మాజీ గవర్నర్‌ కన్నుమూత | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని, సీఎం సంతాపం

Published Tue, Feb 16 2021 4:44 PM

Former Governo Justice M Rama Jois passes away in Bengaluru - Sakshi

బెంగళూరు: జార్ఖండ్, బిహార్‌‌ రాష్ట్రాలకు గవర్నర్‌గా పని చేసిన జస్టిస్‌ రమా జోయిస్‌ (89) కన్నుమూశారు. బెంగళూరులో అనారోగ్యంతో ఆయన మృతిచెందారు. ఆయన మృతికి ఉప రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, కేంద్రమంతులు, కర్నాటక ముఖ్యమంత్రి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. గవర్నర్‌ కన్నా ముందు రమా జోయిస్‌ న్యాయమూర్తిగా, చరిత్రకారుడిగా ప్రసిద్ధి చెందాడు. పంజాబ్‌, హరియాణా హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించారు. ఆయన సేవలను గుర్తించి ఎన్డీఏ ప్రభుత్వం ఆయనకు గవర్నర్‌ బాధ్యతలు అప్పగించింది.

1932 జూలై 27వ తేదీన కర్నాటకలోని శివమొగ్గలో రమా జోయిస్‌ జన్మించారు. 1959లో న్యాయవాద వృత్తిలోకి వచ్చారు. అంచలంచెలుగా ఎదుగుతూ పంజాబ్‌, హరియాణా హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, రాజ్యసభ సభ్యుడిగా విధులు నిర్వర్తించారు. చాలా రచనలు చేశారు. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని పదిలపర్చేందుకు కృషి చేశారు.
 

అత్యవసర పరిస్థితి కాలంలో రమా జోయిస్‌ అటల్‌ బిహారీ వాజ్‌పేయితో కలిసి జైల్లో ఉన్నారు. ఆ పరిచయం కొనసాగింది. పదవీ విరమణ అనంతరం 2000 సంవత్సరంలో ఎన్డీఏ ప్రభుత్వం రమా జోయిస్‌ను గవర్నర్‌గా నియమించింది. జార్ఖండ్, బిహార్‌‌ రాష్ట్రాలకు అతి కొద్దికాలం మాత్రమే గవర్నర్‌గా కొనసాగారు. అనంతరం రాజ్యసభ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు. ఆయన రాసిన ఎన్నో రచనలు భావి న్యాయవాదులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. 

ఆయన మృతికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, నిర్మలా సీతారామన్‌, కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప సంతాపం వ్యక్తం చేశారు. ఆయన సేవలను కీర్తించారు.
 

Advertisement
Advertisement