కోమాలోనే ప్రణబ్‌ ముఖర్జీ

Former President Pranab Mukherjee in coma - Sakshi

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని, ప్రస్తుతం ఆయన కోమాలోకి వెళ్లిపోయారని న్యూఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రెఫరెల్‌ ఆసుపత్రి గురువారం తెలిపింది.  ప్రణబ్‌ చికిత్సకు మెల్లిగా స్పందిస్తున్నారని, పరిస్థితి నిలకడగా ఉందని ఆయన కుమారుడు అభిజిత్‌ ముఖర్జీ తెలిపారు. ‘నా తండ్రి ఒక పోరాటయోధుడు. చికిత్సకు నెమ్మదిగా స్పందిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థించాల్సిందిగా శ్రేయోభిలాషులను కోరుతున్నాను’అని అభిజిత్‌ ట్వీట్‌ చేశారు. మెదడులో ఏర్పడ్డ అడ్డంకిని తొలగించేందుకు ప్రణబ్‌ ఆగస్టు 10న ఆసుపత్రిలో చేరగా ఆయనకు కోవిడ్‌ సోకినట్లు నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.

అదే రోజు ఆయనకు మెదడు శస్త్రచికిత్స జరిగింది. మరోవైపు ప్రణబ్‌ మరణించారన్న వదంతులు  ప్రబలడంతో ఆయన కుమారుడు అభిజిత్‌  వాటిని కొట్టిపారేశారు. ‘‘మా తండ్రి శ్రీ ప్రణబ్‌ బతికే ఉన్నారు.  పేరు ప్రఖ్యాతులున్న జర్నలిస్టులే ఊహాగానాలు, తప్పుడు వార్తలు ప్రసారం చేయడం భారత మీడియా రంగం నకిలీ వార్తల ఫ్యాక్టరీగా మారిందన్న ఆరోపణలకు అద్దం పట్టేదిలా ఉంది’’అని  ట్వీట్‌ చేశారు.  ‘‘మా తండ్రికి సంబంధించి వస్తున్న వార్తలన్నీ వదంతులే. ఆసుపత్రి నుంచి వచ్చే సమాచారం కోసం ఫోన్‌ అందుబాటులో ఉంచాల్సిన అవసరమున్న నేపథ్యంలో ఎవరూ.. మరీ ముఖ్యంగా మీడియా మిత్రులు నన్ను సంప్రదించవద్దు అని విజ్ఞప్తి చేస్తున్నా’’అని ప్రణబ్‌ కుమార్తె షర్మిష్ట ట్వీట్‌ చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top