
సూరత్: కరోనా బిల్లు చూసి గుండె గుభేలుమన్న సూరత్‌కు చెందిన ఒక వ్యాపారి కీలక నిర్ణయం తీసుకున్నారు. పేదలకు ఉచిత చికిత్స అందించేందుకు తన కార్యాలయాన్ని 85 పడకల ఆసుపత్రిగా మార్చారు. కరోనా వైరస్ నుండి కోలుకున్న వ్యాపారవేత్త తనలాగా పేదలు కష్టపడకూడదని భావించి పెద్ద మనసు చేసుకోవడం ప్రశంసనీయంగా నిలిచింది.
సూరత్‌కు చెందిన, ప్రాపర్టీ డెవలపర్ కదర్ షేక్ ఇటీవల కరోనా బారినపడ్డారు. ఒక ప్రైవేట్ క్లినిక్‌లో 20 రోజులు చికిత్స అనంతరం కోలుకున్నారు. ఈ సందర్భంగా లక్షల్లో ఉన్న ప్రయివేటు ఆసుపత్రి బిల్లు చూసి ఒక‍్కసారిగా ఆయన ఉలిక్కిపడ్డారు. వ్యాపారవేత్తనైన తన పరిస్థితే ఇలా ఉంటే..ఇక పేదవాళ్ల పరిస్థితి ఏంటనే ఆలోచనలో పడ్డారు. ఫలితంగా తన 30,000 చదరపు అడుగుల (2,800 చదరపు మీటర్లు) కార్యాలయ ప్రాంగణం కోవిడ్-19 ఆసుపత్రిగా మారిపోయింది. తన మనవరాలు ‘హిబా’ పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన అన్ని అనుమతులను షేక్ పొందారు.
ప్రైవేట్ ఆసుపత్రిలో ఖర్చులు చాలా భారంగా ఉన్నాయని, తానూ పేద కుంటుంబంలోంచే వచ్చాననీ, ఆర్థిక సమస్యలతో చాలా కష్టపడ్డానని షేక్ చెప్పారు. అందుకే పేదలకు తన వంతు సహాయంగా ఏదైనా చేయాలని భావించానన్నారు. కుల,మత భేదం లేకుండా అందరూ ఇక్కడ చికిత్స పొందవచ్చని వెల్లడించారు. సిబ్బంది, వైద్య పరికరాలు, ఔషధాలను ప్రభుత్వం సమకూరుస్తుండగా, మంచాలు, పరుపులతో పాటు విద్యుత్, ఇతర ఖర్చులను తాను భరించనున్నట్టు చెప్పారు. వంట, భోజనాల గది, వంటవారు, రోగుల రోజువారీ ఆహార అవసరాలు ఇలా అన్ని వసతులను సమకూర్చుతామన్నారు. తద్వారా కరోనా మహమ్మారి బారిన పడిన పేదలు ఇక్కడ ఉచితంగా చికిత్స పొందుతారంటూ సంతోషం వ్యక్తం చేశారు. కాగా భారతదేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య 15 లక్షలు దాటింది. దాదాపు 35,000 మంది మరణించారు.