60 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం
ఈ ఘటనపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సీరియస్, నివేదిక కోరిన సంస్థ
గుజరాత్‌లోని దాహోద్ జిల్లాలో జరిగిన ఒక పెళ్లి వేడుక దుమారాన్ని రాజేసింది.పెళ్లి విందులో ఫుడ్ పాయిజన్ కారణంగా సుమారు 400 మందికి పైగా అతిథులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సుమారు 400 మందికి పైగా వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డారు. వీరిలో 60 మంది పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఈ ఘటనపై భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) స్పందించింది.
దాహోద్ జిల్లాలోని అభ్లోద్ గ్రామంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రి విందు భోజనం చేసిన తర్వాత, రాత్రి 11 గంటల సమయంలో ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. ఒక్కొక్కరికి వాంతులు, విరేచనాలు కావడంతో ఆందోళన మొదలైంది. ఆ తరువాత కుటుంబ సభ్యులు, స్థానికులు బాధితులను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఆరోగ్య శాఖ అధికారులు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. దాహోద్ కలెక్టర్ యోగేష్ నిర్గుడే తెలిపిన వివరాల ప్రకారం, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల పరిస్థితి ప్రస్తుతం స్థిరంగానే ఉంది. పెళ్లి విందులో వడ్డించిన మామిడి రసం (Mango Juice) తాగడం వల్లే ఈ సమస్య తలెత్తి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
ఇదీ చదవండి: కేరళంలో భారీ పేలుడు, పలువురు మృతి
FSSAI సీరియస్
కేంద్ర ఆహార నియంత్రణ సంస్థ (FSSAI) ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనపై సమగ్ర నివేదిక సమర్పించాలని గుజరాత్ రాష్ట్ర ఆహార కమిషనర్‌ను ఆదేశించింది. విందులో వడ్డించిన ఆహార పదార్థాల నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. ప్రాథమిక అంచనా ప్రకారం, ఆహారం కలుషితం కావడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. ఆహార నమూనాలను సేకరించి, పరీక్షలు నిర్వహించడంలో రాష్ట్ర అధికారులకు సహాయం చేస్తోంది. దర్యాప్తులో దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని FSSAI స్పష్టం చేసింది.


