
హిమాచల్, జమ్మూను ముంచెత్తిన మెరుపు వరదలు
కొట్టుకుపోయిన రోడ్లు, దుకాణాలు
కూలిన ఇళ్లు, చెట్లు
వైష్ణోదేవి ఆలయానికి వెళ్లేమార్గంలో కొండచరియలు పడి 9 మంది మృతి
సిమ్లా/జమ్మూ: మేఘ విస్ఫోటం(క్లౌడ్ బరస్ట్) ఘటనల నుంచి తేరుకోకమునుపే మళ్లీ మేఘ విస్ఫోటాలు ఉత్తరాది రాష్ట్రాలపై విరుచుకుపడ్డాయి. హిమాలయాలకు నిలయాలైన హిమాచల్, జమ్మూలు ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు, కొండచరియలు పడిన ఘటనలతో వణికిపోయాయి. హిమాచల్‌లో మెరుపు వరదల ధాటికి ఇళ్లు, దుకాణాలు నేలమట్టమయ్యాయి.
జమ్మూకశ్మీర్‌లోని రియాస్ జిల్లాలోని ప్రఖ్యాత మాతా వైష్ణోదేవి ఆలయ ట్రెక్కింగ్ మార్గంలో మంగళవారం మధ్యాహ్నం కొండచరియలు విరిగిపడడంతో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. 14 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఖత్రాలోని బేస్‌క్యాంప్‌లో చేర్పించి చికిత్సనందిస్తున్నారు. త్రికూట పర్వతంపై కొలువైన ఆలయానికి ఖత్రానుంచి 12 కిలోమీటర్ల మార్గముంది.
ఇందులో అర్థ్‌కువారీ సమీప ఇంద్రప్రస్థ భోజనాలయం సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో ఈ ఘోరం జరిగింది. ఆలయానికి రెండు మార్గాల్లో ట్రెక్కింగ్ చేస్తూ చేరుకోవచ్చు. మంగళవారం ఉదయం నుంచి హిమ్‌కోటీ ట్రెక్కింగ్ మార్గం గుండా యాత్రను నిలిపేశారు. పాత రూట్‌లో మధ్యాహ్నం 1.30దాకా ట్రెక్కింగ్ జరగ్గా కొండచరియలు పడటంతో అది కూడా నిలిపేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టేదాకా వైష్ణోదేవి ఆలయానికి భక్తుల యాత్రను అర్ధా్థంతరంగా ఆపేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఉధృతంగా ప్రవహిస్తున్న నదులు
గత మూడ్రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జమ్మూ ప్రాంతంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వైష్ణోదేవి ఆలయ ఘటనతో కలిసి జమ్మూవ్యాప్తంగా వర్షసంబంధ ఘటనల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. కశ్మీర్‌లో లోయలోనూ భారీ వర్షాల కారణంగా కొన్ని చోట్ల చిన్నపాటి వంతెనలు, మొబైళ్ల టవర్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి.
ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లు సైతం తెగిపోవడంతో టెలికం, ఇంటర్నెట్ సేవలు దాదాపు ఆగిపోవడంతో లక్షలాది మంది ప్రజలు అవస్థలు పడుతున్నారు. రైలుపట్టాలపై రాళ్లు పడటంతో ఖత్రా, ఉధంపూర్, జమ్మూ రైల్వేస్టేషన్ల నుంచి ఇతర ప్రాంతాలకు 18 రైళ్లను రద్దుచేశారు. కొండచరియలు పడటంతో జమ్మూ–శ్రీనగర్, కిష్ఠ్‌వార్–దోడా జాతీయరహదారులపై రాకపోకలను అధికారులు నిలిపేశారు.
ఇలా డజన్లకొద్దీ పర్వతసానువుల వెంట రహదారులు మూసేశారు. కిష్ఠివార్, రేసీ, రాజౌరీ, రాంబాన్, ఫూంఛ్ జిల్లాల్లోనూ వర్షబీభత్సం జరిగింది. ఇళ్లు నేలకూలాయి. కిష్‌్టవార్‌లోని ముఘల్ మైదాన్ వంతెన ధ్వంసమైంది. జమ్మూలో తక్షణం చేపట్టాల్సిన సహాయక చర్యలపై శ్రీనగర్‌లో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు తగు ఆదేశాలిచ్చారు.
మనాలీలో బియాస్ ఉగ్రరూపం
హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీలో బియాస్ నది ఉగ్రరూపం దాల్చి పరీవాహక ప్రాంతాలపై విరుచుకుపడింది. చాలా చోట్ల మనాలీ–లేహ్ రహదారి నదీప్రవాహం కారణంగా కొట్టుకుపోయింది. మనాలీలోని బహంగ్ ప్రాంతంలో బహుళ అంతస్తుల భవనం నీటి ఉధృతికి కూలి నదీప్రవాహంలో పడింది. రెండు రెస్టారెంట్లు, కొన్ని దుకాణాలు సైతం కొట్టుకుపోయాయి. 40 షాప్‌లు ధ్వంసమయ్యాయి. రహదారిపై నిలిచి ఉన్న వాహనాలు సైతం నదీప్రవాహంలో కొట్టుకుపోయాయి. సమీప ప్రాంతాల ప్రజలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి.
రాష్ట్రంలో పర్యటిస్తున్న యాత్రికులు పలు చోట్ల చిక్కుకుపోయారు. పత్లీకుహాల్ ప్రాంతంలో ఇళ్లు నీటమునిగాయి. కులూ ప్రాంతంలోనూ బియాస్ నది ఉధృతంగా ప్రవహించింది. కినౌర్ జిల్లాలోని కన్వీ గ్రామంలోనూ మేఘ విస్ఫోటం సంభవించింది. రాష్ట్రవ్యాప్తంగా భారీవర్షాల కారణంగా కొండచరియలు రహదారులపై పడటంతో రాకపోకలు స్తంభించాయి. దీంతో మంగళవారం ఒక్కరోజే మండీ జిల్లాలో 320, కులూ జిల్లాలో 132 రహదారులను మూసేశారు. కంగ్రా, చంబా, లహౌల్ స్పితి జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.