సీడీఎస్‌గా జనరల్‌ చౌహాన్‌ బాధ్యతలు

Gen Anil Chauhan takes charge as India new Chief of Defence Staff - Sakshi

న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత సీనియర్‌ కమాండర్, ఈస్టర్న్‌ ఆర్మీ మాజీ కమాండర్‌ జనరల్‌ చౌహాన్‌ కొత్త చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) అయ్యారు. దేశ మొట్టమొదటి సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ 9 నెలల క్రితం తమిళనాడులో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన స్థానం జనరల్‌ చౌహాన్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. దేశం ముందున్న భవిష్యత్‌ భద్రతా సవాళ్లకు త్రివిధ దళాలను సన్నద్ధం చేయడం, ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన థియేటర్‌ ప్లాన్‌ను అమలు చేయడం జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ ప్రధాన లక్ష్యాలు. ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.

డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మిలటరీ ఎఫైర్స్‌కు సెక్రటరీగాను ఆయన వ్యవహరిస్తారు. సరిహద్దుల్లోని తూర్పు లద్దాఖ్‌లో డ్రాగన్‌ దేశంతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో చైనా వ్యవహారాల్లో నిపుణుడిగా పేరున్న జనరల్‌ చౌహాన్‌ను అత్యున్నత హోదాలో కేంద్రం నియమించడం గమనార్హం. ‘భారత సైనిక బలగాల్లో అత్యున్నత హోదాను చేపట్టినందుకు గర్వంగా ఉంది. త్రివిధ దళాలు నాపై ఉంచిన అంచనాలను అందుకునేందుకు నా వంతు కృషి చేస్తాను. అన్ని సవాళ్లను, ఇబ్బందులను కలిసికట్టుగా ఎదుర్కొంటాం’ అని ఈ సందర్భంగా జనరల్‌ చౌహాన్‌ అన్నారు.  రైజినా హిల్స్‌లోని సౌత్‌ బ్లాక్‌ వద్ద జరిగిన కార్యక్రమంలో జనరల్‌ చౌహాన్‌ త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు.   1961లో జన్మించిన జనరల్‌ చౌహాన్‌ 1981లో భారత సైన్యంలోని 11 గూర్ఖా రైఫిల్స్‌లో చేరారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top