‘నేను మగాడిని కాదని నా భార్యకు ముందే తెలుసు!.. నాటకాలాడుతోంది’

Gujarat Husband Denies Wife Woman Gender Allegations - Sakshi

షాకింగ్‌ ఘటనలో ఇప్పుడు మరో ట్విస్ట్‌ వెలుగు చూసింది. తన భర్త మగాడు కాదని, సర్జరీ చేయించుకున్న మహిళ అని, ఆ రహస్యం దాచి తనకు అన్యాయం చేశాడని,  న్యాయం చేయాలంటూ.. పెళ్లైన ఎనిమిదేళ్లకు ఓ భార్య పోలీసులను ఆశ్రయించిన ఉదంతం తెలిసే ఉంటుంది. అయితే ఈ వ్యవహారంలో భర్త మీడియా ముందుకు వచ్చాడు. 

తాను మగాడిని కాదనే విషయం తన భార్యకు ముందే తెలుసని అంటున్నారు డాక్టర్‌ విరాజ్‌వర్థన్‌. అంతేకాదు తాను లింగమార్పిడి సర్జరీలకు వెళ్తున్నాననే విషయం కూడా ఆమెకు తెలుసని.. భార్య చేసిన ఆరోపణలను ఖండించాడు. ఆమె, ఆమె బిడ్డ తనకు ఎంతో దగ్గరయ్యారని, అంతేకాదు ఆమె కూతురిని తాను దత్తత కూడా తీసుకున్నానని ఆయన మీడియాకు వెల్లడించారు. 

మ్యాట్రిమోనీ సైట్‌ ద్వారా మేం కలుసుకున్నాం. అయితే.. తన లోపాన్ని సాకుగా చూపించి ఇల్లు తనపేరిట రాయాలంటూ ఆమె ఆ టైంలో డిమాండ్‌ చేసింది. ఇవ్వడం కుదరనే సరికి ఎంగేజ్‌మెంట్‌ను రద్దు చేసుకుంది. కానీ, కొన్నాళ్లకు కూతురు వంకతో మళ్లీ వచ్చింది. పెద్దల సమక్షంలో ఎలాగోలా వివాహం జరిగింది. అంతా తెలిసి ఇప్పుడు తొమ్మిదేళ్ల తర్వాత ఆమె నేను విషయం దాచానంటూ మీడియా ముందుకు రావడం ఆశ్చర్యంగా ఉంది అని విరాజ్‌ అలియాస్‌ విజేత పేర్కొన్నారు. 

పెళ్లైనప్పటి నుంచి తాము ఎంతో అన్యోన్యంగా ఉన్నామని, అసహజ లైంగిక చర్యలో పాల్గొన్న ఆరోపణలను సైతం ఆయన ఖండించారు. అయితే.. గత ఏడాది కాలంగా మాత్రం వేర్వేరు గదుల్లో పడుకుంటున్నామని, ఆమె తన గదిలో సీసీకెమెరా ఇన్‌స్టాల్‌ చేసి రహస్యంగా ఫొటోలు తీయడం ప్రారంభించిందని, ఈ ఏప్రిల్‌ నెలలో తన సోదరుడితో వచ్చి ఆ ఫొటోలు చూపించి ఆస్తి తన పేరిట రాయాలని బ్లాక్‌మెయిల్‌ చేయడం ప్రారంభించిందని చెప్పారాయన. తాను పుట్టుకతో మహిళనే విషయం తెలిపిన విరాజ్‌.. పెళ్లికి ముందే ట్రాన్స్‌జెండర్‌ అయ్యానని, ప్రస్తుతం పురుషుడిగా మారేందుకు సర్జరీలు చేయించుకుంటున్నాననే విషయాన్ని అంగీకరించారు.

గుజరాత్‌ వడోదర సయాంజిగంజ్‌కు చెందిన సదరు మహిళకు గతంలో పెళ్లై.. ఓ కూతురు ఉంది. అయితే భర్త చనిపోయాక 2014లో మ్యాట్రిమోనియల్‌ సైట్‌ ద్వారా ఢిల్లీకి చెందిన డాక్టర్‌ విరాజ్‌తో వివాహం జరిగింది. అయితే తన భర్త మగవాడుకాదని.. ఆపరేషన్‌ ద్వారా మారిన స్త్రీ అంటూ గోత్రీ పోలీసులకు పిర్యాదు చేయడంతో ఈ కేసు సంచలనంగా మారింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top