Rahul Gandhi: హిందూయిజం, హిందూత్వ వేర్వేరు

Hinduism and Hindutva are different things says Rahul Gandhi - Sakshi

అన్య మతస్తుల్ని కొట్టమని హిందూ మతం చెప్పలేదు

కానీ, హిందూత్వ ఆ పని చేయాలంటోంది: రాహుల్‌ గాంధీ

వార్ధా/న్యూఢిల్లీ: హిందూయిజం, హిందూత్వ పదాల మధ్య చాలా వ్యత్యాసం ఉందని, అవి రెండూ వేర్వేరు అని కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌ గాంధీ చెప్పారు. ఒక ముస్లింని, సిక్కుని కొట్టమని హిందూమతం ఎక్కడా చెప్పలేదని, కానీ హిందూత్వ ఆ పని చెయ్యమంటోందని విమర్శించారు. హిందూమతాన్ని అనుసరిస్తూ ఉంటే హిందూత్వ అన్న కొత్త పదం ఎందుకు పుట్టుకొచ్చిందని ప్రశ్నించారు.

మహారాష్ట్రలో వార్ధాలోని సేవాగ్రమ్‌ ఆశ్రమంలో నాలుగు రోజుల పాటు జరగనున్న ఏఐసీసీ శిక్షణా తరగతుల్లో శుక్రవారం ఆన్‌లైన్‌ ద్వారా రాహుల్‌ గాంధీ మాట్లాడారు. ‘హిందూయిజానికి, హిందూత్వకి ఉన్న తేడాలేంటి? ఆ రెండూ ఒకటేనా? ఒక్కటే అయితే రెండింటికి ఒక్కటే పేరు ఉండాలి కదా! అందుకే అవి రెండూ వేర్వేరు. ఒక ముస్లింని, సిక్కుని కొట్టమని హిందూమతం ఎప్పుడూ చెప్పలేదు. నేను ఉపనిషత్తులు చదివాను. హిందూ మత గ్రంథాలు చదివాను. అందులో ఎక్కడా అలా లేదు.

కానీ వారిని కొట్టమని హిందూత్వ చెబుతోంది’’ అని రాహుల్‌ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీ సిద్ధాంతం, మన జాతి సిద్ధాంతం ఒకటేనని, అదొక విలువైన రత్నమన్నారు. అందులో ఎంతో శక్తి నిక్షిప్తమై ఉందని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ సిద్ధాంతం ఎల్ల ప్పుడూ సజీవంగా, మహత్తర చైతన్యంతో ఉంటుందని చెప్పుకొచ్చారు. కానీ బీజేపీ దానిని కనిపించకుండా చేస్తూ మీడియాని అడ్డం పెట్టుకొని హిందూత్వని విస్తరిస్తోందని ఆరోపించారు. దేశంలో ప్రస్తుతం ఉన్నవి కాంగ్రెస్‌ సిద్ధాంతం, ఆరెస్సెస్‌ సిద్ధాంతాలేనని, బీజేపీ పనిగట్టుకొని విద్వేషాలు నూరిపోస్తోందంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.  

హిందూ మతంపై ఎందుకంత ద్వేషం: బీజేపీ
హిందూత్వకు సంబంధించి రాహుల్‌ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురు దాడికి దిగింది. హిందూమతంపై కాంగ్రెస్‌ నేతలు ద్వేషాన్ని నూరి పోస్తున్నారని విమర్శించింది. రాహుల్‌ ఆదేశాల మేరకే సల్మాన్‌ ఖుర్షీద్, శశిథరూర్, చిదంబరం వంటి నేతలు హిందూ మతాన్ని లక్ష్యంగా తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని బీజేపీ ప్రతినిధి సంబిత్‌ పాత్రా ఆరోపించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top