోదాల్లో పాల్గొన్న 150 మంది అధికారులతోపాటు ఆయా ప్రాంతాల్లో లభ్యమైన డిజిటల్‌ డాక్యుమెంట్ల పరిశీలనకు హైదరాబాద్‌ నుంచి మరో 20 మంది అధికారులు కూడా వచ్చారన్నారు. దాడులు జరిగిన కంపెనీల అధికారుల వాంగ్మూలాలను సేకరిస్తున్నామన్నారు. ఐటీ దాడుల్లో భారీ మొత్తంలో నగదు వెలుగులోకి రావడంపై ఎంపీ సాహు స్పందన కోసం తమ ప్రతినిధి చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు పీటీఐ తెలిపింది.

10 అల్మారాల నిండా డబ్బుల కట్టలు
‘బొలంగీర్‌ జిల్లాలోని ఓ కంపెనీ ఆవరణలోని సుమారు 10 అల్మారాల్లో రూ. 230 కోట్ల నగదు దొరికింది. మిగతాది తిత్లాగఢ్, సంబల్‌పూర్, రాంచీల్లో లభ్యమైంది. శనివారం బొలంగీర జిల్లా సుదపారకు చెందిన దేశవాళీ మద్యం తయారీదారుకు చెందిన ఇంట్లో మరో 20 బ్యాగుల నిండా ఉన్న డబ్బు లభ్యమైంది. ఇందులో రూ. 50 కోట్ల వరకు ఉంటుందని అనుకుంటున్నాం.

దీన్ని లెక్కించాల్సి ఉంది. అదేవిధంగా, శుక్రవారం వెలుగు చూసిన 156 బ్యాగుల్లోని డబ్బును బొలంగీర్‌ ఎస్‌బీఐ ప్రధాన బ్రాంచికి తరలించి, లెక్కిస్తున్నాం’అని వివరించారు. ఐటీ డీజీ సంజయ్‌ బహదూర్‌ మూడు రోజులుగా భువనేశ్వర్‌లో మకాం వేసి, పర్యవేక్షిస్తున్నారు. దాడులకు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు.

కాంగ్రెస్‌ అవినీతి సంప్రదాయాన్ని పెంచి పోషిస్తోంది: బీజేపీ
ఐటీ దాడుల్లో నమ్మశక్యం కాలేని రీతిలో నగదు బయటపడటంపై బీజేపీ స్పందించింది. కాంగ్రెస్‌ అవినీతి సంప్రదాయాన్ని తరాలుగా ఎలా సజీవంగా ఉంచిందో దీన్ని బట్టి తెలుస్తోందని వ్యాఖ్యానించింది. శనివారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ నేత, కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి మీడియాతో మాట్లాడారు. ‘కేవలం ఒక్క కాంగ్రెస్‌ నేత వద్ద రూ.300 కోట్ల నగదు దొరికింది.

కాంగ్రెస్‌ నేతలందరి దగ్గరా కలిపితే ఎంత డబ్బు దొరుకుతుందో దీన్నిబట్టి ఊహించుకోవచ్చు’అని ఆమె అన్నారు. వ్యవస్థలో లోపాలను ఆసరాగా చేసుకుని, ఎంతగా అవినీతికి పాల్పడొచ్చో కాంగ్రెస్‌ నేతలు నిరంతరం అన్వేషిస్తుంటారని పేర్కొన్నారు. రాజ్యసభకు కాంగ్రెస్‌ తరఫున మూడుసార్లు ఎంపీ అయిన సాహ కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీకి అత్యంత సన్నిహితుడని ఆరోపించారు. కాంగ్రెస్‌ నేతలు ఆ పార్టీకి ఏటీఎంలుగా మాదిరిగా పనిచేస్తున్నారని విమర్శించారు. రూ.300 కోట్లకుపైగా అవినీతికి పాల్పడిన మద్యం వ్యాపారి ధీరజ్‌ సాహు ఏటీఎం ఎవరిదని ఆమె ప్రశ్నించారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement