గాంధీనగర్ : దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన 2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు అత్యంత కీలకమైన, చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఈ ఘోర ఉగ్రవాద దాడికి పాల్పడిన 38 మంది నిందితులకు కింది కోర్టు (ప్రత్యేక న్యాయస్థానం) విధించిన ఉరిశిక్షను హైకోర్టు ధర్మాసనం పూర్తిగా సమర్థిస్తూ ఖరారు చేసింది.
అలాగే, మరో 11 మందికి విధించిన యావజ్జీవ కారాగార శిక్షను కోర్టు సమర్థించింది. భారత న్యాయ చరిత్రలోనే ఒకే కేసులో ఇంతపెద్ద సంఖ్యలో (38 మందికి) మరణశిక్షలు ఖరారు కావడం ఇదే ప్రథమం.
జస్టిస్ అల్పేష్ కొగ్జే, జస్టిస్ సమీర్ దవేలతో కూడిన గుజరాత్ హైకోర్టు ధర్మాసనం గత రెండున్నరేళ్లుగా దాదాపు 248 సార్లు అప్పీళ్లపై సుదీర్ఘ విచారణ జరిపిన అనంతరం నేడు ఈ తుది తీర్పును ప్రకటించింది. నిషేధిత ఉగ్రవాద సంస్థలు ఇండియన్ ముజాహిదీన్, సిమిలకి చెందిన ఉగ్రవాదులు కలిసి ఈ దారుణ కుట్రకు పాల్పడినట్లు ప్రాసిక్యూషన్ కోర్టులో బలంగా నిరూపించింది. దీంతో నిందితులపై దేశద్రోహం, హత్య నేరాలతో పాటు కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టం ఉపా కింద మోపిన చార్జీలను న్యాయస్థానం సమర్థించింది.
జులై 26, 2008న గుజరాత్‌లోని ప్రముఖ వాణిజ్య నగరం అహ్మదాబాద్‌లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. కేవలం 70 నిమిషాల స్వల్ప వ్యవధిలోనే ఏకంగా 21 ప్రాంతాల్లో వరుస బాంబు పేలుళ్లతో విరుచుకుపడ్డారు. రద్దీగా ఉండే మార్కెట్లు, బస్సులు మాత్రమే కాకుండా, మొదటి విడత పేలుళ్లలో గాయపడిన క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్న సివిల్ హాస్పిటల్‌ను టార్గెట్ చేస్తూ ఉగ్రమూకలు రెండో విడత బాంబులు పేల్చడం గమనార్హం. ఈ అమానవీయ ఘాతుకంలో 56 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా, 246 మంది తీవ్రంగా గాయపడ్డారు.
తీర్పుతో పాటు బాధితులకు ఆర్థిక ఉపశమనం కలిగించేలా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ పేలుళ్లలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన బాధితులకు రూ.5 లక్షలు,సాధారణంగా గాయపడిన వారికి రూ. 1 లక్ష చొప్పున నష్టపరిహారం చెల్లించాలని గుజరాత్ ప్రభుత్వానికి సూచించింది. ఈ నష్టపరిహార ప్రక్రియ మొత్తాన్ని మార్చి 31, 2027 లోగా పూర్తి చేయాలని న్యాయస్థానం గడువు విధించింది.


