Captain Varun Singh: ఆయనొక్కరే బయటపడ్డారు.. విషమంగానే కెప్టెన్‌ పరిస్థితి!

IAF Chopper Crash: Group Captain Varun Singh Sole Survivor At Tamil Nadu - Sakshi

తమిళనాడు కూనూర్‌ సమీపంలో బుధవారం జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో భారత తొలి సీడీఎస్‌(చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌) జనరల్‌ బిపిన్‌ రావత్, ఆయన సతీమణి మధులిక, మరో 11 మంది దుర్మరణం చెందారు. అయితే రావత్‌ను బలికొన్న హెలికాప్టర్‌ ప్రమాదంలో ఒకేఒక్కడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్‌ సర్వీసెస్‌ స్టాఫ్‌ కాలేజ్‌లో డైరెక్టింగ్‌ స్టాఫ్‌గా పనిచేస్తున్న గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌సింగ్‌ తీవ్రగాయాలతో హెలికాప్టర్‌ దుర్ఘటన నుంచి బతికిబయటపడ్డారు. 

చదవండి: CDS Bipin Rawat: బిపిన్‌ రావత్‌.. మాటలు కూడా తూటాలే 

ప్రస్తుతం ఆయన వెల్లింగ్టన్‌లోని మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 48 గంటలు గడిస్తేనే గానీ ఆయన పరిస్థితిపై అంచనాకి రాలేమని వైద్యులు వెల్లడించారు. గతేడాది ఒక విమాన ప్రమాదం నుంచి ఆయన తృటిలో బయటపడడమే కాకుండా, తన సాహసానికి ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాల్లో ఆయన శౌర్య చక్ర అవార్డు అందుకున్నారు. 2020 ఏరియల్‌ ఎమర్జెన్సీ సందర్భంగా తాను నడిపే ఎల్‌సీఏ తేజాస్‌ ఫైటర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ను కాపాడినందుకు ఆయనకు శౌర్యచక్ర అవార్డునిచ్చారు. 

చదవండి: సాయి తేజ చివరి మాటలు: ‘‘పాప దర్శిని ఏం చేస్తోంది.. బాబు స్కూల్‌కు వెళ్లాడా’’

2020లో ఎల్‌సీఏ(లైట్‌ కంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌) స్క్వాడ్రన్‌లో ఆయన వింగ్‌కమాండర్‌గా ఉన్నారు. 2020 అక్టోబర్‌ 12న  విమానంలోని కొన్ని వ్యవస్థల్లో చేసిన మార్పులను పరీక్షించేందుకు ఎల్‌సీఏలోని ఒక విమానాన్ని చెకింగ్‌కు తీసుకుపోయారు. ఆ సమయంలో కాక్‌పిట్‌ పీడన వ్యవస్థ ఫెయిలయింది. దీన్ని ఆయన సరిగా గుర్తించి జాగ్రత్తతో విమానాన్ని ల్యాండ్‌ చేశారు. ప్యారాచూట్‌తో ఆయన బయటపడే అవకాశం ఉన్నా, విమానాన్ని సురక్షితంగా ల్యాండ్‌ చేయడానికి యత్నించి సఫలమయ్యారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top