‘పామాయిల్‌’ సెగ తగ్గేదెలా!

Govt Issues Clarification On Country Edible Oil Situation - Sakshi

ఎగుమతులపై ఇండోనేషియా నిషేధం నేపథ్యంలో హై అలర్ట్‌

అర్జెంటీనా, బ్రెజిల్‌ దేశాల నుంచి

సరఫరా పెంచేలా వ్యూహాలు

పామాయిల్‌ సహా ఇతర నూనెల దిగుమతులపై సెస్‌ తగ్గించే యోచనలో కేంద్రం

ఇప్పటికైతే సరిపడినన్ని నిల్వలున్నాయని కేంద్ర సర్కారు వర్గాల వెల్లడి

దేశవ్యాప్తంగా రోజురోజుకీ పెరుగుతున్న వంట నూనెల ధరలపై తీవ్ర ఆందోళనతో ఉన్న కేంద్రం ప్రభుత్వం వీటి ధరలను అందుబాటులోకి తెచ్చే మార్గాలపై అన్వేషణ చేస్తోంది. ముఖ్యంగా భారత్‌కు అతిపెద్ద పామాయిల్‌ ఉత్పత్తిదారుగా ఉన్న ఇండోనేషియా ప్రకటించిన ఎగుమతులపై ఆకస్మిక నిషేధం ప్రభావం ప్రజలపై పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై సమాలోచనలు జరుపుతోంది. ఇందులో భాగంగా వంట నూనెల దిగుమతులపై విధించే సెస్‌ను తగ్గించాలని యోచిస్తోంది. మరోపక్క వంట నూనెల ప్రధాన ఎగుమతిదారులైన బ్రెజిల్, అర్జెంటీనాల నుంచి దిగుమతులు పెంచేకునే మార్గాలను వెతుకుతోంది.

భారత్‌లో వంట నూనెల అవసరాల్లో 70 శాతం ఇతర దేశాల నుంచి దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. మొత్తంగా దిగుమతి అవుతున్న నూనెల్లో 50 శాతం పామాయిల్‌ ఉంటుండగా, దీనిలో ఇండోనేషియో వాటానే ఏకంగా 47 శాతానికి పైగా ఉంది. ఏటా ఇండోనేషియో నుంచి 8.8 మిలియన్‌ టన్నుల పామాయిల్‌ భారత్‌కు ఎగుమతి అవుతోంది. అయితే అక్కడి ప్రభుత్వం స్థానిక మార్కెట్‌లలో ధరలను తగ్గించేందుకు వీలుగా ఏప్రిల్‌ 28 నుంచి ఎగుమతులపై నిషేధం విధించింది. దీని ప్రభావం భారత్‌పై తీవ్రంగా పడనుంది.

దీనికి తోడు ఇప్పటికే ఉక్రెయిన్‌–రష్యా యుధ్దం కారణంగా సన్‌ఫ్లవర్‌ నూనెల సరఫరా తగ్గింది. రష్యా నుంచి 60 శాతానికి పైగా సన్‌ఫ్లవర్‌ నూనె మన దేశానికి  ఎగుమతి అవుతుండగా, తూర్పు యూరప్‌లో వివాదం కారణంగా వీటి రవాణాలో వేగం తగ్గింది. యుధ్దం కొనసాగినంత కాలం నూనెల సరఫరాల్లో ఆటంకాలు తప్పేలా లేవు. ఈ కారణాల రీత్యా ఇప్పటికే గత ఫిబ్రవరిలో పామాయిల్‌ లీటర ధర రూ.120–130 వరకు ఉండగా.. అది ఇప్పుడు రూ.165–175కి చేరింది. ఈ ధర మరో 20 నుంచి 25 శాతానికి పెరిగే అవకాశాలున్నట్లు మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పామాయిల్‌ సరఫరా పెంచే మార్గాలను కేంద్రం అన్వేషిస్తోంది.  

ఎగుమతులకు ప్రోత్సాహం..లభ్యత పెంచడం
పామాయిల్‌ ఎగుమతులపై ఇండోనేషియా నిషేధంతో తలెత్తిన తక్షణ సంక్షోభాన్ని అధిగమించేలా దేశంలో తగినంత వంటనూనెల నిల్వలు ఉన్నాయని కేంద్రం చెబుతోంది. దేశంలో నెలకు సగటు పామాయిల్‌ వినియోగం 1–1.10 మిలియన్‌ టన్నుల మేర ఉండగా, ప్రస్తుతం దేశంలో 2.1 మిలియన్‌ టన్నుల మేర నిల్వలుండగా, మరో 1.2 మిలియన్‌ టన్నులు ఈ నెలాఖరుకు దేశానికి చేరుతాయని అంచనా వేసింది. అంటే మూడు నెలల అవసరాలకు సరిపడా నిల్వలున్నాయని అంటోంది. ఒకవేళ అప్పటికీ ఇండోనేషియా నిషేధం కొనసాగిన పక్షంలో అర్జెంటీనా, బ్రెజిల్, మలేషియా దేశాల నుంచి ఎగమతులను ప్రోత్సహించాలని కేంద్రం భావిస్తోంది.

దీనిలో భాగంగానే వంట నూనెలపై విధిస్తున్న వ్యవసాయ మౌలిక సదుపాయిల సెస్‌ను తగ్గించాలనే ఆలోచనలో ఉంది. నిజానికి గత నవంబర్‌లోనే ప్రభుత్వం పామాయిల్‌పై  సెస్‌ను 20 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గించగా, సోయాబీన్, సన్‌ఫ్లవర్‌ నూనెలపై 5 శాతానికి తగ్గించింది.. దీనిని మరో 5 శాతం తగ్గించే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దిగుమతి సుంకాలను తగ్గించడం ద్వారా ఎగుమతులను ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటోంది. మరోపక్క ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ భయాలను రేకెత్తిస్తున్న నేపథ్యంలో..  ఆకస్మిక ఎగుమతి నిషేధంపై ఇండోనేషియాతో భారత్‌ ద్వైపాక్షిక చర్చలు కూడా నిర్వహించే అవకాశం ఉందని ప్రభుత్వంలోని కీలక అధికారుల నుంచి సమాచారం అందుతోంది.
– సాక్షి, న్యూఢిల్లీ

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top