దళిత యువతి మృత్యు ఘోషకు భయపడే..

Hathras woman dignified funeral: the power of mourning - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఒళ్లంతా ఛిద్రమై పక్షం రోజులపాటు ఆస్పత్రిలో అవస్థపడి అశువులు బాసిన 19 ఏళ్ల కూతురును కడసారి నుదిటి మీద ముద్దు పెట్టుకొని కాటికి పంపుదామనుకున్న ఆ కన్న తల్లి కల నెరవేరలేదు. పొంగి పొర్లుకొచ్చే కన్నీటి బిందువులు కనిపించకుండా ముఖాన కొంగు కప్పుకొని ఆఖరి సారి ఆప్యాయంగా ఆ చెంప నిమిరి పంపించాలనుకున్న కుటుంబ సభ్యుల ఆఖరి కోరిక తీరలేదు. అంబులెన్స్‌లో ఇంటికొచ్చిన మృతదేహాన్ని ఆపండంటూ ఇంటి ముందే గుమిగూడిన జనం అడ్డం పడినా....పట్టించుకోకుండా నేరుగా శ్మశానానికి పంపించి అర్ధరాత్రి దాటాక దహన సంస్కారాలు దగ్గరుండి జరిపించిన పోలీసులకు ఎన్ని శాపనార్థాలు పెడితే ఏం లాభం...?

మృతదేహాన్ని ఇంటి వద్దనే ఉండనిస్తే మరుసటి రోజు పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగే ప్రమాదం ఉందని తెలిసే రాత్రికి రాత్రే దహన సంస్కారాలు జరిపించామని ఉత్తరప్రదేశ్‌లోని హథ్రాస్‌ పోలీసులు స్వయంగా కోర్టు ముందే ఒప్పుకున్నారు. వారి చెబుతున్నది అబద్ధమని, నలుగురు నిందితులను అత్యాచారం నుంచి తప్పించేందుకు ‘రేప్‌ జరగలేదు’  అంటూ ఫోరెన్సిక్‌ నివేదిక తీసుకున్న పోలీసులు, మరోసారి అటాప్సీ చేయడానికి ఆస్కారం లేకుండా దేహాన్ని దగ్ధం చేశారని ఇటు కాంగ్రెస్, అటు దళిత పార్టీలతోపాటు సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. (మేమిద్దరం ఫ్రెండ్స్‌.. వాళ్లే చంపేశారు..)
 
ఆలిగఢ్‌ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో సెప్టెంబర్‌ 22వ తేదీన సాక్షాత్తు మేజిస్ట్రేట్‌ నమోదు చేసిన దళిత యువతి మరణ వాంగ్మూలంలో నలుగురు యువకులు తనపై అత్యాచారం జరిపినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా తనపై దాడి జరిగిందని తప్ప రేప్‌ జరిగిందని ఆ దళిత యువతి ఆరోపించలేదంటూ బీజేపీ ఐటీ సెల్‌ హెడ్‌ అమిత్‌ మాల్వియా ట్వీట్‌ చేసిన వీడియో క్లిప్‌ ద్వారా కూడా వాస్తవం ఏమిటో తెలుస్తోంది. తనపై నలుగురు యువకులు ‘జబర్‌దస్థ్‌’ చేశారని ఆ వీడియోలో దళిత యువతి నాలుగు సార్లు ఆరోపించింది. దారుణంగా రేప్‌ చేశారని చెప్పడాని యూపీ హిందీ యాసలో ‘జబర్‌దస్థ్‌’ అని వాడడం అక్కడ సర్వసాధారణం. అత‍్యాచారం జరగలేదని ఢిల్లీ ఆస్పత్రి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ కూడా సర్టిఫికెట్‌ ఇవ్వలేదు. రేప్‌ జరిగిందని చెప్పడానికి ఆనవాళ్లు లేవని, లైంగికదాడి జరిగిన 15 రోజులకు వైద్య పరీక్షలు జరిపితే అలాంటి ఆనవాళ్లు దొరకవని వైద్య నిపుణులే తేల్చి చెప్పారు. (భయంతో బతకలేం.. ఊరొదిలి పోతాం!)

తెల్లారితే మృతదేహం వల్ల పెద్ద ఎత్తున అల్లర్లు, హింస చెలరేగే అవకాశం ఉందని తెలిసే రాత్రికి రాత్రే శవాన్ని దహనం చేశామంటూ పోలీసులు కోర్టు ముందు చెప్పడంలోనే నిజముందని అనిపిస్తోంది. ఇదే కారణంగా కశ్మీర్‌లో అనాదిగా మిలిటెంట్ల మృతదేహాలను, భద్రతా బలగాల ఎన్‌కౌంటర్లలో మరణించిన వారి భౌతికకాయాలను కుటుంబ సభ్యులకు అప్పగించకుండా పోలీసులే దహన సంస్కారాలు జరుపతూ వస్తున్నారు. ఇక టెర్రరిస్టుల విషయంలోనైతే దహనం తర్వాత మిగిలే బూడిదను కూడా ఎవరికి దొరక్కుండా చేస్తున్నారు. దళిత యువతి మరణ వార్త ఇప్పటికే ఢిల్లీ దాకా ప్రకంపనలు సృష్టించగా, మృతదేహం రూపంలో ఆమె వినిపించే మృత్యుఘోష ఎంత మందిని కదిలిస్తుందో, ఎంత హింసను సృష్టిస్తుందోనన్న పోలీసుల భయంలో నిజం లేదనలేం! (హథ్రాస్‌ కేసు : గ్రామ పెద్ద సంచలన ఆరోపణలు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top