H3N2 Influenza: గుజరాత్‌లో తొలి హెచ్3ఎన్2‌ ఇన్‌ఫ్లూయెంజా మరణం.. దేశంలో 7కు చేరిన మృతుల సంఖ్య

Gujarat Reports H3N2 Influenza First Death India Death Toll Rises To 7 - Sakshi

గాంధీనగర్‌: భారత్‌లో ఇన్‌ఫ్లూయెంజా ఉపరకం H3N2 కేసులతోపాటు మరణాల సంఖ్య సైతం క్రమంగా పెరుగుతోంది. తాజాగా గుజరాత్‌లో హెచ్‌3ఎన్‌2 తొలి మరణం సంభవించింది. ఈ వైరస్‌కు గురైన 58 ఏళ్ల మహిళ వడోదరలోని ఎస్‌ఎస్‌జీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు గుజరాత్‌ అధికారులు మంగళవారం వెల్లడించారు.

దీంతో హెచ్‌3ఎన్‌2 కారణంగా ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 7కు పెరిగింది. ఈ వైరస్‌కు గురై తొలి మరణం కర్ణాటకలో చోటుచేసుకుంది. హాసన్‌ జిల్లాకు 82 ఏళ్ల వ్యక్తి ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయాడు.

కాగా జనవరి 2 నుంచి మార్చి 5 మధ్య భారతదేశంలో 451 హెచ్‌3ఎన్‌2 వైరస్ కేసులు నమోదైనట్లు శుక్రవారం కేంద్ర వైద్యాఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే దేశంలో వైరస్‌ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. అంతేగాక ఈ నెలఖరు నాటికి కేసులు తగ్గుముఖం పట్టనున్నట్లు అంచనా వేసింది.

మరోవైపు హెచ్3ఎన్2 వైరస్ కారణంగా ఇన్‌ఫ్లూయెంజా కేసులు పెరుగుతున్నందున దేశంలో మాస్క్‌ల వాడకం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, అలాగే ఏటా ఫ్లూ వ్యాక్సిన్లు తీసుకోవం వంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచించారు.

ప్రజలు సొంత మెడికేషన్ తీసుకోరాదని, ముఖ్యంగా యాంటీబయాటిక్స్ వాడవద్దని ఐసీఎంఆర్ ఇటీవల హెచ్చరించింది. హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా వైరస్ నాన్ హ్యూమన్ ఇన్‌ఫ్లుయెంజా అని యూఎస్‌ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఓ ప్రకటనలో పేర్కొంది.  దగ్గు, ముక్కు కారడం(జలుబు), వాంతులు, విరేచనాలు, ఒళ్లు నొప్పి వంటి సాధారణ లక్షణాలుగా పేర్కొంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top