సాయి తేజ చివరి మాటలు: ‘‘పాప దర్శిని ఏం చేస్తోంది.. బాబు స్కూల్‌కు వెళ్లాడా’’

Telugu Jawan Sai Teja Who Deceased Helicopter Crash Last Words With Wife - Sakshi

ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందిన లాన్స్‌నాయక్‌ సాయితేజ

 విధులకు వెళ్లేముందు భార్య శ్యామలతో సాయితేజ  

వీడియో కాల్‌లో కుమార్తెను ముద్దాడి భార్యకు వీడ్కోలు

ఎగువరేగడ గ్రామంలో విషాద ఛాయలు

Lance Naik Saiteja: ‘పాప దర్శిని ఏం చేస్తోంది.. మోక్షజ్ఞ స్కూల్‌కు వెళ్లాడా.. చిట్టితల్లిని చూడాలని ఉంది. వీడియో కాల్‌ చేస్తా’ అంటూ భార్య శ్యామలతో లాన్స్‌నాయక్‌ బి.సాయితేజ బుధవారం ఉదయం 8.45 గంటలకు మాట్లాడారు. భార్య, పాపను వీడియోకాల్‌లో చూస్తూ తాను చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌తో కలిసి తమిళనాడు వెళుతున్నానని.. వీలు కుదిరితే సాయంత్రం చేస్తానని టాటా చెప్పిన సాయితేజ.. ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

ఊహించని ఈ ఘటనతో సాయితేజ స్వస్థలం చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువరేగడ గ్రామం షాక్‌కు గురైంది. ప్రమాద విషయం తెలుసుకున్న సాయితేజ బంధువులు, స్నేహితులు, సన్నిహితులు మదనపల్లెలో భార్య శ్యామల నివాసం ఉంటున్న ఇంటికి, ఎగువరేగడ గ్రామంలో తల్లిదండ్రుల ఇంటికి చేరుకున్నారు. హెలికాప్టర్‌ ప్రమాదంలో సాయితేజ చనిపోయాడని తమకు అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదని, ఎలాంటి దుర్వార్త ఏ సమయంలో వినాల్సి వస్తోందని బాధాతప్త హృదయాలతో ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. సాయితేజ మరణ వార్త తెలిసి తల్లిదండ్రులు సొమ్మసిల్లి పడిపోయారు. తల్లి భువనేశ్వరిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు.

సిపాయిగా ఎంపికై.. లాన్స్‌నాయక్‌ స్థాయికి..
28 ఏళ్ల సాయితేజ 2013లో బెంగళూరు రెజిమెంట్‌కు ఆర్మీ సిపాయిగా ఎంపికయ్యారు. అక్కడ శిక్షణ పొందుతూ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన పరీక్షలు రాసి ఏడాది తర్వాత ప్యారా కమాండోగా ఎంపికై 11వ పారాలో లాన్స్‌నాయక్‌గా నియమితులయ్యారు. విధి నిర్వహణలో భాగంగా  కశ్మీర్, బెంగళూరు హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేశారు. ప్రస్తుతం ఢిల్లీలోబిపిన్‌ రావత్‌ వద్ద పర్సనల్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. తల్లి భువనేశ్వరి మాజీ ఎంపీటీసీ, తండ్రి మోహన్‌ సాధారణ రైతు. తమ్ముడు మహేష్‌ఆర్మీలో సిపాయిగా సిక్కింలో పని చేస్తున్నారు.

సాయితేజకు 2016లో శ్యామలతో వివాహం జరిగింది. వీరికి కుమారుడు మోక్షజ్ఞ (5), పాప దర్శిని (2) సంతానం. కుమారుడు మోక్షజ్ఞ చదువు కోసం సాయితేజ భార్య శ్యామల మదనపల్లె ఎస్‌బీఐ కాలనీ రోడ్‌ నెం.3లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. సాయితేజ చివరిగా సెప్టెంబర్‌లో వినాయక చవితికి స్వస్థలానికి వచ్చి వెళ్లారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top