న్యూఢిల్లీ: దేశంలో వర్షాకాలం ముగిసి, తెల్లవారుజామున తేలికపాటి చలి మొదలవుతున్న తరుణంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వర్షాలపై హెచ్చరికలు జారీ చేసింది. దేశ రాజధాని ఢిల్లీతో సహా దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ సమయంలో గంటకు 60 కిలోమీటర్ల వరకు వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
వాతావరణంలో చోటుచేసుకున్న ఆకస్మిక మార్పులే ఈ అకాల వర్షాలకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. బంగాళాఖాతంలో దక్షిణ-తూర్పు ప్రాంతంతో పాటు పశ్చిమ భారతదేశం, పశ్చిమ బెంగాల్ మీదుగా ఉపరితల చక్రవాత ఆవర్తనాలు ఏర్పడటం వల్ల ఈ వర్షాలు కురుస్తున్నాయి. కొండ ప్రాంతాలైన హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని, కొన్ని ఎత్తైన ప్రాంతాల్లో మంచు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.
ఈ భారీ వర్షాల హెచ్చరికల జాబితాలో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, జమ్ముకశ్మీర్, తమిళనాడు, కేరళ, పంజాబ్, హర్యానా, అసోం, మేఘాలయ, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, నాగాలాండ్ ఉన్నాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్‌లలో గంటకు 30 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని సమాచారం.
ఇదీ చదవండి: మహిళపై బీరు.. బౌన్సర్ల రాక్షస దాడిలో యువకుడు మృతి!


