దడ పుట్టిస్తున్న కొత్త వైరస్‌.. కోవిడ్‌-19, H3N2 ఇన్‌ఫ్లూయెంజా మధ్య తేడా ఎలా తెలుసుకోవాలి?

H3n2 Influenza Covid-19 Symptoms How To Identify Them - Sakshi

న్యూఢిల్లీ: జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో అనారోగ్యం బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇవి కోవిడ్‌ లక్షణాలు కావడంతో చాలా మంది ఆందోళన చెందుతున్నారు. అయితే వైద్య నిపుణులు మాత్రం ఇది కరోనా కాదు. హెచ్‌3ఎన్‌2 ఇన్‌ఫ్లూయెంజా ఫ్లూ అని చెబుతున్నారు. మరి రెండింటి లక్షణాలు ఒకేలా ఉన్నప్పుడు మీకు సోకింది కోవిడా? లేక ఇన్‌ఫ్లూయెంజానా? అని ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

హెచ్3ఎన్‌2 ఇన్‌ఫ్లూయెంజా ఒక వైరస్ ఉపరకం. దీని వల్ల ఫ్లూ బారినపడి ఆస్పత్రితో చేరాల్సిన అవసరం ఇతర స్ట్రెయిన్‌లతో పోల్చితే అధికంగా ఉంటుంది.  ఈ ఇన్‌ఫ్లూయెంజా సోకినవారిలో జ్వరం, జలుబు, తలనొప్పి, ఒళ్లునొప్పులు, సైనస్, గొంతునొప్పి, వాంతులు, విరేచనాలు, రుచి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. అయితే ఈ ఫ్లూ బారినపడినవారిలో దగ్గు మాత్రం త్వరగా పోదు. దగ్గు పూర్తిగా తగ్గాలంటే రెండు నుంచి మూడు వారాల వరకు  పడుతుంది.

అలాగే ఈ ఫ్లూ లక్షణాలు ఒకటి నుంచి నాలుగు రోజుల్లోనే తెలిసిపోతాయి. హెచ్‌3ఎన్‌2 బారినపడివారిలో లక్షణాలు కన్పించకపోతే ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాగే ఈ ఇన్‌ఫ్లూయెంజా బారినపడితే శ్వాసకోశ సంబంధిత సమస్యలు కూడా తక్కువగానే ఉంటాయి. ఆక్సిజన్ అందిచాల్సిన అవసరం కూడా చాలా తక్కువగా ఉంటుంది.

ఐసీఎంఆర్ వివరాల ప్రకారం హెచ్‌3ఎన్‌2 సోకి ఆస్పత్రిలో చేరినవారిలో 92 శాతం మందికి జ్వరం, 86 శాతం మందికి దగ్గు, 27 శాతం మందికి శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కన్పించాయి. చాలా అరుదుగా ఆక్సిజన్ అందించాల్సిన అవసరం వచ్చింది.

కోవిడ్‌-19 ఇలా..
మరోవైపు కోవిడ్‌-19 సోకివారిలో కూడా దాదాపు ఇవే లక్షణాలు ఉంటాయి. ఈ వైరస్ సోకిన వారిలో లక్షణాలు ఒక్కోసారి బయటపడవు. ఒకటి నుంచి 14 రోజుల వరకు ఇవి ఉండొచ్చు. అయితే లక్షణాలు కన్పించకపోయినా.. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతుంది. అలాగే కోవిడ్ సోకిన వారిలో శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఆక్సిజన్ అందించాల్సిన అవసరం కూడా ఎక్కువగానే ఉంటుంది.

అయితే మీకు సోకింది కోవిడా, ఫ్లూనా అని కచ్చితంగా నిర్ధరించుకోవాలంటే కరోనా టెస్టు తప్పకుండా చేయించుకోవాల్సిందేని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే హెచ్‌3ఎన్‌2 ఇన్‌ఫ్లూయెంజా బారిన వారికి చికిత్సలో  యాంటీబయాటిక్స్‌ ఉపయోగించవద్దని ఐసీఎంఆర్ సూచించింది. కరోనా, ఫ్లూ చికిత్సకు ఉపయోగించే మందులు పూర్తిగా వేరని కూడా స్పష్టం చేసింది.
చదవండి: అడెనోవైరస్‌ కలకలం.. పిల్లలకు మాస్కులు తప్పనిసరి చేసిన సర్కార్‌.. లక్షణాలివే..!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top