పెళ్లికి రిజిస్ట్రేషన్ ఒక్కటే సరిపోదు | Gujarat High Court Sensational Verdict on Hindu Marriages | Sakshi
Sakshi News home page

పెళ్లికి రిజిస్ట్రేషన్ ఒక్కటే సరిపోదు

Jul 2 2026 5:53 AM | Updated on Jul 2 2026 5:53 AM

Gujarat High Court Sensational Verdict on Hindu Marriages

సంప్రదాయ ఆచారాలు పాటించపోతే చట్టబద్ధమైన వివాహంగా పరిగణించలేం  

మూడు ముళ్లు, సప్తపదిని పాటించడమే హిందూ వివాహానికి పునాది   

ఆచారాలు వివాహానికి పవిత్ర సంస్కారాన్ని, సామాజిక, చట్టపరమైన హోదాను కల్పిస్తాయి  

గుజరాత్‌ హైకోర్టు కీలక తీర్పు

అహ్మదాబాద్‌: హిందూ వివాహాల విషయంలో గుజరాత్‌ హైకోర్టు కీలకమైన తీర్పును ప్రకటించింది. పెళ్లికి రిజ్రస్టేషన్‌ ఒక్కటే సరిపోదని తేల్చిచెప్పింది. వివాహం అనేది కేవలం పాటలు, నృత్యాల వేడుక మాత్రమే కాదని పేర్కొంది. సప్తపది వంటి సంప్రదాయ ఆచారాలను పాటించకుండా ఒక జంట కేవలం రిజిస్ట్రేషన్తో ఒక్కటైతే అది చట్టబద్ధమైన వివాహంగా పరిగణించలేమని వెల్లడించింది.  ఈ మేరకు జూన్‌ 23న తీర్పునిస్తూ ఉత్తర్వు జారీ చేసింది. దేశంలో వేర్వేరు ప్రాంతాల్లో భౌగోళిక, సాంస్కృతికపరమైన వైవిధ్యాలు ఉన్నప్పటికీ.. పెళ్లి తంతులో సంప్రదాయ ఆచారాలు, పద్ధతులు ఒక వ్యక్తి ఆధ్యాత్మిక స్వభావాన్ని శుద్ధి చేసి, పరివర్తన చెందేలా చేస్తాయని వెల్లడించింది.

తమ వివాహాన్ని చెల్లనిదిగా ప్రకటించడానికి నిరాకరించిన ఫ్యామిలీ కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే)కు చెందిన కౌశల్‌ సోనార్‌ అనే వ్యక్తి గుజరాత్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. దీనిపై జస్టిస్‌ ఐలేష్‌ వోరా, జస్టిస్‌ ఆర్‌.టి.వచానీతో కూడిన డివిజన్‌ బెంచ్‌ విచారణ చేపట్టింది. గత ఏడాది నవంబర్‌లో ఫ్యామిలీ కోర్టు జారీ చేసిన ఉత్తర్వును కొట్టివేసింది. మూడు ముళ్లు, ఏడు అడుగులు వంటి ఆచారాలను పాటించడమే హిందూ వివాహానికి పునాది అని తేల్చిచెప్పింది. పవిత్రమైన అగ్నిసాక్షిగా వధూవరులు కలిసి ఏడు అడుగులు వేసే సప్తపది వంటి ఆచారాలు వివాహానికి ఒక పవిత్ర సంస్కారాన్ని, ఆధ్యాత్మిక, సామాజిక, చట్టపరమైన హోదాను కల్పిస్తాయని న్యాయస్థానం వెల్లడించింది.  

ఏమిటీ కేసు?  
తాను ఎవరినీ పెళ్లి చేసుకోకపోయినా ఓ యువతి తన భార్యగా చెలామణి అయ్యేందుకు ప్రయత్నించిందని యూకేలో నివసించే కౌశల్‌ సోనార్‌ ఆరోపించాడు. ఆ యువతి అహ్మదాబాద్‌లో నివసిస్తోందని, ఆమె తన తల్లిదండ్రులను సంప్రదించి, తనను వివాహం చేసకున్నట్లుగా ఓ ధ్రువీకరణ పత్రాన్ని అందజేసిందని చెప్పాడు. ఆ తర్వాతే ఆమె గురించి తనకు తెలిసిందని అన్నాడు. చట్టబద్ధంగా జరిగిందని యువతి చెబుతున్న ఈ వివాహాన్ని రద్దు చేయాలని కోర్టును కోరాడు. ప్రతివాదిని తాను వివాహం చేసుకోలేదని, ఎలాంటి హిందూ ఆచారాలు, వేడుకలు నిర్వహించలేదని, ఆమెతో భర్తగా ఎప్పుడూ కలిసి జీవించలేదని పేర్కొన్నాడు.

తన సమ్మతి లేకుండా, మోసపూరితంగా వివాహ పత్రాలపై తన సంతకం తీసుకున్నారని ఆరోపించాడు. తమ మధ్య ఎటువంటి వివాహ సంప్రదాయాలు, వేడుకలు జరగలేదని, తాము ఎప్పుడూ భార్యాభర్తలుగా జీవించలేదని ప్రతివాది అయిన యువతి కూడా ఫ్యామిలీ కోర్టు ముందు అంగీకరించింది. అయినప్పటికీ కౌశల్‌ సోనార్‌ పిటిషన్‌ను కొట్టివేయడం ద్వారా ఫ్యామిలీ కోర్టు పొరపాటు చేసిందని హైకోర్టు పేర్కొంది. 

వివాహం పవిత్రమైన విధి  
హిందూ వివాహ చట్టంలోని సెక్షన్‌–7ను హైకోర్టు ప్రస్తావించింది. హిందూ వివాహాన్ని సంపూర్ణమైనదిగా, చట్టబద్ధమైనదిగా మార్చడానికి ఆచారాలు సంప్రదాయాల ప్రకారం వివాహాన్ని జరపడం గురించి ఈ సెక్షన్‌ చెబుతున్నట్లు గుర్తుచేసింది. వివాహానికి సంబంధించిన ఆచారాలు, వేడుకలు ఏవీ నిర్వహించబడలేదు కాబట్టి ఈ కేసులో హిందూ వివాహానికి ఉండాల్సిన ప్రాథమిక, అత్యవసరమైన అంశం లోపించినట్లు వెల్లడించింది. ‘‘హిందూ సంప్రదాయంలో భార్యను భర్తలో సగభాగంగా(అర్ధాంగిగా) పరిగణిస్తారు.

అదే సమయంలో ఆమెను తనదైన ప్రత్యేక గుర్తింపు కలిగిన వ్యక్తిగా, వివాహ బంధంలో సమాన భాగస్వామిగా కూడా గుర్తిస్తారు. హిందూ చట్టం ప్రకారం వివాహం అనేది ఒక పవిత్ర సంస్కారం. ఇది ఒక కొత్త కుటుంబానికి పునాదిగా నిలుస్తుంది. హిందూ వివాహం అంటే ఒక పవిత్రమైన విధి. భారతీయ సమాజంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఒక వ్యవస్థ. కాబట్టి వివాహ బంధంలోకి ప్రవేశించే ముందు యువతీయువకులు ఆ వ్యవస్థ గురించి తెలుసుకోవాలి. భారతీయ సమాజంలో పెళ్లికి ఉన్న పవిత్రతను అర్థం చేసుకోవాలి. వివాహం అంటే కేవలం పాటలు, నృత్యాలు, విందులు వినోదాలు చేసుకొనే సందర్భం మాత్రమే కాదు.

అదొక వాణిజ్యపరమైన లావాదేవీ కూడా కాదు. ఒక స్త్రీ, ఒక పురుషుడు వ్యక్తిగత బంధంలోకి ప్రవేశించి భవిష్యత్తులో కుటుంబాన్ని నిర్మించుకోవడానికి సంబంధించిన ఒక పవిత్రమైన, కీలకమైన ఘట్టం. వివాహం ఎంతో పవిత్రమైనది. ఎందుకంటే అది ఇద్దరు వ్యక్తుల మధ్య జీవితకాలం నిలిచే, గౌరవప్రదమైన, సమానమైన, పరస్పర అంగీకారంతో కూడిన ఆరోగ్యకరమైన బంధాన్ని ఏర్పరుస్తుంది. ఆచారాలు, సంప్రదాయాలను సక్రమంగా పాటించినప్పుడు, ఇది ఒక వ్యక్తి మోక్షాన్ని పొందడానికి సహాయపడే సంఘటనగా కూడా పరిగణిస్తారు. అందుకే రిజిస్ట్రేషన్ జరిగి, మ్యారేజ్‌ సరి్టఫికెట్‌ ఉన్నంత మాత్రాన అది చట్టబద్ధమైన పెళ్లిగా భావించలేం’’ అని హైకోర్టు తేల్చిచెప్పింది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement