జమ్మూ కశ్మీర్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సుప్రీం కోర్టు

How Long Can Mehbooba Mufti Be Detained Supreme Court Asks Officials - Sakshi

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని ఇంకా ఎంత కాలం గృహ నిర్బంధంలో ఉంచుతారని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఏ ఆదేశం ప్రకారం, ఏ ఉద్దేశంతో ఆమెను నిర్బంధంలో ఉంచుతున్నారని కోర్టు జమ్ముకశ్మీర్ పాలనా యంత్రాంగాన్ని నిలదీసింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ఆధ్వర్యంలోని ధర్మాసనం మంగళవారం ఈ పిటిషన్‌పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపింది. మెహబూబా ముఫ్తీని ఇంకా ఎంత కాలం గృహ నిర్బంధంలో ఉంచుతారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నించింది. ఇందుకు కొంత సమయం ఇవ్వాలని.. ఒక వారంలోపు దీనిపై వివరణ ఇస్తామని ఆయన కోర్టుకు తెలిపారు. దాంతో రెండు వారాలు గడువు ఇచ్చింది. మెహబూబా ముఫ్తీ కుమార్తె, కుమారుడు ఆమెను కలిసేందుకు అధికారులు అనుమతి ఇవ్వాలని తెలిపింది. తదుపరి విచారణను కోర్టు అక్టోబర్ 15కు వాయిదా వేసింది.
 
మెహబూబా ముఫ్తీ విడుదల కోసం ఆమె కుమార్తె ఇల్టిజా ముఫ్తీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తన తల్లిని నిర్బంధించడం అక్రమమని ఆరోపించారు. దీనిపై తాను గతంలో దాఖలు చేసిన పిటిషన్‌కు జమ్ముకశ్మీర్ అధికారులు కోర్టుకు ఇంత వరకు సమాధానం ఇవ్వలేదని.. ఇది కోర్టు పట్ల వారికున్న గౌరవాన్ని తెలియజేస్తుంది అంటూ ఎద్దేవా చేశారు. అధికారులు తన తల్లిని కలిసేందుకు అనుమతించడంలేదని ఫిర్యాదు చేశారు. ముఫ్తీని కోర్టులో ప్రవేశపెట్టేందుకు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు కోసం కోర్టు అనుమతి కోరారు. (చదవండి: ఆ తీర్పుపై స్పష్టత అవసరం: సుప్రీంకోర్టు)

జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు 5న రద్దు చేయడంతోపాటు ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ సందర్భంగా ఎలాంటి అల్లర్లు జరుగకుండా మాజీ సీఎంలు ఫరూక్ అబ్దుల్లా, ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీతోపాటు రాజకీయ పార్టీల నేతలను గృహ నిర్బంధంలో ఉంచింది. ప్రజా రక్షణ చట్టం కింద ఫరూక్ అబ్దుల్లాను సుమారు ఏడాది వరకు గృహ నిర్బంధంలో ఉంచి రెండు నెలల కిందట విడుదల చేసింది. ఆయనకు ముందు ఒమర్ అబ్దుల్లా కూడా విడుదల అయ్యారు. అయితే ప్రజా రక్షణ చట్టం కింద మెహబూబా నిర్బంధాన్ని మరో ఆరు నెలలు పొడిగించారు. దీంతో తన తల్లిని ఏడాదికిపైగా గృహ నిర్బంధంలో ఉంచడంపై ఆమె కుమార్తె ఇల్టిజా ముఫ్తీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top