Bihar Govt: ప్రభుత్వ ఉద్యోగుల రెండో పెళ్లికి అక్కడ పర్మిషన్‌ తప్పనిసరి

Govt Employees Must Seek Permission To Remarry In Bihar - Sakshi

పాట్నా: ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనాసరే రెండో పెళ్లి చేసుకోవాలంటే.. సంబంధిత ఉన్నతాధికారుల అనుమతిని తప్పనిసరి చేస్తూ బీహార్‌ ప్రభుత్వం ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. భార్య/భర్త బతికి ఉండగానే, అలాగే విడాకులు తీసుకోకుండానే చాలామంది రెండో పెళ్లిళ్లు చేసుకుంటుండడం, ఆపై ఉద్యోగం, పెన్షన్‌.. సంబంధిత వివాదాలు, న్యాయపరమైన చిక్కులు తలెత్తుతుండడంతో ఈ చర్యకు ఉపక్రమించింది. 

ఈ మేరకు బీహార్‌ ప్రభుత్వం తాజాగా ఓ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సంబంధిత విభాగపు ఉన్నతాధికారి నుంచి అనుమతి తీసుకున్నాకే ప్రభుత్వ ఉద్యోగులు  రెండో వివాహానికి ఉపక్రమించాలని ఆ నోటిఫికేషన్‌లో పేర్కొంది. అంతేకాదు.. ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ల వైవాహిక స్థితి గురించి తప్పనిసరిగా ఉన్నతాధికారులకు నివేదించాలని తెలిపింది.

ఒకవేళ రెండో వివాహం చేసుకోవాలనుకుంటే.. విడాకులు అయిన విషయాన్ని, భార్య చనిపోయిన విషయాన్ని సంబంధిత అధికారులకు తెలియజేసి.. ఆపై అనుమతితోనే రెండో వివాహం చేసుకోవాలని స్పష్టం చేసింది. ఒకవేళ మొదటి భార్యగానీ, భర్తగానీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తే గనుక.. రెండో భార్య, భర్తకు ఎలాంటి ప్రభుత్వ సదుపాయాలు అందవని ఆ నోటిఫికేషన్‌లో తెలిపింది. పైఅధికారులకు తెలియజేయకుండా రెండో వివాహం గనుక చేసుకుంటే.. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు, ఇతర సదుపాయాలు అందవని తెలియజేసింది. అలాంటి సమయంలో మొదటి భాగస్వామి ద్వారా పిల్లలు ఉంటే.. వాళ్లకే ప్రాధాన్యత ఇస్తుందని బీహార్‌ ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top