403.5 మిలియన్‌ ఖాతాలు.. 1.30 లక్షల కోట్ల డిపాజిట్లు

Finance Ministry Says Over 400 Million Poor Have Access To Banks PMJDY - Sakshi

‘ప్రధాన మంత్రి జన్‌ధన్‌ యోజన’ ప్రారంభించి సరిగ్గా ఆరేళ్లు

సంతోషంగా ఉంది.. అందరికీ ధన్యవాదాలు: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: దేశంలోని ప్రతి కుటుంబానికి బ్యాంక్ ఖాతా ఉండాలని, ప్రజలందరినీ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములను చేయడం కోసం ఉద్దేశించిన ప్రధాన మంత్రి జన్‌ధన్‌ యోజన(పీఎంజేడీవై) ద్వారా ఇప్పటి వరకు 403.5 మిలియన్‌ ఖాతాలు తెరచినట్లు కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. ఈ అకౌంట్లలో ఇప్పటి వరకు లక్షా ముప్పై వేల కోట్లకు పైగా డబ్బు డిపాజిట్‌ అయినట్లు తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. కాగా సంక్షేమ పథకాల లబ్దిదారులు, పేదలకు ప్రత్యక్ష నగదు బదిలీ చేసేందుకు నరేంద్ర మోదీ సర్కారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తన ప్రసంగంలో భాగంగా 2014లో ఈ పథకం గురించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేశారు. (చదవండి: ప్ర‌భుత్వ వైఫ‌ల్యానికి విద్యార్ధులు బాధ్యులా?)

ఈ క్రమంలో ఆగష్టు 28న ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. నేటితో ఈ కార్యక్రమానికి ఆరేళ్లు పూర్తైన సందర్బంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్‌ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు.. ‘‘బ్యాంకు అకౌంట్లు లేని వాళ్లకు ఖాతాలు తెరిచే లక్ష్యంతో.. ఇదే రోజు, ఆరు సంవత్సరాల క్రితం ప్రధాన్‌ మంత్రి జన్‌ ధన్‌ యోజనను ప్రారంభించాము. ఇదొక గేమ్‌ఛేంజర్‌ వంటిది. కోట్లాది మందికి ప్రయోజనం చేకూర్చింది. ఎంతో మందికి భద్రతతో కూడిన భవిష్యత్తును అందించింది. ఈ పథకంలో ఎక్కువ మంది లబ్దిదారులు గ్రామీణ ప్రాంతాల ప్రజలు, మహిళలే. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నిర్విరామంగా కృషి చేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు.  ( చదవండి: స్వావలంబనతో ప్రతిష్ట పెరుగుతుంది!)

బీమా సౌకర్యం
పీఎంజేడీవై ఖాతాదారులందరికీ ప్రధాన్‌ మంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన, ప్రధాన్‌ మంత్రి సురక్ష బీమా యోజన తదితర పథకాల కింద ఇన్పూరెన్స్‌ సౌకర్యం కల్పించే దిశగా ప్రణాళికలు రచిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఇప్పటికే వివిధ బ్యాంకులతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. అదే విధంగా ద్వారా డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడం,  రూపే డెబిట్‌ కార్డు వినియోగాన్ని పెంచడం, మైక్రో క్రెడిట్‌ కార్డు, మైక్రో ఇన్వెస్ట్‌మెంట్‌ సౌకర్యం కల్పించడం తదితర కార్యకలాపాలను ముమ్మరం చేయనుంది. 

మహిళా ఖాతాదారులు 55.2 శాతం
ఇక ఆగష్టు 19న విడుదల చేసిన ఓ ప్రకటన ప్రకారం, పీఎండీజేడీవై అకౌంట్లలో 63.6 శాతం గ్రామీణ ప్రాంతాలకు చెందినవి కాగా, 55. 2 శాతం ఖాతాలు మహిళలవే. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ కాలంలో సంక్షేమ పథకాల ఫలాలను అందించడం సులభతరమైందని ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం దృష్ట్యా తమ ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాగా జన్ ధన్ ఖాతా అనేది జీరో అకౌంట్‌. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా ఓపెన్‌ చేయొచ్చు. కార్పొరేషన్ బ్యాంకులతో పాటు.. పోస్టాఫీస్‌లో కూడా ఈ అకౌంట్‌ను తెరవచ్చు. 

ఇందుకోసం ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు, నివాస పత్రం, రెండు ఫోటోలు ఉంటే చాలు. అయితే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిబంధనల ప్రకారం రెండేళ్ల పాటు ఈ ఖాతా ద్వారా ఎలాంటి లావాదేవీలు జరగనట్లయితే ఇది పనిచేయకుండా పోతుంది. ఇక అకౌంట్‌ నిర్వహణకు సంబంధించిన వివరాలకై ‘‘జన్‌ ధన్‌ దర్శక్‌ యాప్‌’’అనే మొబైల్‌ అప్లికేషన్‌ ఇన్‌స్టాల్‌ చేసుకుంటే సమీపంలోని బ్యాంకు శాఖలు, ఏటీఎంలు, బ్యాంకు మిత్రలు, పోస్ట్‌ ఆఫీసు వివరాలు తెలుసుకోవచ్చు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top